సుప్రీంకోర్టును ఆశ్రయించిన సువేందు అధికారి

సుప్రీంకోర్టును ఆశ్రయించిన సువేందు అధికారి

కోల్‌కతా: నందిగ్రామ్ అసెంబ్లీ నుంచి ఎన్నికైన తన గెలుపును సవాలు చేస్తూ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టులో విచారణ చేయరాదని, మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ప్రతిపక్ష బీజేపీ నేత, నందిగ్రామ్‌ ఎమ్మెల్యే సువేందు అధికారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ఒకప్పుడు తనకు కుడిభుజంలా వ్యవహరించిన సువేందు అధికారి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరి నందిగ్రామ్ అసెంబ్లీలో సీఎం మమతాబెనర్జీని సుమారు రెండు వేల ఓట్ల తేడాతో ఓడించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

ఒక వైపు దేశమంతా తృణమూల్ హవా వీచి.. ఆ పార్టీ తిరుగులేని ఆధిక్యంతో విజయదుందుభి మోగించినా సాక్షాత్తు సీఎం మమతాబెనర్జీ ఓడిపోవడం ఆ పార్టీ వర్గాలను, అభిమానులను షాక్ కు గురిచేసింది. ఈ నేపధ్యంలో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. అంతటితో ఆగకుండా నందిగ్రామ్‌ అసెంబ్లీ పరిధిలో జరిగిన ఎన్నికను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఎం మమతా బెనర్జి వేసిన పిటిషన్‌ను ఇవాళ కోల్‌కతా హైకోర్టు విచారించింది. మమతాదీదీ వేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి షాంపా సర్కార్ ఆన్‌లైన్‌ ద్వారా విచారణ జరిపారు.

పిటిషనర్ అయిన సీఎం మమతా బెనర్జీ ఆన్ లైన్ ద్వారా విచారణలో పాల్గొన్నారు. నందిగ్రామ్ అసెంబ్లీ పరిధిలో పోలింగ్‌ కేంద్రాలలో దౌర్జన్యాలకు పాల్పడ్డారని.. యధేచ్చగా రిగ్గింగ్‌ ఓట్లు వేసుకోవడంతోపాటు ప్రజల నోళ్లు మూయించేందుకు డబ్బుల పంపిణీ చేశారని ఆరోపించారు. విచారణ చేసిన హైకోర్టు నందిగ్రామ్‌ ఎన్నికలో ఉపయోగించిన ఈవీఎంలు, ఇతర పేపర్లు, వీడియో ఫుటేజీలను భద్రపర్చాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు విచారణ కోల్ కతా హైకోర్టు జరుగుతుండగానే సువేందు అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోల్ కతా హైకోర్టు విచారణ చేయరాదని.. మరో కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు.