- స్నానాలకు వెళ్లి.. గోదావరిలో మునిగి..
- ఆరుగురిని కాపాడిన ఫొటోగ్రాఫర్లు, ఈతగాళ్లు
- భద్రాచలంలో స్నాన ఘట్టాల వద్ద ఘటన
భద్రాచలం, వెలుగు: గోదావరిలో స్నానాలు చేసేందుకు దిగి కొట్టుకుపోతున్న భక్తులను స్థానికులు కాపాడిన ఘటన శుక్రవారం భద్రాచలంలో జరిగింది. ఇల్లెందుకు చెందిన కొందరు భక్తులు మొక్కుల కోసం భద్రాచలం వెళ్లారు. వీరులో ముగ్గురు చిన్న పిల్లలు, ముగ్గురు పెద్దలు స్నానాలు చేసేందుకు నదిలోకి దిగారు. అక్కడ లోతు తెలియకపోవడంతో ఒక్కసారిగా మునిగి కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న ఫొటోగ్రాఫర్లు, ఈతగాళ్లు అప్రమత్తమై రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. దీంతో భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. నదిలో లోతును తెలిపే హెచ్చరిక బోర్డులు లేకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు పేర్కొన్నారు.