ముంబై: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన వెస్టిండీస్ టీ20 వరల్డ్ కప్‌లో రెండో విజయాన్ని అందుకుంది. షెర్ఫానే రూథర్‌ఫోర్డ్ (42 బాల్స్‌లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 76 నాటౌట్) దంచికొట్టడంతో బుధవారం జరిగిన గ్రూప్–సి లీగ్ మ్యాచ్‌లో విండీస్ 30 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌కు చెక్ పెట్టింది. టాస్ ఓడిన విండీస్ 20 ఓవర్లలో 196/6 స్కోరు చేసింది. 8 రన్స్‌కే బ్రెండన్ కింగ్ (1), షై హోప్ (0) ఔటయ్యారు. తర్వాత హెట్‌మయర్ (23), రోస్టన్ ఛేజ్ (34) ఇన్నింగ్స్‌ను బాగు చేసే బాధ్యతను కొంత వరకు సమర్థంగా నిర్వహించారు.
మూడో వికెట్‌కు 47 రన్స్ జోడించి హెట్‌మయర్ ఔట్‌కాగా, రూథర్‌ఫోర్డ్ క్రీజులోకి వచ్చాడు. పవర్‌ప్లేలో 54/3 స్కోరు చేసిన విండీస్‌కు పదో ఓవర్‌లో ఛేజ్ ఔట్‌తో మరో దెబ్బ తగిలింది. నాలుగో వికెట్‌కు 22 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. ఇక్కడి నుంచి రూథర్‌పోర్డ్ ఒంటరి పోరాటం చేశాడు. భారీ సిక్స్‌లు, ఫోర్లతో ఇంగ్లిష్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. పావెల్‌తో (14) ఐదో వికెట్‌కు 51 రన్స్ జోడించిన రూథర్‌ఫోర్డ్.. హోల్డర్ (33)తో ఆరో వికెట్‌కు అజేయంగా 61 రన్స్ జత చేయడంతో కరీబియన్ జట్టు మంచి టార్గెట్‌ను నిర్దేశించింది.
ఓవర్టన్, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ఇంగ్లండ్ 19 ఓవర్లలో 166 రన్స్‌కే ఆలౌటైంది. సామ్ కరన్ (43 నాటౌట్) టాప్ స్కోరర్. ఫిల్ సాల్ట్ (30), బట్లర్ (21), బెథెల్ (33), బ్రూక్ (17) పోరాడినా ప్రయోజనం దక్కలేదు. విండీస్ బౌలర్లు గుడకేశ్ మోతీ (3/33), ఛేజ్ (2/23) సమయోచితంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లిష్ బ్యాటర్లు రన్స్ చేయడంలో ఫెయిలయ్యారు. బాంటన్ (2), విల్ జాక్స్ (2), ఓవర్టన్ (5), ఆర్చర్ (6), డాసన్ (1), రషీద్ (0) నిరాశపర్చారు. రూథర్‌ఫోర్డ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
