ఆ చట్టాల అమలును వాయిదా వేయండి.. మోదీకి.. మమత బెనర్జీ లేఖ

ఆ చట్టాల అమలును వాయిదా వేయండి.. మోదీకి.. మమత బెనర్జీ లేఖ

కేంద్ర ప్రభుత్వం కొత్తగా మూడు నేర ( క్రిమినల్​) చట్టాలను అమల్లోకి తీసుకురానుంది. అయితే ఈ చట్టాలు జులై 1 వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.  ఈ చట్టాల అమలును వాయిదా వేయాలని పశ్చిమ బెంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోదీకి లేఖ రాశారు.  

కొత్తగా రూపొందించిన క్రిమినల్‌ చట్టాలను వాయిదా వేయడంవల్ల వీటిపై పార్లమెంటులో సమీక్ష జరిపే అవకాశం ఉంటుందని మమతాబెనర్జి పేర్కొన్నారు.   బ్రిటిష్‌కాలం నాటి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ 1872 చట్టాల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాలను బీజేపీ రూపొందించింది. ఈ చట్టాలను.. దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించాలన్న ఉద్దేశ్యంతో వీటిని రూపొందించారు. న్యాయ వ్యవస్థతో పాటు కోర్టు నిర్వాహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ చట్టాలు ఉపయోగపడనన్నాయి.

 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం క్లిష్టమైన మూడు బిల్లులను ఏకపక్షంగా, ఎటువంటి చర్చ లేకుండా ఆమోదించింది. బిల్లులు ఆమోదం పొందిన రోజు దాదాపు 100 మంది లోక్ సభ సభ్యులను సస్పెండ్ చేశారు. ఉభయ సభలకు చెందిన మొత్తం 146 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి బయటకు పంపారు. నిరంకుశ పద్దతిలో బిల్లులు ఆమోదించబడ్డాయి. వీటి అమలును వాయిదా వేయడం ద్వారా కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ ఈ చట్టాలను క్షుణ్ణంగా సమీక్షించడానికి, చర్చించడానికి అవకాశం ఉంటుందని....ప్రజాస్వామ్య చట్టాలను నిలబెట్టడానికి, అంతే కాకుండా శాసన ప్రక్రియలపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఇది ఎంతగానో అవసరం. భారతీయ న్యాయ సంహితతో పాటు మరో రెండు బిల్లుల అమలును వాయిదా వేయాలి..మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోండి అంటూ ఆమె లేఖ రాశారు.