యూజీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం: లక్ష్మణ్

యూజీసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం: లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా అన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ ప్రెసిడెంట్, ఎంపీ లక్ష్మణ్ అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరితో ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు కాలేదన్నారు. రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో ఏటా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన 8 లక్షల మంది విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారని చెప్పారు. బీజేపీ సర్కార్ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో అణగారిన వర్గాలకు లబ్ధి చేకూరుతుందని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. 

ప్రధాని మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యూజీసీకి ధన్యవాదాలు తెలిపారు. యూజీసీ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ వర్సిటీల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 10కి పైగా ప్రైవేట్ వర్సిటీల్లో సుమారు 30 వేల మందికి ప్రవేశాలు కల్పిస్తున్నారని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 15 వేల సీట్లు కోల్పోతున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉన్నా.. రాష్ట్ర సర్కార్ ఉద్దేశపూర్వకంగానే రిజర్వేషన్లను విస్మరిస్తోందని ఆరోపించారు. యూజీసీ ఆదేశాల నేపథ్యంలో ఈ ఏడాది నుంచే రిజర్వేషన్లు అమలు చేసేలా అన్ని ప్రైవేట్ వర్సిటీలను ఆదేశించాలని కోరారు.