గురకను లైట్ తీసుకుంటున్నారా.. డేంజర్ జోన్లో ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు..!

గురకను లైట్ తీసుకుంటున్నారా.. డేంజర్ జోన్లో ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు..!

 నిద్ర సరిపడా ఉంటే శరీరానికి, మనసుకు ఎంత హాయిగా ఉంటుందో! చకచకా పనులు చక్కబెట్టేయొచ్చు. షార్ప్​గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆరోగ్యంగానే కాదు.. అందంగానూ కనపడొచ్చు. అందుకే నిద్ర అందరికీ అత్యవసరం. ఈ విషయంలో కొందరు విభేదించినా.. డాక్టర్లు మాత్రం దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు అంటున్నారు. ఎందుకంటే.. నిద్ర ఒక్కొక్కరినీ ఒక్కోలా ఎఫెక్ట్ చేస్తుంది. నిద్ర తక్కువైతే జరిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. వాటన్నింటి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఇది చదివేయండి. 

నిద్రపోయేటప్పుడు చాలామందికి గురక వస్తుంటుంది. దాంతో పక్కనవాళ్లు ఇబ్బంది పడడం సహజం. కానీ, గురకపెట్టేవాళ్లు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? గురక వల్ల ఎంతసేపు నిద్రపోయినా వాళ్లకు విశ్రాంతి తీసుకున్నట్టు అనిపించదు. కానీ, ఈ సమస్యను చాలామంది గుర్తించరు. తమంతట తాముగా గుర్తించలేరు కూడా. ఆ కండిషన్​నే అబ్​స్ట్రక్టివ్​ స్లీప్ ఆప్నియా (ఒఎస్​ఎ) అంటారు. ఇది సైలెంట్​గా నిద్రను డిస్టర్బ్​ చేస్తుంది. తద్వారా దీర్ఘకాలిక అలసటకు దారితీస్తుంది. అంతేకాదు.. మరెన్నో హెల్త్​ ప్రాబ్లమ్స్​ రావడానికి అవకాశం ఉందని ముందుగా తెలియజేసే అలారమ్​ లాంటిది. దీనివల్ల ‘బయటకు కనిపించని ఇబ్బందులు చాలా ఉంటాయి. కానీ మన శరీరం ఇచ్చే సంకేతాలను బట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే లైఫ్​ మారిపోతుంది’ అంటున్నారు డాక్టర్లు. 

నిద్రలో శ్వాస ఆగిపోతుంటే.. 

నిద్రపోయేటప్పుడు గొంతు భాగంలో ఉన్న కండరాలు ఎక్కువగా రిలాక్స్​ అవుతాయి. దాంతో నాలుక లేదా టాన్సిల్స్​ లాంటి మృదుకణజాలాలు (సాఫ్ట్ టిష్యూ) ఉండే భాగాలు గాలి వెళ్లే ద్వారాన్ని అడ్డుకుంటాయి. దీన్నే అబ్​స్ట్రక్టివ్​ స్లీప్​ ఆప్నియా అంటాం. ఈ బ్లాకేజీ కండిషన్​ కొన్ని సెకండ్ల నుంచి ఒక నిమిషం పాటు ఉంటుంది. ఆ టైంలో మెదడుకు ఆక్సిజన్ తక్కువై, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ఇది కొన్ని క్షణాలపాటు ఉండడం వల్ల ఎవరూ ఆ పరిస్థితిని గుర్తుపెట్టుకోలేరు. దీంతో గాఢనిద్రలోకి వెళ్లకుండా మాటిమాటికీ మెలకువ వస్తూ ఉంటుంది. తద్వారా శరీరానికి సరిపడా నిద్ర ఉండదు. ఊపిరి తీసుకోవడంలో కలిగే ఈ ఇబ్బందులు లేదా ఆప్నియాలు ఒక్కరాత్రిలోనే పది నుంచి వందలసార్లు కూడా వస్తాయి. 

ఇవే సంకేతాలు

ఈ కండిషన్​ని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవేంటంటే.. బిగ్గరగా గురక పెట్టడం, ఊపిరి సరిగా ఆడకపోవడం వల్ల మాటిమాటికీ మేల్కోవడం. పగటిపూట ఎక్కువగా నిద్ర వచ్చినట్టు ఉండడం. దీర్ఘకాలికంగా అలసటగా అనిపించడం. నిద్ర మత్తు లేదా రాత్రి పూట నిద్రపోవడానికి బదులు పగటిపూట పనులు చేస్తున్నప్పుడే నిద్రలోకి జారుకోవడం వంటివి ఉంటాయి. వాటితోపాటు ఉదయం పూట వచ్చే తలనొప్పులు అంటే.. ఆక్సిజన్ తక్కువ కావడం వల్ల నిద్రలేచినప్పుడు తలనొప్పిగా ఉండడం ఒక సంకేతం. 

