- దీక్ష విరమించాలంటూజూనియర్ డాక్టర్లకు దీదీ విజ్ఞప్తి
- డిమాండ్లపై మరోసారి చర్చకు రావాలని సీఎం పిలుపు
కోల్కతా: బెంగాల్లోని కోల్కతా ఆర్జీ కర్ దవాఖానలో డాక్టర్రేప్, మర్డర్ కేసులో తగిన న్యాయం చేయాలనే డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పందించారు.
జూనియర్ డాక్టర్లు తమ ముందుంచిన డిమాండ్లను నెరవేర్చేందుకు 3–4 నెలల సమయం ఇవ్వాలని కోరారు. దీక్ష విరమించి వెంటనే విధుల్లో చేరాలని జూనియర్ డాక్టర్లను అభ్యర్థించారు. ఆర్జీ కర్ దవాఖాన వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్ల వద్దకు శనివారం చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్, హోంసెక్రటరీ నందిని చక్రవర్తిని పంపించారు.
అదే సమయంలో జూనియర్డాక్టర్లతో మమతా బెనర్జీ ఫోన్లో మాట్లాడారు. తన ముందుంచిన డిమాండ్లలో మెజార్టీ భాగం ఇప్పటికే నెరవేర్చామని, కొన్ని నెలల సమయం ఇస్తే
మిగతా వాటిని తీరుస్తామని తెలిపారు. సోమవారం ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రావాలని జూనియర్ డాక్టర్లను ఆమె ఆహ్వానించారు.
డిమాండ్లపై చర్చించి నిర్ణయం తీస్కుంటం
అందరికీ నిరసన తెలిపే హక్కు ఉంటుంది కానీ.. వైద్యారోగ్య సేవలపై దాని ప్రభావం పడకూడదని సీఎం మమతా బెనర్జీ అన్నారు. తాను డాక్టర్ల డిమాండ్లతో విభేదించడం లేదని, కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నట్టు చెప్పారు. డాక్టర్లు చేసిన పలు డిమాండ్లను నెరవేర్చేందుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది డాక్టర్లు ప్రభుత్వాన్ని నిర్దేశించడం సరికాదని పేర్కొన్నారు. డాక్టర్ల డిమాండ్లపై చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కోల్‌కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో ఈ ఏడాది ఆగస్టు 9న ట్రెయినీ డాక్టర్ రేప్, మర్డర్ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. శనివారంతో ఈ దీక్ష 15 రోజులకు చేరుకున్నది. పలువురు జూనియర్ డాక్టర్ల ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఈ నెల 21లోపు తమ డిమాండ్లను నెరవేర్చాలని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం మమత స్పందించి, మరోసారి వారిని చర్చలకు ఆహ్వానించారు.