
- కొవిడ్ టైమ్‌లో ఇచ్చినట్టే మద్ధతుగా ఉంటాం: ఆర్బీఐ
ముంబై: అమెరికా టారిఫ్‌ల వలన తీవ్రంగా ప్రభావితమయ్యే సెక్టార్లకు ఆర్‌బీఐ ఆర్థికంగా మద్ధతు ఇస్తుందని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నారు. సోమవారం జరిగిన ఎఫ్‌ఐబీఏసీ బ్యాంకింగ్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కోవిడ్ సమయంలో ఆర్‌బీఐ టర్మ్ లోన్లపై మారటోరియం, ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్ సౌలభ్యం కల్పించి, మానిటరీ పాలసీ ద్వారా ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలిచిందని గుర్తుచేశారు.
“అమెరికాకు జరిపే ఇండియా ఎగుమతుల్లో 45శాతానికి ప్రస్తుత టారిఫ్ పడడం లేదు. మిగిలిన 55శాతంలో జెమ్స్ అండ్ జ్యువెలరీ, టెక్స్‌టైల్స్, ఆటో పార్ట్స్, రొయ్యలు ఉన్నాయి. ఈ సెక్టార్లలోని ఎంఎస్‌ఎంఈలపై ప్రభావం ఉండొచ్చు” అని చెప్పారు. ఆర్‌బీఐ ఇప్పటికే రెపో రేటును 100 బేసిస్ పాయింట్లు తగ్గించి లిక్విడిటీ పెంచిందని, అవసరమైన మద్దతు అందించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత వస్తువులపై అమెరికా 25 శాతం టారిఫ్ వేస్తుండగా, ఈ నెల 27 నుంచి మరో 25 శాతం విధించనుంది.
రూపాయిల్లో వాణిజ్యం అవసరం..
గ్లోబల్ ట్రేడ్‌లో రూపాయి ప్రాధాన్యత పెంచుతున్నామని మల్హోత్రా అన్నారు. “దేశీయ కరెన్సీలో వాణిజ్యం అభివృద్ధి చేయడం చాలా ముఖ్యం. విదేశీ కరెన్సీల్లో తీవ్ర ఒడిదుడుకులు ఉంటే ఎదుర్కోవడానికి వీలుంటుంది” అని వివరించారు. మాల్దీవులు, మారిషస్, ఇండోనేషియా, యూఏఈతో దేశీయ కరెన్సీలో వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయని, మరిన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటామని వివరించారు. బ్యాంకింగ్ కరస్పాండెంట్లను పెంచితే బ్యాంకింగ్ సర్వీస్‌లను విస్తరించొచ్చని చెప్పారు.