కేంద్రానికి తడాఖా చూపిస్తాం

కేంద్రానికి తడాఖా చూపిస్తాం
  • ఫ్రంట్‌‌ ప్రయత్నాలకు మస్తు స్పందన వస్తున్నది: సీఎం
  • త్వరలోనే అన్ని రాష్ట్రాల రైతుసంఘాలతో మీటింగ్‌‌
  • మంత్రిని చంపాలని చూస్తే ఊరుకుంటమా
  • ప్రతిపక్షాలు చెప్పేవన్నీ అబద్ధాలేనని మండిపాటు
  • బడ్జెట్​కు ఆమోదం తెలిపిన కేబినెట్‌‌.. ఇయ్యాల అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీఆర్‌‌ఎస్‌‌ తడాఖా ఏందో చూపిస్తామని సీఎం కేసీఆర్​ అన్నారు. బడ్జెట్‌‌ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఎందుకు లేదో తానే సభలో చెప్తానని, దీనిపై ఎవ్వరూ స్పందించొద్దని మంత్రులకు ఆయన సూచించారు. కేంద్రంతో కొట్లాడుడేనని తేల్చిచెప్పారు.  ఫ్రంట్‌‌ ప్రయత్నాలకు అన్ని రాజకీయ పార్టీలు, సంఘాల నుంచి మస్తు స్పందన వస్తున్నదన్నారు. హైదరాబాద్‌‌ కేంద్రంగా త్వరలోనే దేశంలోని అన్ని రైతుసంఘాల నాయకులతో సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. స్టేట్‌‌ కేబినెట్‌‌లోని మంత్రినే చంపాలని చూస్తే ఊరుకుంటమా అని కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌‌ అధ్యక్షతన ఆదివారం సాయంత్రం రాష్ట్ర కేబినెట్‌‌ ప్రగతి భవన్‌‌లో భేటీ అయింది. బడ్జెట్‌‌కు కేబినెట్‌‌ ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌‌ పలు అంశాలపై మాట్లాడినట్టు తెలిసింది. విభజన చట్టంలో ఇచ్చిన పలు హామీలను కేంద్రం అమలు చేయలేదని, వాళ్లతో ఎంత సఖ్యతగా ఉన్నా రాష్ట్రానికి రావాల్సిన వాటిపై సానుకూలంగా స్పందించనే లేదని మండిపడ్డారు. ఇన్నాళ్లు ఉపేక్షించామని, ఇక ఊరుకునేది లేదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కేంద్రం తీరుపై అసెంబ్లీలో చర్చ పెట్టి ఆయా హామీలు నెరవేర్చాలని డిమాండ్‌‌ చేస్తూ తీర్మానం చేద్దామని ప్రతిపాదించారు. 

గవర్నర్​ తీరు సరిగా లేదు
అసెంబ్లీ సమావేశాలపై బిజినెస్‌‌ రూల్స్‌‌కు లోబడే స్పీకర్‌‌ నిర్ణయం తీసుకున్నారని, దీనిపై గవర్నర్‌‌ తీరు సరిగా లేదని సీఎం అన్నారు. ‘‘మంత్రి శ్రీనివాస్‌‌ గౌడ్‌‌ను చంపేందుకు కుట్ర చేస్తే కోపం రాదా.. వాళ్ల సంగతి తేలుస్త”అని ఆయన హెచ్చరించినట్టు తెలిసింది. అసెంబ్లీలో ప్రతిపక్షాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా రెచ్చిపోవద్దని అన్నారు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ఎవరు పడితే వారు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయొద్దని, ఏ ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్పాలో ఇప్పటికే నిర్ణయించామని, వాళ్లు ఆల్రెడీ ప్రిపేర్‌‌ అయి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతిపక్షాలు చెప్పేవన్నీ అబద్ధాలేనని, అసెంబ్లీ వేదికగా వాటిని తేటతెల్లం చేస్తానన్నారు. తాను పూర్తి సెషన్‌‌కు హాజరవుతానని, అవసరమైన సందర్భాల్లో తానే స్పందిస్తానని కేసీఆర్​ పేర్కొన్నారు.

కలిసి రాకుంటే రైతు సంఘాలే మెడలు వంచుతయ్‌‌
దేశంలో తాను ఎక్కడికి పోయినా రాజకీయ పార్టీలు, ఇతర సంఘాల నుంచి మంచి స్పందన వస్తున్నదని సీఎం కేసీఆర్​ చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌‌ థాక్రే, ఎన్సీపీ చీఫ్‌‌ శరద్‌‌ పవార్‌‌, జార్ఖండ్‌‌ సీఎం హేమంత్‌‌ సోరెన్‌‌, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, రైతు సంఘం నేత రాకేశ్‌‌ టికాయత్‌‌ సహా అనేక మంది ప్రోత్సహించారని అన్నారు. కేంద్రం తీరుపై ఎవరో ఒకరు ముందడుగు వేయాల్సి ఉండెనని వాళ్లు కూడా అన్నారని, తనకు మద్దతుగా నిలుస్తామని చెప్పారని కేసీఆర్​ పేర్కొన్నారు. ఏదైనా పార్టీ కలిసి రాకుంటే ఆయా రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధ్యక్షుల మెడలు రైతు సంఘాల నాయకులు వంచుతారని అన్నారు. ‘‘నేను ఏది స్టార్ట్‌‌ చేసినా ఆగే ప్రసక్తే లేదు.. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిననాడు.. ఇప్పుడు మేం ఉద్యమకారులం అని చెప్పుకునేటోళ్లు అది అయ్యే పనికాదు అన్నరు.. ఇడ్సి పెట్టుమన్నరు.. కానీ ఇడువలే.. పట్టుపట్టి కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చినా.. ఇప్పుడు ఫ్రంట్‌‌ కూడా పెట్టి చూపిస్త’’ అని చెప్పారు.

మళ్లీ అధికారం మనదే
సోషల్‌‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి ఎవ్వరూ పరేషాన్‌‌ కావొద్దని కేసీఆర్​ అన్నారు. ‘‘టీవీల్లో ఎవడో ఏదో మాట్లాడుతున్నడని ఆగం కావొద్దు. వాళ్లకు ఎవ్వడు సర్వేలు చేస్తున్నడు. అన్నీ వట్టి డబ్బా ముచ్చట్లే.. నేను నెలకు నాలుగు సర్వేలు చేయిస్తున్న. అన్ని సర్వేల్లో మనం ముందున్నం.. కచ్చితంగా మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే.. మీరు మన పథకాలను ప్రజలకు గట్టిగా చెప్పుకోండి. కేంద్రం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక విధానాలను అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. నేను ఉన్న. మళ్లీ గెలుస్తున్నం’’ అని మంత్రులతో చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఇకపై ప్రజల్లోనే ఎక్కువ సమయం ఉండేలా ప్లాన్‌‌ చేసుకోవాలని సూచించారు.