అప్పులు తీసుకుని కట్టిన ప్రాజెక్టుల సంగతేంది?

అప్పులు తీసుకుని కట్టిన ప్రాజెక్టుల సంగతేంది?
  • బోర్డు పరిధిలోకి తీసుకుంటే లోన్లు ఎవరు కడ్తరని తెలంగాణ ప్రశ్న
  • దీనిపై బోర్డు మీటింగ్‌‌‌‌లో చర్చించాలన్న జలశక్తి శాఖ
  • జ్యూరిస్‌‌డిక్షన్‌‌ అమలులో కొర్రీలెన్నో
  • లోన్లు తీసుకున్న ప్రాజెక్టుల అప్పగింత లేనట్టే!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కృష్ణా, గోదావరి బోర్డుల జ్యూరిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌లో భాగంగా ప్రాజెక్టుల స్వాధీనంపై పీఠముడి పడింది. లోన్లు తీసుకొని నిర్మించిన ప్రాజెక్టులను బోర్డు అధీనంలోకి తీసుకోవడం దాదాపు లేనట్టేనని తెలుస్తోంది. తాము అప్పు తీసుకొని నిర్మించిన ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తే లోన్ల రీపేమెంట్‌‌‌‌ ఎట్లా అనే తెలంగాణ ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సమాధానమిచ్చింది. బోర్డు మీటింగ్‌‌‌‌లోనే దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్పింది. ఈమేరకు జీఆర్‌‌‌‌ఎంబీ మెంబర్‌‌‌‌ సెక్రటరీ బీపీ పాండే గురువారం ఇరిగేషన్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ సీఎస్‌‌‌‌ రజత్‌‌‌‌ కుమార్‌‌‌‌కు లేఖ రాశారు. సీడ్‌‌‌‌ మనీ, అసెట్స్‌‌‌‌ ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌, రెవెన్యూ యుటిలైజేషన్‌‌‌‌పై తెలంగాణ లేవనెత్తిన ప్రశ్నలు, వాటికి కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన సమాధానాలను లేఖలో వివరించారు.

స్పష్టత ఇవ్వండి
గోదావరిపై తెలంగాణలోని సింగూరు, నిజాంసాగర్‌‌‌‌, ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్పీ, కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతలు సహా మిగతా ప్రాజెక్టులను జీఆర్‌‌‌‌ఎంబీ నిర్వహణకు అప్పగించాలని జులై 15న జారీ చేసిన గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులను నోటిఫికేషన్‌‌‌‌లోని రెండో షెడ్యూల్‌‌‌‌లో చేర్చారు. దీనిపై జీఆర్‌‌‌‌ఎంబీ 12వ మీటింగ్‌‌‌‌లో తెలంగాణ అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాలకు పెద్ద ఎత్తున అప్పులు తెచ్చింది. ఆయా ప్రాజెక్టుల ఆపరేషన్‌‌‌‌, మెయింటనెన్స్‌‌‌‌, మానిటరింగ్‌‌‌‌ మొత్తంగా బోర్డులకు అప్పగిస్తే లోన్లను కేంద్ర ప్రభుత్వం రీపేమెంట్‌‌‌‌ చేస్తుందా అని ప్రశ్నించింది. అప్పుల చెల్లింపుపై తమకు స్పష్టతనివ్వాలని కోరింది. సీడ్‌‌‌‌ మనీ, రెవెన్యూ యుటిలైజేషన్‌‌‌‌పైనా అనేక సందేహాలు లేవనెత్తింది. బోర్డు మీటింగ్‌‌‌‌లో తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను వివరిస్తూ జీఆర్‌‌‌‌ఎంబీ చైర్మన్‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌ అయ్యర్‌‌‌‌.. కేంద్ర జలశక్తి శాఖ సెక్రటరీకి లేఖ రాశారు. ఆయన రాసిన లేఖకు కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల సమాధానమిచ్చింది.

రెండు రాష్ట్రాలదీ ఒకే వాదన
లోన్లు తీసుకుని నిర్మించిన ప్రాజెక్టుల బ్యారేజీలు, డ్యాంలు, రెగ్యులేటింగ్‌‌‌‌ స్ట్రక్చర్లు, కెనాల్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, ట్రాన్స్‌‌‌‌మిషన్‌‌‌‌ లైన్లు ఇతర ఆస్తుల బదలాయింపుపై గోదావరి ఫుల్‌‌‌‌ బోర్డు మీటింగ్స్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో చర్చించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం.. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను బోర్డు నిర్వహణలోకి తీసుకొని తీరాలని వాదిస్తోంది. లోన్లు తీసుకున్న ప్రాజెక్టులపై తెలంగాణ స్పష్టత కోరింది. ఈ నేపథ్యంలో ఫుల్‌‌‌‌ బోర్డు మీటింగ్స్ పెట్టినా రెండు రాష్ట్రాలు ఇదే తరహా వాదనలు వినిపించే ఆస్కారముంది. అలాంటప్పుడు ఆయా ఔట్‌‌‌‌లెట్లు బోర్డు నిర్వహణలోకి వెళ్లడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం జ్యూరిస్‌‌‌‌డిక్షన్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసిన 60 రోజుల్లోగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు రూ.200 కోట్ల చొప్పున సీడ్‌‌‌‌ మనీని బోర్డు అకౌంట్‌‌‌‌లో జమ చేయాల్సిందేనని జల శక్తి శాఖ క్లారిటీ ఇచ్చింది. గెజిట్‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌లోనే ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నామని తేల్చిచెప్పింది. రెవెన్యూ యుటిలైజేషన్‌‌‌‌పై బోర్డు రెండు రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి, రెండు రాష్ట్రాల ఆమోదంతో నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.