బరువు తగ్గాలనుకుంటున్నారా?.. ఈ ఒక్క ఎక్సర్‌‌సైజ్ చేస్తే చాలు!

బరువు తగ్గాలనుకుంటున్నారా?.. ఈ ఒక్క ఎక్సర్‌‌సైజ్ చేస్తే చాలు!

గజిబిజి లైఫ్‌‌లో అందరూ బిజీగా అయిపోతున్నారు. పొద్దున లేచింది మొదలు పని, పని అంటూ చాలా మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ట్రాఫిక్‌‌లో ఎక్కువగా ప్రయాణించడం, గంటల పాటు కంప్యూటర్ల ముందు కుర్చీల్లో కూర్చుంటున్నారు. సరైన శారీరక శ్రమ లేకపోవడం, రాత్రిళ్లు పని చేస్తుండటం, ఆహారపు అలవాట్లలో తేడాలతో చిన్న వయస్సులోనే చాలా మంది భారీకాయులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో మానసిక ఒత్తిళ్లను దూరం చేసుకోవడంతోపాటు హుషారుగా ఉండటానికి ఫిట్‌‌నెస్ కీలకంగా మారింది. కొందరు ఫిట్‌‌నెస్ కోసం యోగా, ధ్యానం లాంటి సనాతన ప్రక్రియలను ప్రాక్టీస్ చేస్తున్నారు. మరికొందరు జిమ్‌, ఏరోబిక్స్ లాంటి అధునాతన ప్రక్రియలను అనుసరిస్తున్నారు. కొందరు నిపుణులు మాత్రం పుష్-అప్ ఎక్సర్‌సైజులను చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు. పుష్-అప్ గురించి తెలుసుకుందాం రండి..

పుష్-అప్ వల్ల ప్రయోజనాలు ఇవే..
మీ బాడీని సిక్స్ ప్యాక్‌‌ దేహంగా మార్చాలనుకుంటున్నారా? అయితే పుష్-అప్ చేయండి. మీ శరీర వెనుక భాగాన్ని బలంగా చేయాలనుకుంటున్నారా? అయితే పుష్-అప్ చేయండి. మొత్తంగా మీ బాడీ స్ట్రెంగ్త్‌‌ను మెరుగు పర్చాలనుకుంటున్నారా? అయితే తరచూ పుష్-అప్ చేయండి. పదేపదే పుషప్స్ అంటున్నామని ఆశ్చర్యపడకండి.. ఎందుకంటే పుషప్స్ చాలా ప్రభావవంతమైన, సవాలుతో కూడిన ఎక్సర్‌‌సైజ్‌‌గా నిపుణులు చెబుతున్నారు. తరచుగా బాడీ వెయిట్ కసరత్తులు చేస్తే శరీర వెనుక భాగంలోని కండరాలు మరింత బలోపేతం అవుతాయని ఎక్స్‌‌పర్ట్స్‌‌ అంటున్నారు. ఎక్సర్‌‌సైజులు చేస్తే శరీరంలో అదనంగా పేరుకున్న కొవ్వు కరగడంతోపాటు బాడీ షేప్ కూడా ఫిట్‌‌గా మారుతుంది.

టెక్నిక్ చాలా కీలకం
పుష్-అప్‌‌తో ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే పుష్-అప్ మొదలుపెట్టే బిగినర్స్‌‌ మాత్రం సరైన టెక్నిక్‌‌ను అనుసరించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా స్ట్రెంగ్త్‌‌ను పెంచుకోవడంతోపాటు గాయాల బారి నుంచి తప్పించుకోవచ్చునని‌ చెబుతున్నారు. పుష్-అప్‌‌లో చాలా తేడాలున్నాయి. వాటిలో బాగా ప్రయోజనం కలిగించే కొన్ని రకాల పుష్-అప్ ఇవే:

1. వాల్ పుష్-అప్: ఈ పుష్‌‌-అప్‌‌ను నిల్చొని చేయాల్సి ఉంటుంది. గోడ మీద చేతులు పెట్టి ఈ పుష్-అప్‌‌ చేయాలి.
2. ఇన్‌‌క్లయిన్ పుష్-అప్: మోకాళ్లపై ఉండి ఈ పుష్-అప్‌‌ చేయాలి. ఇది చేసే సమయంలో చేతులను కుర్చీపై ఉంచాలి.
3. పుష్-అప్: ఇది మామూలుగా అందరూ చేసే సాధారణ పుష్-అప్. తరచూ చేయడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
4. ఇన్‌‌క్లయిన్ పుష్-అప్: ఈ పుష్-అప్‌‌ను కాలి వేళ్లపై ఉండి, కుర్చీ మీద చేతులు ఉంచి చేయాలి.
5. క్లాప్ పుష్-అప్: పుష్-అప్ మీద పట్టు సంపాదించాక క్లాప్ పుష్-అప్‌‌ను ప్రయత్నించొచ్చు. పలు రకాలు పుష్-అప్ గురించి తెలుసుకున్నారుగా.. ఇంకెందుకు ఆలస్యం? పుష్-అప్ చేయడం మొదలెట్టేయండి మరి..