సీఎం క్యాంప్​ ఆఫీసులో ప్రజా దర్బార్​ నిర్వహిస్తాం : కేటీఆర్

సీఎం క్యాంప్​ ఆఫీసులో ప్రజా దర్బార్​ నిర్వహిస్తాం : కేటీఆర్

రాష్ట్రంలో మూడోసారీ తమ ప్రభుత్వమే రాబోతున్నదని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ ​కొడతారని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి సీఎం క్యాంప్​ ఆఫీసులో ప్రజా దర్బార్​ నిర్వహిస్తామని ప్రకటించారు. శుక్రవారం హైదరాబాద్ ప్రెస్​క్లబ్ ఆధ్వర్యంలో ఒక హోటల్‌లో నిర్వహించిన ‘తెలంగాణ ఎలక్షన్స్ వే ఫార్వర్డ్ ఫర్​నెక్ట్స్ డికేడ్’ అంశంపై మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. ‘‘సీఎంను కలిసే సమస్యలు చెప్పుకోవాలని ప్రజలు కోరుకుంటే అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ముఖ్యమంత్రిని కలువాల్సిన అవసరం లేకుండానే క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కరిస్తున్నాం. అందుకే ప్రజా దర్బార్‌‌లు వద్దనుకున్నాం. అధికారుల స్థాయిలో పరిష్కరించాల్సిన రేషన్​కార్డులు, పెన్షన్లు సహా ఇతర సమస్యల కోసం సీఎం వద్దకు రావాల్సిన అవసరం లేదని అనుకున్నాం. అంతేతప్ప ప్రజలను కలువొద్దని కాదు” అని అన్నారు. 

ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి అన్ని సమస్యలను పరిష్కరించాలని కొందరు కోరుకుంటున్నారని అన్నారు. పీఎం కిసాన్​కు సీఈసీ అనుమతి ఇచ్చిందని, ఈ క్రమంలోనే రైతుబంధు పంపిణీకి క్లియరెన్స్ వచ్చిందన్నారు. ఉద్యోగులకు సంబంధించిన డీఏలు ఇవ్వాల్సి ఉందని, వాటికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. సీఎం కావాలనే కోరిక తనకు లేదని కేటీఆర్ చెప్పారు. తనకు దక్కిన స్థానంతో సంతృప్తిగా ఉన్నానని తెలిపారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రతిపక్షాలు చెప్తున్నవన్నీ అబద్ధాలేనని, తొమ్మిదిన్నరేళ్లలోనే 1.62 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. అదే సమయంలో ప్రైవేట్​ రంగంలోనూ పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని వివరించారు.