
చేనేత కార్మికుల సమస్యలపై స్పందనేదీ?: కోదండరాం
త్వరలో నేతన్నల ధర్నా: దాసు సురేశ్
మద్దతిస్తామన్న ఎల్.రమణ, చాడ
సోమాజిగూడ(హైదరాబాద్), వెలుగు: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, కాంట్రాక్టర్ల చేతిలో రాజ్యాధికారం ఉందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. చేనేత వర్గాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఆశించిన స్థాయిలో చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బుధవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నేతన్నల జేఏసీ అధ్యక్షుడు దాసు సురేశ్ అధ్యక్షతన చేనేత సమస్యల సాధన కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో చేనేత రంగ ప్రభావంపై చర్చించారు. కోదండరాం మాట్లాడుతూ.. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేలోపే నేతన్నల కోసం ధర్నా చేస్తే ప్రభుత్వంలో కదలిక వస్తుందని, హక్కుల వేదికలు కూలిపోతున్న ప్రస్తుత సమయంలో సమస్యలపై పోరాడటం అంటే సాహసమేనన్న పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణలో కదలిక వచ్చేలా చేనేతలు చేయబోయేలా ధర్నా ఉండాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తుల పోటీ వల్ల చేనేత వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత వర్గాన్ని, మగ్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని గుర్తు చేశారు.
చేనేతపై జీఎస్టీ రద్దు చేయాలి: దాసు సురేశ్
చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని దాసు సురేశ్ డిమాండ్ చేశారు. చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే లోపు ధర్నా, సభలు నిర్వహిస్తామని తెలిపారు. చేనేత వ్యవస్థలో జరుగుతున్న కార్పొరేట్ శక్తుల దోపిడీ, నకిలీ చేనేత వస్త్రాల అమ్మకాలను అరికట్టడంపై కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తామని చెప్పారు. చేనేత పేటెంట్ హక్కుల రక్షణ కోసం వృత్తిదారులు లీగల్ సాయం పొందేందుకు బడ్జెట్లో ప్రత్యేకంగా కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మేం సపోర్ట్ చేస్తం : రమణ
తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా నేతన్నల ఆత్యహత్యలు చూస్తుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం ఎలా ఉందో తెలుస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేనేతల బాగు కోసం ఎలాంటి కార్యక్రమాలు చేసినా టీడీపీ మద్దతు ఉంటుందని తెలిపారు. రాను రాను చేనేతల పరిస్థితి అధ్వానమైందని, ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. ఏదైనా ఉద్యమంతోనే సాధ్యమని అన్నారు.