భూములను వదులుకోం..అవసరమైతే కేసులు వేస్తాం

భూములను వదులుకోం..అవసరమైతే కేసులు వేస్తాం
  • భూమాఫియా భూములను ఆక్రమిస్తే.. పోలీసులు వాళ్లకెందుకు మద్దతిస్తున్నారు..? 
  • సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

హనుమకొండ జిల్లా : గుండ్లసింగారం ఘటనలో గాయపడిన బాధితులను సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పరామర్శించారు. బాధితులకు అండగా నిలిచి పోరాటం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం హనుమకొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర సహయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు తక్కెళ్లపల్లి శ్రీనివాస్  రావు, బిక్షపతి ఇతర నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ మహిళలు, వృద్ధులపై భూమాఫియా దాడులు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది..?  అని నిలదీశారు. 

గుండ్లసింగారం ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తాం

గుండ్ల సింగారం ఘటన పేదలపై దాడి మాత్రమే కాదు.. ప్రజాస్వామ్యంపై దాడి అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. భూమాఫియా భూములను ఆక్రమిస్తే పోలీసులు సంపన్న వర్గాలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. గుండ్లసింగారం ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. గుండ్లసింగారం భూములను ఎట్టిపరిస్థితుల్లో వదులుకోబోమని... అవసరమైతే కోర్టులో ప్రైవేటు కేసులు వేస్తామని స్పష్టం చేశారు. 

స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలోనే గుడిసె వాసులపై దాడి

స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలోనే గుడిసె వాసులపై దాడి  చేశారని సీపిఐ రాష్ట్ర సహయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి ఆరోపించారు. స్థానికేతరులు అంటూ కార్పొరేటర్ పోలీసులను తప్పుదోవ పట్టించారని ఆయన విమర్శించారు. అధికారులు అక్కడి స్థితిగతులను పరిశీలించి ఇండ్లు లేని వారికి స్థలాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కబ్జాకు గురవుతున్న జాగాల్లో పేదలు వేసుకున్న గుడిసెలకి పట్టాలు ఇవ్వాలన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.