
ముషీరాబాద్, వెలుగు : ఎరుకల కులస్తుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఎరుకల సంఘం (కుర్రు) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రిని కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తనకు ఎరుకల స్థితిగతులు తెలుసని, సమస్యలపై చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు.
సంఘం (కుర్రు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా138 పందుల సహకార సంఘాలకు ప్రభుత్వ భూములు కేటాయించి, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. గ్రూప్స్ కోచింగ్కోసం ప్రత్యేకంగా హైదరాబాద్లో ఏకలవ్య కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక ఎరుకల కార్పొరేషన్ తో పాటు, ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి ఎరుకల కులస్థుడికి చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో కోనేటి నరసింహ, గోపాల్, వనం రమేశ్, పాతపల్లి నరసింహ, కూతాడి సురేశ్,రుద్రాక్షి నరసింహ, రాయపురం వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.