ఏడాదిలో 12 లక్షల వీసాలిస్తాం : యూఎస్ ఎంబసీ

ఏడాదిలో 12 లక్షల వీసాలిస్తాం : యూఎస్ ఎంబసీ
  • వచ్చే ఏడాది సమ్మర్ కల్లా పరిస్థితులు నార్మల్
  • వీసాల్లో ఇండియన్లకు టాప్ ప్రయారిటీ 

న్యూఢిల్లీ: వీసాల జారీలో ఇండియన్లకే టాప్ ప్రయారిటీ ఇస్తామని అమెరికన్ ఎంబసీ అధికారులు గురువారం వెల్లడించారు. వచ్చే ఏడాది సమ్మర్ కల్లా పరిస్థితి నార్మల్ అవుతుందని, కరోనాకు ముందున్నట్లే వీసా అపాయింట్మెంట్లకు వెయిటింగ్ టైం తక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది మధ్య నాటికి 12 లక్షల అప్లికెంట్లు ఉంటారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. నెలకు లక్ష చొప్పున 12 లక్షల వీసాలు జారీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. వీసాల జారీని వేగవంతం చేసేందుకు, వెయిటింగ్ టైం తగ్గించేందుకు ఎంబసీల్లో సిబ్బందిని పెంచుతున్నామన్నారు. వీసా అప్రూవల్ కు సుదీర్ఘ కాలం వెయిటింగ్ టైం ఉన్నందున అప్లికెంట్లకు డ్రాప్ బాక్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని కేటగిరీల వీసా అపాయింట్మెంట్లకు వెయిటింగ్ టైం 450 రోజుల నుంచి 9 నెలలకు తగ్గిందని చెప్పారు. 

వీసా రెన్యువల్ కు డ్రాప్ బాక్స్ లు  

ఇండియన్ లకు స్టూడెంట్ వీసాల్లో, ప్రధానంగా వీసా రెన్యువల్ కోసం అప్లై చేసుకున్న వాళ్లకు కూడా వెయిటింగ్ టైం తగ్గించేందుకు ప్రయారిటీ ఇస్తున్నామని యూఎస్ ఎంబసీ అధికారులు చెప్పారు. హెచ్ (హెచ్1బీ), ఎల్ కేటగిరీ వీసాల్లో ఇండియన్లకు గతం నుంచే ప్రయారిటీ ఇస్తున్నామని, వీరి కోసం సుమారు 10 లక్షల స్లాట్లను అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. బీ1, బీ2 కేటగిరీ (బిజినెస్, టూరిస్ట్) వీసా అపాయింట్మెంట్లకు కూడా వెయిటింగ్ టైం 450 రోజుల వరకు ఉండగా, తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. వీసా రెన్యువల్ చేసుకునే వాళ్లు ఇంటర్వ్యూలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డ్రాప్ బాక్స్ ఫెసిలిటీని తెస్తున్నామన్నారు. గత నాలుగేండ్లలో యూఎస్ వీసా కోసం అప్లై చేసుకున్న వాళ్లు ఈ డ్రాప్ బాక్స్ ఫెసిలిటీ పొందేందుకు అర్హులని పేర్కొన్నారు.

2023లో రెండో ప్లేస్​లోకి.. 

కరోనా ఆంక్షలు సడలించిన తర్వాత అమెరికాకు ఇండియాతో పాటు చైనా, మెక్సికో లాంటి అనేక దేశాల నుంచి వీసా అప్లికేషన్లు వెల్లువలా వచ్చాయి. ఇండియన్లకు గడిచిన ఏడాది కాలంలో 82 వేల వీసాలను జారీ చేశారు. మరోవైపు అమెరికా వీసాల్లో అత్యధికంగా మెక్సికో, చైనా దేశాల ప్రజలకు జారీ అవుతున్నాయి. ప్రస్తుతం అమెరికన్ వీసాల్లో ఇండియా మూడో స్థానంలో ఉంది. వచ్చే ఏడాదిలోనే చైనాను అధిగమించి ఇండియా రెండో స్థానంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.