హార్మూజ్‌‌‌‌ను తెరిచే ఉంచుతాం.. అవసరమైతే ఇరాన్ పోర్టుల దిగ్బంధనానికి సిద్ధం: ట్రంప్

హార్మూజ్‌‌‌‌ను తెరిచే ఉంచుతాం.. అవసరమైతే ఇరాన్ పోర్టుల దిగ్బంధనానికి సిద్ధం: ట్రంప్
  • అణు తనిఖీలకు ఇరాన్ పూర్తిగా అంగీకరించింది 
  • రికార్డు స్థాయిలో చమురు రవాణా.. ధరలు తగ్గుతున్నయన్న యూఎస్ ప్రెసిడెంట్ 
  • అణు తనిఖీలపై ఎలాంటి హామీలూ ఇవ్వలేదు: ఇరాన్  
  • హార్మూజ్ తమ నియంత్రణలోనే ఉంటుందని ప్రకటన  
  • హార్మూజ్‌‌‌‌పై మాకే హక్కులు: ఒమన్, ఇరాన్

వాషింగ్టన్: ఇరాన్‌‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని, ప్రస్తుత దశలో హార్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌‌పై అమెరికా మళ్లీ నౌకాదళ దిగ్బంధనాన్ని విధించే అవకాశం ఎంతమాత్రం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

అయితే, అమెరికా నౌకాదళాలు ఈ ప్రాంతంలోనే మోహరించి ఉంటాయని, అవసరమైతే వెంటనే మళ్లీ దిగ్బంధనం చేస్తామని ఇరాన్‌‌ను హెచ్చరించారు. మంగళవారం తన ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఈ మేరకు పోస్టు పెట్టారు.

‘‘హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడానికి, ఎలాంటి నౌకాదళ దిగ్బంధనం విధించకుండా ఉండటానికి అంగీకరించాను. ఒకవేళ మళ్లీ దిగ్బంధనం విధించాల్సి వస్తే సిద్ధంగా ఉన్నాం. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ అవకాశం లేదు’’ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో సుదీర్ఘ కాలం పాటు అత్యున్నత స్థాయి అణు తనిఖీలకు ఇరాన్ సంపూర్ణంగా అంగీకరించిందని కూడా ట్రంప్ తెలిపారు. ఇరాన్ ఈ తనిఖీల డిమాండ్‌‌ను ఇరాన్ తిరస్కరించి ఉంటే గనక ఇకపై ఎలాంటి చర్చలు ఉండేవి కావన్నారు. ఇరాన్‌‌కు ఆంక్షల నుంచి ఉపశమనం కలిగించే అంశంపైనా ఆయన స్పందించారు.

అమెరికా ట్రెజరీ విడుదల చేసే నిధులను నేరుగా ఇరాన్‌‌కు బదిలీ చేయకుండా, తన ప్రభుత్వ నియంత్రణలో ఉండే ఒక ఎస్క్రో ఖాతాలో ఉంచుతామని చెప్పారు. ఈ నిధులను మానవతా దృక్పథంతో కేవలం అమెరికా ఉత్పత్తిదారుల నుంచి మొక్కజొన్న, గోధుమలు, సోయాబీన్స్ వంటి ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని వివరించారు. 

అలాగే, శాంతి కొనసాగడానికి ఇరాన్ నుంచి లభించే గౌరవం అత్యంత కీలకమని ట్రంప్ అన్నారు. ‘‘వారు మనల్ని గౌరవించినంత కాలం, మనకు ఎలాంటి సమస్యా ఉండదు. భయం అనే పదాన్ని నేను ఉపయోగించాలనుకోవడం లేదు’’ అని చెప్పారు. ‘‘సోమవారం ఒక్కరోజే హార్మూజ్ నుంచి 19 మిలియన్ బ్యారెళ్ల చమురు బయటకు వచ్చింది. ఇది ఆల్‌‌టైమ్ రికార్డు. చమురు ధరలు వేగంగా పడిపోతున్నాయి. ప్రపంచం ఇప్పుడు చాలా సురక్షితమైన ప్రదేశంగా మారింది’’ అని ఆయన పేర్కొన్నారు.

