
- శ్రావణ సప్తమి కావడంతో పోటెత్తిన ఆశావహులు
- కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి, కొండా సురేఖ, స్రవంతి దరఖాస్తు
- నేడు రేవంత్, ఉత్తమ్, పద్మావతి అప్లై చేసే చాన్స్
హైదరాబాద్, వెలుగు: గాంధీభవన్‌కు అసెంబ్లీ టికెట్ ఆశావహులు పోటెత్తారు. బుధవారం శ్రావణ సప్తమి కావడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనుచరులు, కార్యకర్తలతో కలిసి వందలాదిగా పార్టీ ఆఫీసుకు వచ్చారు. దీంతో అక్కడి పరిసరాలు కిటకిటలాడాయి. చాలా మంది నేతలు, కార్యకర్తలు తమ కార్లను రోడ్లపైనే పార్క్ చేయాల్సి వచ్చింది. దీంతో ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
అప్లికేషన్లు బుధవారం నాటికి 500 దాటాయని గాంధీభవన్ వర్గాలు చెప్పాయి. బుధవారం ఒక్కరోజే 200 మందికిపైగా అప్లికేషన్లు సమర్పించారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సునీతా రావు, పాల్వాయి స్రవంతి, విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లయ్ చేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లో లేరు. ఆయన తరఫున నల్గొండ టౌన్ ప్రెసిడెంట్ గుమ్మల మోహన్‌రెడ్డి, కార్యకర్తలు అప్లికేషన్‌ను గాంధీభవన్‌లో సబ్మిట్ చేశారు. కొత్తగూడెం టికెట్ కోసం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మునుగోడు టికెట్ కోసం పాల్వాయి స్రవంతి, జూబ్లీహిల్స్ టికెట్ కోసం విష్ణువర్ధన్‌రెడ్డి, ఖైరతాబాద్ టికెట్ కోసం సునీతారావు దరఖాస్తు చేసుకున్నారు.
కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి దరఖాస్తు సమర్పించారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పద్మావతి కూడా బుధవారమే దరఖాస్తు సమర్పిస్తారని ముందు వార్తలు వచ్చినా.. వివిధ కారణాలతో వాయిదా పడినట్టు తెలిసింది. వాళ్లంతా గురువారం అప్లికేషన్లను సమర్పించే అవకాశమున్నట్టు తెలిసింది. కాగా, ఈసారి ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్‌లోని సభ్యులకూ కచ్చితంగా ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిందేనని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు డిమాండ్చేస్తున్నారు. మొత్తం సీట్లలో 33 శాతం కోటా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఖానాపూర్ నియోజకవర్గం నుంచి చారులత రాథోడ్ గురువారం అప్లికేషన్‌ను సమర్పించనున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇప్పటికే కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.