Health Alert : ఎండలు మండుతున్నాయి.. పిల్లలకు తల్లిపోస్తుంది.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

Health Alert : ఎండలు మండుతున్నాయి.. పిల్లలకు తల్లిపోస్తుంది.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

పిలగానికి తల్లైంది. నాల్రోజుల్నుంచీ ఇంట్లోంచి బయటకు రావడం లేదు. ఏమీ తినడం లేదు, తాగడం లేదు. ఆసుపత్రికి తీసుకుపోదామంటే ఇంట్లో వాళ్లు వద్దన్నారు. ఇలా అయితే ఎలా? తల్లి పోస్తే బయట తిరక్కూడదా? అవును, పొంగు, ఆటలమ్మ, గవదలు ఇవన్నీ అంటువ్యాధులు. ఒకళ్ల నుంచి మరొకళ్లకి చాలా వేగంగా అంటుకుంటాయి. అందుకే బయట ఎక్కువ తిరక్కూడదు.. అంటున్నారు వైద్యులు.

కాలానికి అనుగుణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వేసవి రాగానే కొన్ని వ్యాధులు త్వరగా వచ్చేస్తాయి. ముఖ్యంగా పొంగు, ఆటలమ్మ వంటి అంటువ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వైరస్ ల కారణంగా వస్తాయి ఈ వ్యాధులు. ఇవి వస్తే చిన్నవాడైనా, పెద్దవారైనా అది తగ్గే వరకూ ఇంట్లో ఉండాల్సిందే, అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వీటి తీవ్రత తగ్గించుకోవచ్చు. చుట్టుపక్కల వాళ్లకు సోకకుండా జాగ్రత్త పడొచ్చు.

వైరస్ లు

రుబెల్లా అనే వైరస్ జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలతో శరీరంలోకి ప్రవేశిస్తుంది. దాని తీవ్రత ఎక్కువైతే ఒళ్లంతా ఎర్రటి దద్దులు వస్తాయి. రుబెల్లా, ఆర్ఎస్ఏ వైరస్ కలిసి 'పా రామిక్సీ' వైరస్ గా మారి గొంతు సంబంధిత వ్యాధులను కలిగిస్తుంది. దీని తీవ్రత ఎక్కువగా ఉంటే గవదలు వస్తాయి. 'వెరియోలా వైరస్ వల్ల ఆటలమ్మ (చికెన్ పాక్స్) వస్తుంది. 

మమ్స్ (గవదలు) 

'పారామిక్సీ' వైరస్ తీవ్రత ఎక్కువగా పిల్లలపై ఉంటుంది. ఎందుకంటే వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటమే. గవదలు వస్తే దవడల వద్ద ఉండే లాలాజల గ్రంధులు ఉబ్బుతాయి. నొప్పి ఉంటుంది. ఆ ప్రాంతమంతా వేడిగా కూడా ఉంటుంది. అవి వచ్చినప్పుడు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకుంటే రెండు మూడు రోజుల్లో తగ్గుతాయి. కానీ వాటి తీవ్రత ఎక్కువైతే స్పైనల్ కార్డ్, మెదడు ప్రాంతాల్లో కూడా వాపు వస్తుంది.

పొంగు (తట్టు)

తీవ్రమైన గొంతు నొప్పి, విపరీతమైన జ్వరం దీని లక్షణాలు. శరీరంలో ఉష్ణోగ్రత అమాంతంగా పెరిగిపోయి వేడికి ఒంటి నిండా ఎర్రని దద్దుర్లు లు వస్తాయి. ఇవి శరీరం, నోటి లోపల వస్తాయి. సుమారు నాలుగు నుంచి ఆరు రోజుల వరకూ వీటి తీవ్రత ఉంటుంది.

చికెన్ పాక్స్ (ఆటలమ్మ)

వెరియోలా వైరస్ తీవ్రత వల్ల ఆటలమ్మ వస్తుంది. శరరీంలో తీవ్రమైన వేడి ఉండి, ఒళ్లంతా చిన్న చిన్న నీటిపాక్కులు వస్తాయి. ఒంటి నొప్పులు భరించలేనంతగా ఉంటాయి. తలలో, నోటిలో కూడా నీటి పొక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో మంట పుడుతుంది. దురద వస్తుంది. చిట్టితే చిక్కటి, తెల్లని ద్రవం వస్తుంది. ఆరు నుంచి. పది రోజుల వరకూ ఉంటాయి.

వ్యాప్తి

* డీహైడ్రేషన్ వల్ల పొంగు, తట్టు, చికెన్ పాక్స్ వచ్చేఅవకాశం ఉంటుంది. 
* శరీరంలో అధిక వేడి వల్ల రావచ్చు.
* వ్యాధి ఉన్న వాళ్ళు తుమ్మినా, దగ్గినా ఆ తుంపరలు మీద పడటం వల్ల ఇతరులకు వస్తుంది.
* వాళ్లు ఉపయోగించిన బట్టలు, సబ్బులు ఉపయోగించినా వస్తుంది.
* వ్యాధి ఉన్నవాళ్ల మూత్ర విసర్జన ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది.

జాగ్రత్తలు

* పొంగు, చికెన్ పాక్స్ ఒకళ్ల నుంచి మరొకళ్లకు చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. అందుకే అది సోకిన వాళ్లు పది, పదిహేను రోజుల వరకూ ఇంట్లోనే ఉండటం మంచిది. అధిక జనాభా ఉన్న చోటకు రాకూడదు.
* నూనె పదార్థాలు ఎక్కువగా తినకూడదు.
* గుడ్డు, చికెన్, మేక మాంసం తినకూడదు.
* జ్వరం తీవ్రత ఎక్కువ ఉన్నవాళ్లు డాక్టర్ని సంప్రదించి మెడిసిన్ తీసుకోవాలి.
* దాని తీవ్రత తగ్గి వరకూ స్నానం చేయకపోవడమే మంచిది. 
* దురద ఎక్కువగా ఉంటే కాలమైన్' లోషన్ రాయొచ్చు. - యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉంటే వేపాకులు వాడొచ్చు. వ్యాధితో బాధపడుతున్న వాళ్ల దుస్తులు, వస్తువులు వాడకూడదు. 
* పిల్లలకు వేసవి మొదలవగానే వీటికి సంబంధించిన వ్యాక్సిన్
వేయించడం మంచిది.
* పొంగుకి యంయంఆర్ వ్యాక్సిన్ వేస్తారు. 
* చికెన్ పాక్స్ కి యంయంఆర్పి వ్యాక్సిన్ వేస్తారు.