ఒక్కో అధికారికి రెండు, మూడు జిల్లాలు అలాట్

ఒక్కో అధికారికి రెండు, మూడు జిల్లాలు అలాట్

హైదరాబాద్, వెలుగు: స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలోని కేజీబీవీలు, యూఆర్ఎస్​, సొసైటీ గురుకులాలను తనిఖీలు చేసేందుకు విద్యా శాఖ రెడీ అయింది. 12 మంది రాష్ట్రస్థాయి అధికారులకు ఈ స్పెషల్ బాధ్యతలు అప్పగించింది. ఒక్కో అధికారికి రెండు, మూడు జిల్లాలను కేటాయించింది. వారంతా వారంలో కనీసం రెండ్రోజులు జిల్లాల్లో తనిఖీలు చేసి రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన ఇటీవల ఆదేశాలు 
జారీచేశారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు మొదలయ్యే అవకాశం ఉంది.రాష్ట్రంలో హాస్టళ్లు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, విషజ్వరాల బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరిగింది. 

వాటిల్లో ఫెసిలిటీస్ కూడా లేవని స్టూడెంట్లు రోడ్డెక్కుతున్నారు. ఫుడ్ బాగలేదని, నీళ్లు ఉండటం లేదని, టాయిలెట్లు సరిగా లేవని ఆందోళనలు చేస్తున్నారు. దీంతో హాస్టళ్లు, గురుకులాలపై పేరెంట్స్‌‌‌‌కు నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ నేపథ్యంలో వాటిలో ఉన్న సమస్యలు తెలుసుకునేందుకు విద్యాశాఖ చర్యలకు దిగింది. కేజీబీవీలు, గురుకులాలు, యూఆర్ఎస్‌‌‌‌(అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్)లు, మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టళ్లలో తనిఖీలు చేసేందుకు 12 మంది స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులకు బాధ్యతలిచ్చింది. ఇందులో కృష్ణారావు (ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్), రమణ కుమార్ (సొసైటీ గురుకులాల సెక్రెటరీ), పీవీ శ్రీహరి (ఓపెన్ స్కూల్ సొసైటీ సెక్రెటరీ), ఉషారాణి(మోడల్ స్కూల్ డైరెక్టర్), విజయలక్ష్మి (అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్), శ్రీనివాసచారి (టెక్ట్స్ బుక్ ప్రెస్ డైరెక్టర్), రాజీవ్ (ఎస్ఎస్ఏ జేడీ), ఎం. సోమిరెడ్డి (ఓపెన్ స్కూల్ జేడీ), సత్యనారాయణరెడ్డి (వరంగల్ ఆర్జేడీ), సరోజిని(మోడల్ స్కూల్ జేడీ), విజయలక్ష్మి(హైదరాబాద్ ఆర్జేడీ), వెంకట నర్సమ్మ (ఎస్ఎస్ఏ జేడీ) ఉన్నారు. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ డ్రైవ్‌‌‌‌లో భాగంగా ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించాలని డైరెక్టర్ శ్రీదేవసేన ఆదేశించారు. వారంలో కనీసం రెండు రోజులు తనిఖీలు చేయాలని, తర్వాత రిపోర్టు ఇవ్వాలని సూచించారు.

ఏమేం అడుగుతారంటే..

తనిఖీలు నిర్వహించే ఆఫీసర్లు.. ఓ చెక్ లిస్టును రెడీ చేశారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, వాటర్, ఫుడ్, ఎలక్ర్టిసిటీ, టాయిలెట్లు, డార్మిటరీలు, విద్యా సంస్థ ఆవరణ, సీసీ కెమెరాలు, రిపేర్లు, ఇతర ఫెసిలిటీస్‌‌‌‌పై వివరాలు సేకరించాల్సి ఉంది. క్లాస్‌‌‌‌ రూమ్స్, హాస్టళ్లు, టాయిలెట్లు పరిశీలించి, స్టూడెంట్లు, టీచర్లు, స్పెషల్ ఆఫీసర్లతో మాట్లాడాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. అన్నంలో పురుగులొస్తున్నాయా, ఈ ఏడాది ఫుడ్ పాయిజన్ అయిందా, మెను ప్రకారం భోజనం పెడుతున్నారా, మంచినీటి సౌకర్యం, వాటర్ ట్యాంకులు బాగున్నాయా వంటి వివరాలు స్టూడెంట్ల నుంచి తెలుసుకోనున్నారు. ప్రతి 20 మందికి ఒక టాయిలెట్, ప్రతి 10 మందికో బాత్‌‌‌‌రూమ్‌‌‌‌ ఉన్నాయా, ఉన్నవి పనిచేస్తున్నాయా, క్లీన్‌‌‌‌గా ఉన్నాయా వంటి సమాచారం సేకరించాల్సి ఉంది.

ఆఫీసర్ల అసంతృప్తి

తమ శాఖ పనులే బోలెడు ఉన్నాయని, మళ్లీ అదనపు పనులను అప్పగించారంటూ కొందరు అడిషనల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాల పర్యవేక్షణ బాధ్యతలిచ్చారని, హాస్టళ్లను తనిఖీలు చేయమనడం ఏందని డైరెక్టర్‌‌‌‌‌‌‌‌పై మండిపడుతున్నారు. అసలు విద్యా శాఖకు చెందిన ఆఫీసర్లకు తనిఖీల డ్యూటీలు వేయకుండా, పక్కశాఖ వారికి అప్పగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవాలని కొందరు ఆఫీసర్లు భావిస్తున్నారు.