రెబల్ ఎమ్మెల్యేలకు సంజయ్ రౌత్ సవాల్

రెబల్ ఎమ్మెల్యేలకు సంజయ్ రౌత్ సవాల్

మహారాష్ట్రలో రెబల్ ఎమ్మెల్యేలకు సవాల్ విసిరారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. ఎమ్మెల్యేలంతా తిరిగి ముంబాయి వచ్చి అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. రెబల్ ఎమ్మెల్యేలు, ఏక్ నాథ్ షిండే వర్గానికి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపణ జరిగితే తామే గెలుస్తామని జోస్యం చెప్పారు. మహా వికాస్​ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం మిగతా రెండున్నరేళ్లు కొనసాగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారాయన. జరుగుతున్న సంఘటనలకు తాము పశ్చాతాపడడం లేదని స్పష్టం చేశారు. ఈ యుద్ధం రోడ్లపై జరిగితే అందులో కూడా తాము విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలకు చాలా సార్లు అవకాశం ఇచ్చామన్ని పేర్కొన్న సంజయ్ రౌత్.. ఇప్పుడు ఆలస్యం అయ్యిందని చెప్పారు.

ఒక విధంగా వారు (తిరుగుబాటు ఎమ్మెల్యేలు) రాంగ్ స్టెప్ తీసుకున్నారన్నారు. సీఎం ఉద్ధవ్ థాక్రే, శరద్ పవార్ లతో తాము నిరంతరం టచ్‌లో ఉంటున్నట్లు, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన నేతలంతా ఒక్కటిగా ఉన్నామన్నారు. మరోవైపు...మహా రాష్ట్ర రాజకీయాలు పూటకో  మలుపు గంటకో ట్విస్టులతో ఆసక్తికరంగా మారాయి. శివసేన తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే శిబిరంలో 50 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. షిండేను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని రక్షించేందుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శత విధాల ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ కేంద్రమంత్రి షరద్ పవార్ ను బెదిరించారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.