- మని మంత్రులుశ్రీధర్ బాబు, సీతక్క హామీ
- కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చూస్తాం
- బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడి
- సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు
పెద్దపల్లి / సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లాలో ఆరేండ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద చిన్నారిపై అఘాయిత్యం జరిగిన ప్రాంతాన్ని ఆదివారం మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్ ఠాకూర్ పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో వారు మీడియాతో మాట్లాడారు. చిన్నారిపై అత్యాచారం, హత్య అత్యంత హేయమైన చర్య అని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.2.50 లక్షల పరిహారం అందిస్తామన్నారు. మిల్లు యాజమాన్యం నుంచి రూ.5.50 లక్షలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాలిక తండ్రికి ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు వారి మరో కూతురు చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.
సమాజంలో ఇలాంటి ఘోరం క్షమించరానిదని, ఇటువంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటుందని చెప్పారు. ఈ దారుణంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారన్నారు. సీఎం ఆదేశాలతో నిందితుడిని పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష, పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.