మోడీ తెరిపించిన ఖాతాల్లో డబ్బు వేస్తాం: రాహుల్

మోడీ తెరిపించిన ఖాతాల్లో డబ్బు వేస్తాం: రాహుల్

తాము ప్రతిపాదించిన కనీస ఆదాయ హామీ పథకం ’న్యాయ్’.. ఇండియన్ ఎకానమీ ఇంజిన్​కు డీజిల్ లా పని చేస్తుం దని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు.‘నేను అబద్ధాలు చెప్పడం లేదు. ఎకానమీని మా న్యాయ్ స్కీమ్ పరుగులు పెట్టిస్తుంది” అని చెప్పారు. సోమవారం రాజస్థాన్​లోని ధోల్ పూర్, చోర్ సిటీల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో రాహుల్ మాట్లాడారు. ‘‘నరేంద్ర మోడీ అందరితో బ్యాంకు అకౌంట్లు తెరిపించారు. కానీ ఒక్క పైసా కూడా వేయలేదు. ఇప్పుడు అవే అకౌంట్లలోకి మేం డబ్బు వేస్తాం . కాం గ్రెస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో సుమారు 5 కోట్ల మంది మహిళల ఖాతాల్లోకి రూ.3.6 లక్షల చొప్పున వేస్తాం ” అని వివరించారు. ఎంతోమంది ఎకనామిస్టులను సంప్రదించిన తర్వాత ‘న్యాయ్’కు రూపకల్పన చేశామని చెప్పారు. ఎకానమీకి ఎలాంటి నష్టం కలగకుండా, పేద కుటుంబాలకు ఆర్థిక సాయం చేయవచ్చన్నారు. ‘గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. 22 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేం వచ్చిన ఏడాదిలోపు అన్నింటినీ భర్తీ చేస్తాం ” అని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి అకౌంట్​లోకి రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారని, అయితే అదో అబద్ధమని, సాధ్యమయ్యే పని కాదని చెప్పారు. ‘‘మోడీ కేవలం 15 మంది అనీల్ అంబాన్, మెహుల్ చోక్సీ వంటి పెద్ద పారిశ్రా మికవేత్తలకు కోట్ల రూపాయలు దోచిపెట్టారు. కానీ మేం పేదలను ఆదుకుంటాం ” అన్నారు.

2 కోట్ల ఉద్యోగాలేవీ…

రాజస్థాన్​లోని చురులో రాహుల్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నినాదం ‘నేను కూడా చౌకీదార్’ ఉన్న టీషర్టులు వేసుకుని కొందరు యువకులు అక్కడికి వచ్చారు. వారిని గమనించిన రాహుల్.. ‘మీరు చౌకీదార్ టీషర్ట్ వేసుకుని వచ్చారు. మీ అందరికీ స్వాగతం” అని అన్నారు. దేశంలో 2 కోట్ల ఉద్యాగాలను సృష్టిస్తామని ప్రధాని మోడీ మాటిచ్చారని, మరి ఆ ఉద్యోగాలు ఎక్కడున్నాయో చెప్పాలని ప్రశ్నించారు. మీకెవరికైనా వచ్చాయా? అని ఆయువకులను అడిగారు.