సిటీ శివార్లలో వీకెండ్ చిల్

సిటీ శివార్లలో వీకెండ్ చిల్
  • రిసార్టులు, ఫాంహౌజ్​ల ముందస్తు బుకింగ్ 
  • నెలలో ఒకసారైనా వెళ్లొచ్చేలా ప్లాన్​ చేస్కుంటున్న జనం 

హైదరాబాద్, వెలుగు: వీకెండ్ లో సిటీకి దూరంగా వెళ్లి గడిపేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. శని, ఆదివారాల్లో ఎక్కడ ఉండాలనేది ముందుగానే ప్లాన్​చేసుకుంటున్నారు. శివార్లలో ఏమేం ఉన్నాయో తెలుసుకుని శుక్రవారం రాత్రికే అక్కడికి వెళ్లిపోతున్నారు. ఆదివారం రాత్రికి మళ్లీ సిటీకి వచ్చేస్తున్నారు. ఇలాంటి వారి కోసం సిటీ చుట్టుపక్కల రిసార్టులు, ఫాంహౌజ్​లు చాలానే ఉన్నాయి. చుట్టూ గ్రీనరీ, కొత్తకొత్త థీమ్​లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుండడంతో వీటికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. 5 నుంచి 10, 20 మంది గ్రూపుగా వచ్చి ముందుగా బుక్​చేసుకున్న ఫాంహౌజ్, రిసార్టులో సేదతీరుతున్నారు. ది వైల్డర్ నెస్ రీట్రీట్, అనన్య ఎకో రిసార్ట్స్, రాగల రిసార్ట్స్, లియోనియా, అలంకృత, బ్రౌన్ టౌన్, ది పెండెంట్ స్టే ఇలా పదుల సంఖ్యలో రిసార్ట్‌‌లు ఉన్నాయి. హట్స్, గ్రీనరీ, వివిధ రకాల డిజైన్లు, థీమ్​లతో ఇవి ఉంటున్నాయి. స్విమ్మింగ్‌‌ పూల్స్, గేమ్స్, ట్రెకింగ్‌‌, క్యాంప్‌‌ ఫైర్ సదుపాయాలు ఉంటున్నాయి. ట్రావెల్ స్టార్టప్‌‌లు సైతం రిసార్ట్‌‌లలో వీకెండ్ ట్రిప్‌‌లు ప్లాన్ చేస్తుండటంతో సిటీ చుట్టుపక్కల, ప్రకృతి ఒడిలో సేద తీరేందుకు చాలామంది వెళ్తున్నారు. 

సదుపాయాలను బట్టి చార్జ్..

ట్రావెలింగ్ చేయాలనుకునేవారికి కూడా శివారుల్లోని రిసార్టులు, ఫాంహౌస్​లు బెస్ట్ డెస్టినేషన్ గా మారుతున్నాయి. కనీసం నెలలో ఒకసారైనా వెళ్లొచ్చేలా ప్లాన్ చేసుకుంటు
న్నారు. ట్రావెల్ స్టార్టప్‌‌ కంపెనీలు ట్రిప్​లు అందిస్తున్నాయి. తమ ఫాంహౌజ్‌‌లలో వీటిని ఏర్పాటు చేస్తున్నాయి.సోషల్ రీట్రీట్ పేరుతో 2 రోజుల ట్రిప్ అందిస్తునాయి. ఇందులో ట్రెక్కింగ్, ఫన్ యాక్టివిటీస్, క్యాంప్‌‌ ఫైర్, మ్యూజిక్, డ్యాన్స్ వంటివి ఉండేలా ప్లాన్ చేస్తున్నాయి. సౌకర్యాలను బట్టి ఒక్కో రిసార్ట్‌‌లో ఒక్కో విధంగా చార్జి చేస్తున్నాయి. రూ.2వేల నుంచి చార్జ్ ​ఉంటోంది. ఫాంహౌజ్‌‌లో అయితే రూ.15 వేల నుంచి 20 వేల వరకు ఉంటోంది.

ఫుల్ బుకింగ్స్..

కరోనా తర్వాత నుంచి మా కాటేజ్​కు మంచి రెస్పాన్స్​ ఉంది. ఇక్కడ హట్​లతో పాటు స్పెషల్ కాటేజీలు ఉన్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటారు. మొత్తం 16 కాటేజీలు ఉండగా వీకెండ్స్​లో అన్నీ నిండిపోతున్నాయి. ముందే బుకింగ్స్ చేసుకుని వచ్చేవారు ఉన్నారు. 

- వైల్డర్ నెస్ రీట్రీట్ 
నిర్వాహకుడు, గండిపేట

30 మందితో ప్లాన్ చేస్తున్నం 

మేం వీకెండ్స్‌‌లో ఇంటర్‌‌‌‌ స్టేట్ ట్రిప్‌‌లు పెట్టడంతోపాటు సిటీ అవుట్‌‌స్కర్ట్స్​లో సోషల్ రీట్రీట్ పేరుతో అడ్వెంచర్ ​వీకెండ్ ట్రిప్​లు నిర్వహిస్తున్నాం. 1,999తో ప్యాకేజీ ఉంటుంది. ఇందులో అన్ని రకాల ఎంటర్​టైన్​మెంట్ ఉండేలా చూస్తున్నాం. దాదాపు 30 మందితో వీటిని ప్లాన్ చేస్తున్నాం. మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్త పరిచయాలు కోరుకునే వారికి, ఒంటరిగా ఫీలయ్యేవారికి సోషల్ రీట్రీట్ ఉపయోగపడుతోంది.

- కార్తీక్ , ఆర్గనైజర్, టిప్‌‌టిన్‌‌ ట్రావెల్ స్టార్టప్

ఈ వీకెండ్​వెళ్లాలనుకుంటున్నం 

ఇతర రాష్ట్రాలకు కాకుండా సిటీ చుట్టుపక్కల ప్రాంతాలను ఎక్స్‌‌ప్లోర్ చేయాలనుకుంటున్నాం. అందుకే అనంతగిరి హిల్స్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. రీసెంట్​గా ఒక రిసార్ట్ చూశాం. చాలా బాగుంది. టెంట్​లు, క్యాంప్‌‌ ఫైర్, ట్రెక్కింగ్‌‌ అన్ని ఉన్నాయి. ఈ వీకెండ్ వెళ్లాలని అనుకుంటున్నాం.

-  మణిదీప్‌‌, ఎంప్లాయ్‌‌, కొండాపూర్‌‌‌‌