
- ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నది
- హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడి.. కేసుపై తొలిసారి స్పందించిన కమిషనర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి తొలిసారి స్పందించారు. ఈ కేసులో పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చే విషయంపై త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతున్నదని చెప్పారు. గురువారం రంజాన్ సందర్భంగా పాతబస్తీలోని మీర్ ఆలం ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనలకు సీపీ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసుపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘‘కేసు దర్యాప్తు రైట్ లైన్‌లో జరుగుతున్నది. పొలిటికల్ లీడర్లకు నోటీసులకు సంబంధించి అన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం” అని తెలిపారు. కాగా, రంజాన్ సందర్భంగా సిటీలో బందోబస్తును సీపీ పర్యవేక్షించారు.
ప్రభాకర్ రావుతో లింక్ ఉన్నదెవరికి?
ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్‌రావు స్టేట్‌మెంట్ కీలకంగా మారింది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చుట్టూ ఉచ్చు బిగుస్తున్నది. ఆయన ఆదేశాల మేరకే ప్రణీత్‌రావు, మాజీ డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఆపరేషన్స్ నిర్వహించినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ప్రభాకర్‌రావుకు ఎవరి నుంచి ఆదేశాలు వచ్చాయనే వివరాలను స్పెషల్ టీమ్ పోలీసులు ఇప్పటికే సేకరించారు. ప్రణీత్‌రావు టీమ్‌కు చేరిన ఫోన్ నంబర్స్, ఎస్‌ఐబీ లాగర్ రూమ్‌లో సేకరించిన ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. నిందితులు కస్టడీ స్టేట్‌మెంట్‌లో వెల్లడించిన సమాచారంతో సంబంధిత పొలిటికల్ లీడర్లకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ పీపీ నియామకం
ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రత్యేకంగా వాదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించింది. ఈ మేరకు సీనియర్ లాయర్ సాంబశివారెడ్డిని నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవో ఆధారంగా నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. దీనిపై ఈ నెల15న నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. కాగా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నలుగురి పేర్లను పరిశీలించి.. సాంబశివరెడ్డిని ఫైనల్ చేసింది.