హక్కులు మాకే.. ఒమన్, ఇరాన్
అంతర్జాతీయ నౌకాయానం కోసం హార్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడానికి తాము నిబద్ధతతో పని చేస్తున్నామని ఒమన్, ఇరాన్ ఉమ్మడిగా ప్రకటించాయి. కీలకమైన జలమార్గంపై తమకే సార్వభౌమ హక్కులు ఉన్నాయని స్పష్టం చేశాయి. దీని భవిష్యత్తు నిర్వహణ కోసం ఒక కొత్త నిబంధనావళిని అభివృద్ధి చేసే ప్రణాళికలను ప్రకటించాయి.

గల్ఫ్ ప్రాంతంలో వారాల తరబడి నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల తర్వాత ప్రపంచ మార్కెట్లకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో భాగంగా.. హార్మూజ్ జలసంధిని అంతర్జాతీయ నౌకాయానం కోసం సురక్షితమైన, తెరిచిన జలమార్గంగా ఉంచడానికి తమ నిబద్ధతను పునరుద్ధరించుకున్నట్లు రెండు దేశాలు తెలిపాయి. ఇందులో భాగంగా, హార్మూజ్ జలసంధి గుండా ‘నౌకాయాన భవిష్యత్తు నిర్వహణ’పై ఒప్పందం కోసం చర్చలు జరపడానికి ఒమన్, ఇరాన్ ఒక ఉమ్మడి బృందాన్ని ఏర్పాటు చేయనున్నాయి.

యుద్ధానికి పూర్వపు స్థితిక ఇక చేరదు: ఇరాన్  
అణు కేంద్రాల తనిఖీలకు ఇరాన్ సంపూర్ణంగా అంగీకరించిందంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన ప్రకటనలను ఇరాన్ తోసిపుచ్చింది. అణు తనిఖీలపై తాము ఎటువంటి కొత్త హామీలు ఇవ్వలేదని ఇరాన్ విదేశాంగ శాఖ అక్కడి ప్రభుత్వ మీడియాతో స్పష్టం చేసింది. 

హార్మూజ్ జలసంధి యుద్ధానికి ముందు ఉన్న స్థితికి ఎప్పటికీ చేరదని, అది ఇరాన్ నియంత్రణలోనే కొనసాగుతుందని ఇరాన్ ప్రధాన చర్చల ప్రతినిధి, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఘాలిబాఫ్ స్పష్టం చేశారు. అయితే, జలసంధి గుండా నౌకల ప్రయాణంలో ఎలాంటి అపోహలు రాకుండా నివారించడానికి, పరిష్కరించడానికి హార్మూజ్ కోసం ఒక టెలిఫోన్ హాట్‌‌లైన్ ఏర్పాటు చేయడానికి ఇరాన్ అంగీకరించిందని ఆయన తెలిపారు.

భారత్ వైపు 11 నౌకలు..
న్యూఢిల్లీ: ఇటీవల అమెరికా, ఇరాన్ మధ్య అవగాహనా ఒప్పందంపై సంతకాలు జరిగిన తర్వాత.. భారత్‌‌కు వస్తున్న 11 నౌకలు హార్మూజ్ జలసంధిని దాటాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోమవారం వెల్లడించారు. వీటిలో 3 ఇండియన్ జెండాతో కూడిన ఆయిల్ ట్యాంకర్లు ఉన్నాయని, అవి ఒక్కోటి 2,85,000 మెట్రిక్ టన్నులకు పైగా ముడి చమురును తీసుకొస్తున్నాయని చెప్పారు. 

అలాగే విదేశీ జెండాతో కూడిన ఒక ఎల్‌‌పీజీ నౌక, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్, ఎరువులను మోసుకొస్తున్న 6 విదేశీ జెండాతో కూడిన బల్క్ క్యారియర్లు ఉన్నాయని జైస్వాల్ వెల్లడించారు. భారత జెండాతో ప్రయాణిస్తున్న మిగిలిన నౌకలు కూడా త్వరలోనే హార్మూజ్ జలసంధిని దాటుతాయని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.