ఖమ్మం ప్రయోగాన్ని రాష్ట్రమంతా అమలుచేస్తాం

ఖమ్మం ప్రయోగాన్ని రాష్ట్రమంతా అమలుచేస్తాం
  • గత నెలలో 61 శాతం సాధారణ ప్రసవాలే...
  • హాస్పిటల్​లో 24 గంటలూ  గైనకాలజిస్ట్​ ఉండేలా చర్యలు 
  • కలిసి వచ్చిన మిడ్​వైఫ్ ​ట్రైనింగ్ ప్రోగ్రామ్​
  • కలెక్టర్ గౌతమ్​ను మెచ్చుకున్న మంత్రి హరీశ్​రావు 
  • ఖమ్మం ప్రయోగాన్ని రాష్ట్రమంతా అమలుచేస్తామన్న మినిస్టర్

ఖమ్మం, వెలుగు: నార్మల్ డెలివరీలను పెంచడం ద్వారా ఖమ్మం జిల్లా దవాఖానా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సాధారణ ప్రసవాల శాతం క్రమంగా పెరగడంతో కలెక్టర్​ వీపీ గౌతమ్ ను ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు మెచ్చుకున్నారు. నార్మల్​డెలివరీలు పెరిగేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని, ఇతర జిల్లా దవాఖానాల్లోనూ అదే పద్ధతి ఫాలో అయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. దీంతో జిల్లా దవాఖానా సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఒకటి రెండు రోజుల్లో నివేదిక సమర్పించనున్నారు. 

వర్కవుట్ అయిన ప్లాన్​

ఖమ్మం జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)లో నెలకు యావరేజీగా 600 నుంచి 700 వరకు డెలివరీలు జరుగుతాయి. ఇందులో ​సిజేరియన్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది జనవరిలో ఖమ్మం పర్యటనకు వచ్చిన మంత్రి హరీశ్​రావు ఆఫీసర్లపై సీరియస్​అయ్యారు. నార్మల్ డెలివరీలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో కలెక్టర్​ వీపీ గౌతమ్​ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు పెట్టుకుంటూ ఒక ప్లాన్​ప్రకారం ముందుకు పోయారు. దవాఖానా డాక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముహూర్తాలు పెట్టే అయ్యగార్లు, ప్రైవేట్ దవాఖానాల నిర్వాహకులు, ఐఎంఏ ప్రతినిధులతో కలెక్టర్​ వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి నార్మల్ డెలివరీలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వాళ్లకు పలు సూచనలు చేశారు. దీంతో ఇది కొంతవరకు వర్కవుట్​అయ్యింది. ఇక దవాఖానాలోని స్టాఫ్ నర్సులకు మిడ్ వైఫ్​ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మెంటార్ల ద్వారా ఇతర కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్​సీలలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులకు కూడా రెగ్యులర్ ​ట్రైనింగ్ ఇస్తున్నారు.  ప్రెగ్నెన్సీ కన్ఫామ్​అయిన వెంటనే దవాఖానాకు వచ్చే గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెలివరీ కోసం హాస్పిటల్​కు రాగానే సాధారణ కాన్పు అయ్యేలా చేయాల్సిన ఎక్సర్​ సైజ్​లు​ఏమిటి? యోగాలోఎలాంటి ఆసనాలు వేయాలి?  తీసుకోవాల్సిన ఫుడ్ ఏమటి? అన్న విషయాలను అర్థమయ్యేలా చెప్పారు.  మొదటిసారి నార్మల్ డెలివరీ అయితే, రెండో డెలివరీ కూడా నార్మల్ అయ్యే అవకాశం ఉండడంతో, మొదటి కాన్పు సాధారణ ప్రసవం అయ్యేలా ఫోకస్​ పెట్టారు. 

