ధనాధన్ క్రికెట్లో డబుల్ సెంచరీ..

ధనాధన్ క్రికెట్లో  డబుల్ సెంచరీ..

టీ20 క్రికెట్లో సెంచరీ కొట్టడమే గొప్ప. సెంచరీ కొట్టేందుకు కూడా..బ్యాట్స్మన్ బరిలోకి దిగినప్పటి నుంచి బాదుడు స్టార్ట్ చేయాలి. అలా అయితేనే ఈ పొట్టి ఫార్మాట్లో సెంచరీ సాధించగలం. అలా ఇప్పటి వరకు ఎందరో క్రికెటర్లు సెంచరీ మార్కును అందుకున్నారు. అయితే పొట్టి ఫార్మాట్లో సెంచరీ చేయడమే గొప్ప అనుకుంటున్న ప్రస్తుత పరిస్థితిలో ఓ క్రికెటర్  ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. విండీస్ విధ్వంసకర ప్లేయర్ రఖీమ్ కార్న్వాల్ తొలిసారిగా టీ20ల్లో డబుల్ సెంచరీ చేసి..చరిత్ర సృష్టించాడు. 

ఎన్ని బంతుల్లో డబుల్ సెంచరీ..?
అట్లాంటా ఓపెన్ 2022 టీ20 లీగ్ డబుల్ సెంచరీకి వేదికైంది. అట్లాంటా ఫైర్ తరఫున బరిలోకి  రఖీమ్ కార్న్ వాల్..స్క్వేర్ డ్రైవ్‌ జట్టుపై కేవలం 77 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. ఇందులో 22 సిక్సులు, 17 ఫోర్లు ఉండటం విశేషం. మొత్తంగా 266 స్ట్రైక్ రేట్ తో  205 పరుగులు చేసి  నాటౌట్‌గా నిలిచాడు. కార్న్ వాల్ డబుల్ సెంచరీ దెబ్బకు.. అట్లాంటా టీమ్ 20 ఓవర్లలో కేవలం 1 వికెట్ నష్టపోయి 326 పరుగుల భారీ స్కోరు చేసింది. 

సిక్సులతోనే సెంచరీ..
కార్న్ వాల్ 360 డిగ్రీ ప్లేయర్. మైదానం నలువైపులా బంతిని బాదగల సత్తా ఉన్న ఆటగాడు. అందుకే అతను క్రీజులో ఉన్నాడంటే..ప్రత్యర్థి కెప్టెన్ ఫీల్డింగ్ సెట్ చేయాలంటే తలపట్టుకుంటాడు. ఇక ఈ మ్యాచ్ లో కార్న్ వాల్ కొట్టే సిక్సులు..చుక్కలను తాకాయని చెప్పొచ్చు. ఒక్కో సిక్స్ కొడుతుంటే..బౌలర్ ప్రేక్షకుడయ్యాడు. బంతిని అలా చూస్తూ నిలబడాల్సిన  పరిస్థితి ఎదురైంది. మొత్తంగా 22 సిక్సులు, 17 ఫోర్లు కొట్టిన కార్న్ వాల్..సిక్సుల ద్వారానే 132 పరుగులు చేయడం విశేషం. 

సిక్సులు కొట్టడం సరదా..
డబుల్ సెంచరీ చేసిన కార్న్వాల్..తనకు సిక్సులు కొట్టడం సరదా అని చెప్పాడు. తాను 360 డిగ్రీ ప్లేయర్ నని...అత్మవిశ్వాసమే తన రహస్యమన్నాడు. సరైన షాట్లు ఆడి..వాటిని బౌండరీలుగా మలుస్తానని తెలిపాడు. ఒక్కో రోజు 10 సిక్సులు కొడితే..మరో రోజు డకౌట్ కావచ్చని..అయితే ఆటగాడిపై తనపై తనకు నమ్మకం ఉండాలని కార్న్వాల్ చెప్పుకొచ్చాడు.