- ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో ఉద్రిక్తతలు
- అపాచీ హెలికాప్టర్ కూలడంతో ఇరాన్‌పై అమెరికా ప్రతీకార దాడులు
- జాస్క్, బందర్ అబ్బాస్, ఖేష్మ్ ద్వీపాల్లోని రక్షణ వ్యవస్థలపై బాంబుల వర్షం
- గల్ఫ్ లో అమెరికా బేస్ లను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు
- అమెరికా ఎంక్యూ 9 రీపర్ డ్రోన్‌ను కూల్చేసినట్టు ఐఆర్‌జీసీ ప్రకటన
- ఇంకా తీవ్రంగా స్పందిస్తం: ఇరాన్
- మరిన్ని దాడులు చేస్తాం: ట్రంప్
యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు చివరి దశకు వచ్చాయని, త్వరలోనే శాంతి ఒప్పందం కుదురుతుందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. హార్మూజ్ వద్ద అమెరికా హెలికాప్టర్‌ను ఇరాన్ దళాలు కూల్చివేయడంతో ఈ ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నది.
టెహ్రాన్/వాషింగ్టన్:పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు చివరి దశకు వచ్చాయని, త్వరలోనే శాంతి ఒప్పందం కుదురుతుందని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి.
హార్మూజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన ‘అపాచీ’ హెలికాప్టర్‌ను ఇరాన్ దళాలు కూల్చివేయడంతో ఈ ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్నది. దీనికి ప్రతీకారంగా అమెరికా సైన్యం ఇరాన్ లక్ష్యాలపై భీకర దాడులకు దిగింది. మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గకుండా బహ్రెయిన్‌తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా నౌకాదళ స్థావరాలపై ఎదురుదాడికి దిగడంతో వెస్ట్ ఏషియా రణరంగంగా మారింది.
మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. చారిత్రాత్మక నగరమైన టైర్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం11 మంది మరణించినట్టు లెబనాన్ అధికారులు తెలిపారు. ఆ నగరాన్ని పూర్తిగా ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించడంతో.. అక్కడి క్రైస్తవ వర్గాలతో సహా వేలాది మంది ప్రజలు తమ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఉత్తర ప్రాంతాల వైపు పరుగులు తీస్తున్నారు.
- దాడులు.. ప్రతిదాడులు..
అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ఇరాన్ డ్రోన్ దాడే కారణమని నిర్ధారించుకున్న అమెరికా.. శత్రుదేశ వైమానిక రక్షణ, రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని 3 విడతలుగా విరుచుకుపడింది. ఇరాన్‌లోని జాస్క్, బందర్ అబ్బాస్, ఖేష్మ్ ద్వీపాల్లోని రక్షణ వ్యవస్థలపై యూఎస్ ఎయిర్‌ఫోర్స్, నేవీ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించాయి.
ఈ దాడుల్లో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, పర్యవేక్షణ రాడార్లు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు ధ్వంసమైనట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. తాము జరిపిన ఆత్మరక్షణ దాడులు విజయవంతంగా ముగిశాయని స్పష్టం చేసింది. బందర్ అబ్బాస్, ఖేష్మ్ ఐలాండ్ సమీపంలో ఈ దాడులు జరిగినట్టు ఇరాన్ ధ్రువీకరించింది. ఈ దాడుల వల్ల సిరిక్ పరిధిలోని బెమానీ జిల్లాలో 2 వాటర్ ట్యాంకులు, ఒక టెలికమ్యూనికేషన్ టవర్ కూడా ధ్వంసమైనట్టు ఇరాన్ వార్తాసంస్థలు వెల్లడించాయి.
అమెరికా దాడులకు ఇరాన్ కూడా గట్టిగానే బదులిచ్చింది. ఇరాన్ సైన్యం, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) సంయుక్తంగా బహ్రెయిన్‌లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ (ఐదో నౌకాదళం) స్థావరంపై భారీ డ్రోన్ దాడికి పాల్పడ్డాయి. అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాల హ్యాంగర్లను, సైనిక స్థావరాలను తాము లక్ష్యంగా చేసుకున్నట్టు ఇరాన్ ప్రకటించింది. బుషెహర్ ప్రావిన్స్‌పై ఒక అమెరికా ఎంక్యూ 9 రీపర్ డ్రోన్ కూల్చివేసినట్టు ఐఆర్‌జీసీ ప్రకటించింది. అయితే, ఇరాన్ చేసిన ఈ ప్రకటనను అమెరికా అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.
- ఇంకా తీవ్రంగా స్పందిస్తం: ఇరాన్
తమ భూభాగంపై దాడులు ఇలానే కొనసాగితే.. తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని అమెరికాను ఇరాన్ హెచ్చరించింది. ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. ‘‘అమెరికా మా సహనాన్ని, దృఢ నిశ్చయాన్ని పరీక్షించాలని చూస్తోంది.
ఏ దాడులనైనా, బెదిరింపులనైనా మేం ఊరికే వదిలిపెట్టం. తగిన బుద్ధి చెప్తాం. మీరు సురక్షితంగా ఉండాలనుకుంటే.. వెంటనే మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోండి” అని ప్రజలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సూచించారు. ఈ కొత్త పరిణామాల నేపథ్యంలో యుద్ధాన్ని ముగించే చర్చలపై తమ వైఖరిని పునఃసమీక్షిస్తామని ఇరాన్ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయ్ స్పష్టం చేశారు.
- ఇరాన్‌పై మరిన్ని దాడులు చేస్తాం: ట్రంప్
గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇరాన్ పై మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. శాంతి చర్చల్లో ప్రతిష్టంభనకు ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. అమెరికా దళాలకు ఆశ్రయం ఇస్తున్న బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాలపై ఇరాన్ కాల్పులు జరిపిన కొన్ని గంటల వ్యవధిలోనే ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. ‘‘ఈ రోజు మనం వారిపై మళ్లీ తీవ్రంగా దాడి చేయబోతున్నాం’’ అని వైట్ హౌస్‌లో విలేకరులతో ట్రంప్ చెప్పారు.
‘‘ఒప్పందానికి చాలా దగ్గరగా వచ్చాం. కానీ వారు మనల్ని కాలయాపనతో ఆడిస్తున్నారు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు గట్టి సందేశం ఇచ్చేందుకే ఈ దాడులు చేపట్టినట్లు తెలిపారు.‘‘వారు మా హెలికాప్టర్‌ను కూల్చేశారు. దానికి ఇది మా రియాక్షన్. ఇది చాలా బలంగా.. అత్యంత శక్తిమంతంగా ఉండాలని అనుకుంటున్నా’’ అని వ్యాఖ్యానించారు.
