స్థానిక నేతలకు మేం అన్యాయం చేయం : మంత్రి పొన్నం ప్రభాకర్

స్థానిక నేతలకు మేం అన్యాయం చేయం  :   మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్/శంషాబాద్, వెలుగు: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పటిష్ట పరిచిన గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో  నిర్వీర్యమయ్యాయని బీసీ వెల్ఫేర్, ట్రాన్స్ పోర్ట్‌‌ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. లోకల్ బాడీ ప్రతినిధులను సంప్రదించకుండా వారి ఇబ్బందులు, సమస్యలను తెలుసుకోకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. శనివారం శంషాబాద్​లో జరిగిన రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ మేధో సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో లోకల్ బాడీ లీడర్లు కీలక పాత్ర పోషించారని చెప్పారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు. అలాంటి తప్పులు తమ ప్రభుత్వంలో జరగనివ్వమని మంత్రి తెలిపారు. స్థానిక సంస్థల నేతలకు హక్కుగా రావాల్సిన నిధులు, విధుల విషయంలో తమ ప్రభుత్వం గత ప్రభుత్వంలా అన్యాయం చేయదని చెప్పారు. అధికారాల వికేంద్రీకరణ ద్వారా ముందుకెళ్తామని చెప్పారు.