నోరు పొడిబారడం లేదా గొంతు నొప్పి, నిద్రపోయేటప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకోవడం వంటివి కూడా స్లీప్​ ఆప్నియా సంకేతాలే. ఇంకా ఏకాగ్రత లోపం లేదా జ్ఞాపకశక్తిలో సమస్యలు, చిరాకు, మూడ్ చేంజెస్​ లేదా డిప్రెషన్, రాత్రిపూట ఎక్కువసార్లు యూరిన్​కి వెళ్లడం, సెక్సువల్ లైఫ్ మీద ఆసక్తి లేకపోవడం వంటివన్నీ అబ్​స్ట్రక్టివ్ స్లీప్​ ఆప్నియాను సూచించే లక్షణాలే. అయితే, ఈ పరిస్థితి నిద్రలో వస్తుంది కాబట్టి దీన్ని మీ పక్కన ఉండేవాళ్లు ​ మాత్రమే గుర్తించగలరు. మీరు ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు పడడాన్ని వాళ్లు గుర్తిస్తే.. సరైన టైంకి ట్రీట్​మెంట్ తీసుకునే చాన్స్ ఉంటుంది.  

రిస్క్​లో ఉన్నదెవరు?

ఒఎస్​ఎ కండిషన్​కు వయసు, లింగభేదం ఏవీ లేవు.. ఎవరినైనా ఎఫెక్ట్ చేయొచ్చు. కొన్ని అంశాలు ఆప్నియాకు గురయ్యే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అవేంటంటే... ఒబెసిటీ, మెడ చుట్టూ కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల శ్వాస ద్వారం సన్నగా అవుతుంది. పొడవైన మెడ ఉన్నవాళ్లలో కూడా ఈ పరిస్థితి తలెత్తుతుంది. 

తర్వాత టాన్సిల్స్ పెరగడం, ఇవి చిన్నపిల్లల్లో సహజంగా జరుగుతుంటాయి. వయసు పెరిగేకొద్దీ గొంతు కండరాలు టోన్ కోల్పోవడం వల్ల రిస్క్ పెరుగుతుంది. అలాగే ఇది మగవాళ్లలో సహజంగానే కనిపిస్తుంటుంది. మహిళల్లో కూడా వస్తుంటుంది. కానీ, మెనోపాజ్ తర్వాత రిస్క్ పెరుగుతుంది. అంతేకాకుండా గొంతు, లోపలి గడ్డం సన్నగా ఉండడం, లేదా నాలుక పెద్దగా ఉండడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇకపోతే.. ఆల్కహాల్ లేదా ఏదైనా సెడేటివ్ డ్రగ్ తీసుకోవడం వల్ల గొంతులోని కండరాలు రిలాక్స్ అవుతాయి. స్మోకింగ్ చేయడం వల్ల శ్వాస మార్గంలో వాపు వస్తుంది కాబట్టి స్లీప్​ ఆప్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే తర్వాతి తరాల వాళ్లకు వచ్చేస్తుంది. 

ఇవేకాకుండా హైపో థైరాయిడిజం లేదా హార్ట్​ ఫెయిల్యూర్​, ఏదైనా సీరియస్ హెల్త్ ఇష్యూ ఉన్నవాళ్లలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది. అంతేకాదు.. ఒఎస్​ఎ సమస్యకు ట్రీట్​మెంట్ తీసుకోకపోవడం వల్ల నిద్రమత్తే కాకుండా అంతకుమించి మరికొన్ని సమస్యలకు కారణమవుతుంది. రాత్రిపూట పదే పదే ఆక్సిజన్ తగ్గడం, రక్తపోటు పెరగడం వల్ల మీ శరీరం పై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది తీవ్రమైన పరిస్థితులకు దారితీస్తుంది. అవేంటంటే.. కార్డియో వాస్కులార్ డిసీజెస్, బ్లడ్​ ప్రెజర్, హార్ట్ ఎటాక్​, స్ట్రోక్​, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్​ బీట్​లో అంతరాయాలు కలగడం వంటి రిస్క్​లు పెరుగుతాయి.

చివరిగా.. 

ఒఎస్​ఎను మేనేజ్​ చేయడం అనేది ఒక కమిట్​మెంట్. కానీ, అలా చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పేషెంట్లు తరచుగా ఎక్కువ ఎనర్జీతో ఉంటారు. మూడ్, ఏకాగ్రత ఇంప్రూవ్ అవుతుంది. గురక తగ్గుతుంది. దీర్ఘకాలిక హెల్త్ కండిషన్స్ మీద మంచి కంట్రోల్ వస్తుంది. నిజానికి ఆరోగ్యకరమైన నిద్ర లగ్జరీ కాదు. ఆరోగ్యకరమైన జీవితానికి అవసరం. మీరు లేదా మీకు తెలిసిన వాళ్లలో ఒఎస్​ఎ సింప్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్​ని కలవడం ఉత్తమం. పరీక్ష చేయించుకోవడం, ట్రీట్​మెంట్ తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మార్పు చెంది ఎక్కువ ఎనర్జిటిక్​గా బతకడానికి తోడ్పడుతుంది. సంతృప్తికర జీవితాన్ని తిరిగి పొందేలా చేస్తుంది. 