తప్పులను సరిదిద్దుకుని...
ప్రధానంగా ప్రభుత్వ దవాఖానాకు డెలివరీకి వచ్చినప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉండకపోవడం, హాస్పిటల్​నుంచి సిబ్బంది కాల్ చేసిన తర్వాత గైనకాలజిస్ట్ వచ్చి సిజేరియన్​ చేస్తున్న విషయాన్ని గుర్తించిన కలెక్టర్​ దాన్ని సరిదిద్దారు. దవాఖానాలో 24 గంటలు గైనకాలజిస్ట్ అందుబాటులో ఉండే విధంగా డాక్టర్ల సంఖ్యను 5 నుంచి 9కి పెంచారు. నైట్ డ్యూటీలో గైనకాలజిస్ట్ ను కంపల్సరీ చేశారు. కలెక్టర్​స్వయంగా ఒకట్రెండు సార్లు రాత్రి 10 గంటల సమయంలో ఆకస్మిక తనిఖీ చేసి డాక్టర్లు డ్యూటీలో ఉంటున్నారా లేదా చెక్​ చేశారు. డెలివరీ కోసం గర్భిణి వచ్చిన వెంటనే సిజేరియన్​చేయకుండా కనీసం 24 గంటల నుంచి 48 గంటల వరకు అబ్జర్వేషన్​లో ఉంచి నార్మల్ డెలివరీ అయ్యేట్టు చూడాలని చెప్పారు. అంతేగాకుండా పేషెంట్ అటెండెంట్ కంగారు పడకుండా నార్మల్ డెలివరీపై అవగాహన కల్పించేలా చేశారు. మరోవైపు  గవర్నమెంట్ దవాఖానాకు గర్భిణులు వచ్చిన టైంలో స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి జిల్లా స్థాయి లీడర్ల వరకు డాక్టర్లకు కాల్ చేసి వెంటనే ట్రీట్ మెంట్ స్టార్ట్​చేయాలంటూ పైరవీలు చేస్తుండడంతో...వాళ్లకు కూడా అవగాహన కల్పించేలా మీటింగ్ ఏర్పాటు చేశారు. పైరవీల వల్ల త్వరగా ఆపరేషన్ చేస్తే పేషెంట్ల ఆరోగ్యం దెబ్బతింటుందనే విషయంపై అవగాహన కల్పించారు. దీంతో ప్రభుత్వ దవాఖానా వ్యవహారాల్లో నేతలు జోక్యం చేసుకోకుండా చెక్ పెట్టారు. ఇక డెలివరీల కోసం ముహూర్తాలు పెడితే సీరియస్​ యాక్షన్​ తీసుకుంటామని అయ్యగార్లకు కూడా వార్నింగ్ ఇచ్చారు. 

టీమ్​ వర్క్​ వల్లే .. 
జిల్లాలో నార్మల్ డెలివరీల సంఖ్య పెరగడం అనేది టీమ్​వర్క్​ వల్లే సాధ్యమైంది. డ్యూటీ డాక్టర్లను పెంచడం ద్వారా ఎప్పుడు దవాఖానాకు వచ్చినా డాక్టర్ ఉంటారనే నమ్మకాన్ని కలిగించాం. ప్రైవేట్ దవాఖానాల్లో ఎక్కువ శాతం సిజేరియన్లు చేస్తున్న వాళ్లకు వార్నింగ్ ఇచ్చాం. త్వరలోనే అక్కడ కూడా ఎక్కువ సంఖ్యలో నార్మల్ డెలివరీలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.  
 – వీపీ గౌతమ్​, జిల్లా కలెక్టర్, ఖమ్మం 

మోటివేట్ చేశారు
రెగ్యులర్​ చెకప్​ కోసం దవాఖానాకు వస్తున్న టైం నుంచే నార్మల్ డెలివరీ అయ్యేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పారు. ఎక్సర్ సైజులు చేయడం, ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేయకూడదు అనే అంశాలను వివరించారు. దాన్ని ఫాలో అయ్యాను. నార్మల్ డెలివరీ అయింది. మూడు రోజుల్లో ఇంటికి వెళ్లడం సంతోషంగా ఉంది. 
–   పండ్ల మానస, నారాయణపురం, ఎర్రుపాలెం మండలం, ఖమ్మం జిల్లా