గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటాం: మంత్రి వివేక్ వెంకటస్వామి

గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • గిగ్​ వర్కర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు
  • వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తెస్తం: మంత్రి వివేక్ వెంకటస్వామి
  • సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేస్తం
  • రాష్ట్రంలో 4.50 లక్షల మంది గిగ్​ వర్కర్లు ఉన్నరు
  • వాళ్లకు కనీస వేతనాలు అమలయ్యేలా 
  • చర్యలు తీసుకుంటామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం త్వరలోనే చట్టం తీసుకొస్తామని, ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రకటించారు. తాము తీసుకురాబోతున్న గిగ్ వర్కర్ల పాలసీ.. దేశంలోనే ఆదర్శవంతమైన పాలసీగా నిలుస్తుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4.50 లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారని, కొత్త చట్టంతో వాళ్లందరికీ లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ‘‘గిగ్ వర్కర్ల పాలసీకి సంబంధించి ఇప్పటికే ముసాయిదా బిల్లు రూపొందించాం. దీనిపై తదుపరి కేబినెట్ సమావేశంలో చర్చిస్తాం. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తాం” అని వివేక్​ వెల్లడించారు. 

శుక్రవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మీడియాతో మంత్రి వివేక్ మాట్లాడారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకురాబోతున్న చట్టం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ‘‘గిగ్ వర్కర్లకు హక్కులు కల్పిస్తామని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఆయన ప్రోత్సాహంతోనే ఈ చట్టం తీసుకొస్తున్నాం. దేశంలోనే తొలిసారి రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ సర్కార్ హయాంలో గిగ్ వర్కర్ల చట్టం తీసుకొచ్చారు. ఆ తర్వాత కర్నాటక ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తెలంగాణలోనూ గిగ్ వర్కర్ల చట్టాన్ని త్వరగా తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ లేఖ రాశారు” అని చెప్పారు. 

బిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 1 నుంచి 2% సెస్..   

గిగ్ వర్కర్లకు అనేక సమస్యలు ఉన్నాయని గుర్తించామని, వాటి పరిష్కారం కోసం బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. ఈ బోర్డు ద్వారా గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, పని దినాలు, ఇతరత్రా అంశాలను పర్యవేక్షించవచ్చని చెప్పారు. గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం సంక్షేమ నిధి కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని.. ఇందుకోసం బిల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై 1 నుంచి 2 శాతం సెస్ విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నదని పేర్కొన్నారు. ఈ సెస్ ఎవరు భరించాలనేది (వినియోగదారులు లేదా కంపెనీలు) బోర్డు నిర్ణయిస్తుందని వెల్లడించారు. 

గిగ్ వర్కర్లకు అగ్రిగేటర్లు కొన్ని బీమా సదుపాయాలు కల్పిస్తున్నప్పటికీ, వాటిలో లోపాలున్నాయని పేర్కొన్నారు. ‘‘గిగ్ వర్కర్లకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నోటిఫై చేసే కనీస వేతనాలకు అనుగుణంగా గిగ్ వర్కర్లకు ఆదాయం లభించేలా చూస్తాం. గిగ్ వర్కర్లకు మరిన్ని వ్యాపారావకాశాలు కల్పించడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడానికి అగ్రిగేటర్లు కృషి చేయాలి. కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా గిగ్ వర్కర్లకు తోడ్పాటునందించాలి” అని సూచించారు. 

ఇది మొదటి అడుగు.. 

కొత్త చట్టం రూపకల్పనపై అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్లతో చర్చలు జరిపామని మంత్రి వివేక్ తెలిపారు. గిగ్ వర్కర్ల సమస్యలపై భారత్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాహుల్ గాంధీ ప్రత్యేక సెషన్ నిర్వహించారని పేర్కొన్నారు. ‘‘కనీస వేతనాలు కల్పించడం, ఐడీలు బ్లాక్ చేయకుండా చూడటం వంటి డిమాండ్లు గిగ్ వర్కర్ల నుంచి వచ్చాయి. ఈ పాలసీ గురించి పబ్లిక్ డొమైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పెట్టినప్పుడు 66 సూచనలు వచ్చాయి. వాటిలో చాలావరకు ముసాయిదాలో చేర్చాం. ఇది ప్రారంభం మాత్రమే.. మొదటి అడుగుగా గిగ్ వర్కర్లను గుర్తించి, వారి సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తం. సెస్ వసూలు చేసి బీమా, ఇతర సదుపాయాలు కల్పిస్తాం” అని వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు, సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తామన్నారు. అగ్రిగేటర్లు కూడా వర్కర్లకు సరైన గౌరవం ఇవ్వాలని సూచించారు.

గిగ్ వర్కర్లకు ఎంతో ప్రయోజనం.. 

గిగ్​ వర్కర్ల పాలసీ ముసాయిదా బిల్లును కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆమోదించిన తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేస్తామని మంత్రి వివేక్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కార్మిక శాఖ ఉన్నప్పుడు ఈ అంశంపై చర్చలు జరిపారని పేర్కొన్నారు. తెలంగాణలో ఈ చట్టం విజయవంతమైతే, జాతీయ స్థాయిలోనూ ఇలాంటి చట్టాలు రావడానికి స్ఫూర్తినిస్తుందని అన్నారు. ‘‘అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్ల మధ్య జరిగిన సమావేశంలో చాలా అంశాలపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. ఈ చట్టం అగ్రిగేటర్లకు భారం కాదు. దీనితో గిగ్ వర్కర్లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఈ చట్టానికి విస్తృత ప్రచారం కల్పించాలి” అని కోరారు. సమావేశంలో కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, జొమాటో, స్విగ్గీ ప్రతినిధులు, గిగ్​ వర్కర్లు పాల్గొన్నారు.

మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కృతజ్ఞతలు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామన్న కార్మిక శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి ప్రకటనపై గిగ్ అండ్ ​ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్ వర్కర్ల యూనియన్​ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా యూనియన్ ​జాతీయ ప్రధాన కార్యదర్శి షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి వివేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.  

బోర్డు ఏర్పాటుతో లక్షలాది మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ‘‘శుక్రవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన స్టేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హోల్డర్ల సమావేశంలో గిగ్ ​కార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాను. కార్మికుల సూచనలు, డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని దేశంలోనే ఉత్తమమైన పాలసీని తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రత్యేక బోర్డు ఏర్పాటుపై మంత్రి చేసిన ప్రకటన గిగ్ వర్కర్లకు ఊరటనిస్తున్నది. బోర్డు ఏర్పాటును మేం స్వాగతిస్తున్నాం” అని చెప్పారు.  

కనీస వేతనాలు కల్పించడం, ఐడీలు బ్లాక్ చేయకుండా చూడటం వంటి డిమాండ్లు గిగ్ వర్కర్ల నుంచి వచ్చాయి. ఈ పాలసీ గురించి పబ్లిక్ డొమైన్‌‌లో పెట్టినప్పుడు 66 సూచనలు వచ్చాయి. వాటిలో చాలావరకు ముసాయిదా బిల్లులో చేర్చాం. ఇది ప్రారంభం మాత్రమే.. మొదటి అడుగుగా గిగ్ వర్కర్లను గుర్తించి, వారి సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేస్తం. భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తం.మంత్రి వివేక్​ వెంకటస్వామి