ఎఫెక్టివ్ ట్రీట్​మెంట్స్​.. నిద్రలో శ్వాసమార్గం తెరుచుకునేందుకు పరిష్కారమార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యను నయం చేయొచ్చు. అవి : 
కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ వే ప్రెజర్ (సిపిఎపి) : ఇది చాలా సాధారణ, ప్రభావవంతమైన ట్రీట్​మెంట్. ఒక మెషిన్ ఎయిర్ ప్రెజర్​ని మాస్క్ ద్వారా విడుదల చేస్తుంది. అది శ్వాస మార్గం తెరుచుకునేందుకు ఎయిర్ స్ప్లింట్​లా పనిచేస్తుంది. సిపిఎపి అనేది దానికి తగినట్టు అడ్జస్ట్​మెంట్లు చేసుకుంటూనే లక్షణాలను మెరుగుపరుస్తుంది. హెల్త్ రిస్క్​లను తగ్గిస్తుంది. 

ఓరల్ అప్లియెన్సెస్​: తక్కువ నుంచి మోడరేట్ ఒఎస్​ఎ కోసం దవడ లేదా నాలుకను కస్టమ్​ ఫిట్టెడ్ మౌత్ గార్డ్​ ద్వారా పొజిషన్​ని మారుస్తారు. దాన్ని అలానే మెయింటెయిన్ చేయడం ద్వారా శ్వాస మార్గం తెరుచుకుంటుంది. 

లైఫ్​ స్టయిల్ ఛేంజెస్: బరువు తగ్గడం, నిద్రకు ముందు సెడేటివ్స్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం, స్మోకింగ్​ మానేయడం, ఒక వైపు తిరిగి పడుకోవడం వంటి మార్పులు సాయపడతాయి. 

సర్జరీ: కొన్ని కేసుల్లో ఎక్కువగా ఉన్న కణజాలాన్ని తీసేయడం లేదా ​గడ్డాన్ని ముందుకు జరపడం వంటివి చేయొచ్చు. హైపోగ్లాసల్ నెర్వ్ స్టిమ్యులేటర్స్ వంటి కొత్త డివైజ్​లను శ్వాస ద్వారంలో ఇంప్లాంట్ చేయొచ్చు.

ఏం చేయాలంటే..

ఒకవేళ ఒఎస్​ఎ ఉన్నట్టు అనుమానం వస్తే అస్సలు వెయిట్ చేయొద్దు. డాక్టర్​ దగ్గరకు వెళ్తే లక్షణాల గురించి వివరంగా అడిగి తెలుసుకుంటారు. తర్వాత శ్వాస మార్గాన్ని పరీక్ష చేస్తారు. స్లీప్​ సెంటర్​లో రాత్రిపూట బస చేయడం ద్వారా స్లీప్ స్టడీ (పాలీసోమ్నోగ్రఫీ)తో బ్రెయిన్ యాక్టివిటీ, బ్రీతింగ్, హార్ట్ రేట్, ఆక్సిజన్ లెవల్స్​ని మానిటర్ చేస్తారు. ఇంట్లో పెట్టుకునే విధంగా హోం స్లీప్ ఆప్నియా టెస్ట్ (హెచ్​ఎస్​ఎటి) అనే ఒక చిన్న డివైజ్ ద్వారా కీలకమైన సంకేతాలను తెలుసుకోవచ్చు. 

నష్టాలు ఇవే..

 బ్లడ్ ప్రెజర్, షుగర్, పొత్తికడుపులో కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వచ్చే రిస్క్‌‌ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్​తో దృఢంగా లింక్ అయి ఉండడం వల్ల బ్లడ్ షుగర్​ కంట్రోల్​లో ఉంచుకోవడం కష్టమవుతుంది. దీంతో టైప్​ – 2 డయాబెటిస్ వస్తుంది. ఆల్కహాల్ తాగనివాళ్లలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్​ వచ్చేలా చేస్తుంది. సర్జరీ టైంలో ఎనస్తీషియా ఇవ్వడం వల్ల ఒఎస్‌ఎ రిస్క్ పెరుగుతుంది. పగటిపూట ఒకవేళ కారు డ్రైవ్ చేస్తుంటే నిద్ర ఆపుకోలేక యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది. అలాగే పనిచేసే చోట గాయాలు అవ్వొచ్చు.  డయాగ్నసిస్ చేయడం వల్ల మెరుగైన నిద్రకు దారులు వెతకొచ్చు. 

- డా. శ్రీకాంత్ వేముల
ఎం.డి(ఎయిమ్స్), డి.ఎం (పీజీఐ)
మాగ్నా న్యూరాలజీ క్లినిక్
హైదరాబాద్​