జిల్లాల్లో పరిశ్రమలేవి? : కూరపాటి వెంకట్ నారాయణ

జిల్లాల్లో పరిశ్రమలేవి? : కూరపాటి వెంకట్ నారాయణ

ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాల అభివృద్ధి తీరుతెన్నులే ఆ సమాజాభివృద్ధి గతిని తెలియజేస్తాయి. భారత ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం16%, పరిశ్రమలు 29%, సేవా రంగాలు 55% ఆదాయాన్ని సమకూర్చుతున్నాయి. మన తెలంగాణలో వ్యవసాయం 22%, పరిశ్రమలు 17%, సేవా రంగం 61 శాతం ఆదాయం కల్పిస్తున్నాయి. పరిశ్రమల రంగంలో మన రాష్ట్రం దేశంలోని అనేక రాష్ట్రాల కంటే చాలా వెనకబడి ఉన్నది. ఖనిజాలకు, వ్యవసాయ ఉత్పత్తులకు కొరత లేని తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధికి మన రాజకీయ నాయకులు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. తెలంగాణలో కేవలం రియల్ ఎస్టేట్ దళారి వ్యాపారం, ఐటీ రంగం, మద్యం, విద్య, వైద్యం వ్యాపారాలే నడుస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేండ్లు గడిచినా తయారీ రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే గాక ప్రకటించిన ప్రోత్సాహకాలు, హామీలు అమలుకు నోచుకోవడం లేదు.

నీళ్లు, నిధులు, నియామకాలు తదితర అంశాలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిశ్రమలకు ఆదరణ లేదని ఉద్యమం చేశాం. ప్రాగా టూల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, అంతర్గాం కమలాపూర్ రియాన్ ఫ్యాక్టరీ, హెచ్ఎంటీ, సర్ సిల్క్ తదితర పరిశ్రమలు మూసివేతకు గురి అవుతుండటాన్ని ప్రశ్నించినం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తో పాటు అనేక తెలంగాణ పరిశ్రమలను తిరిగి తెరిపిస్తామని మలిదశ ఉద్యమంలో ప్రజలకు అనేక సందర్భాల్లో పాలకులు హామీ ఇచ్చారు. కాగా మూతబడ్డ ఏ పరిశ్రమ తెరవకపోగా, కొత్త పరిశ్రమలు ప్రారంభించడం లేదు.

హైదరాబాద్ చుట్టూనే

తెలంగాణలో బొగ్గు, ఇనుము, యురేనియం, గ్రానైట్, రాగి, క్రోమైటు, బైరైటీస్ తదితర ఖనిజాలు లభిస్తాయి. మనది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాబట్టి వరి, పత్తి, మిర్చి, పసుపు, మక్క, పండ్ల తోటలు, చిరుధాన్యాలు మొదలగు వ్యవసాయ ఉత్పత్తులు విరివిగా పండుతాయి. వీటికి సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం మెండుగా ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశలో ఎలాంటి పురోగతి సాధించలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి 2018 ఎన్నికల ముందు అనేక సభల్లో వాగ్దానం చేశారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన అనేక హామీల లాగానే ఈ హామీ కూడా అమలుకు నోచుకోలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంలు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాలు పరిశ్రమల అభివృద్ధి అంటే ఫార్మా, ఐటీ సర్వీసెస్ సంస్థలను ప్రోత్సహించడంతో సరిపోతుందని అనుకున్నారు. ఐటీ, ఫార్మా పరిశ్రమలను హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోనే విస్తరించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఐటీ, ఫార్మా ఇండస్ట్రీలు పరస్పర ప్రయోజనాల కోసం ఎదుగుతూ వస్తున్నవని విమర్శ జోరుగా ఉండేది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో కోల్ బెల్ట్ తప్ప తెలంగాణ ప్రాంత ఇతర జిల్లాల పారిశ్రామిక అభివృద్ధిని పాలకులు నిర్లక్ష్యం చేశారు. అభివృద్ధి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకే పరిమితమైంది. ఇక్కడ ఎదిగిన ఫార్మా, ఐటీ పరిశ్రమలతో తెలంగాణ పారిశ్రామికవేత్తలకు, నిరుద్యోగ యువతకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఐటీ ఫార్మా ఇండస్ట్రీలతో పాటు ఇతర జిల్లాల్లో తయారీ పరిశ్రమలను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అభివృద్ధి చేస్తే ఉద్యోగిత అధికంగా పెరగడమే కాక వివిధ ప్రాంతాల్లో ప్రజల ఆదాయం కూడా పెరగడానికి ఉపకరించేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అభివృద్ధి విధానంలో అదే తంతు. పాత విధానం కొనసాగిస్తూ అవే ప్రాంతాల్లో(మేడ్చల్ మల్కాజ్​గిరి, సంగారెడ్డి) ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒకదానితో ఒకటి పెనవేసుకొని కొనసాగుతున్నవి. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ప్రాంతేతరుల, భూకామందుల, పాలకుల బంధుమిత్రుల వశమయ్యాయి. 

టెక్స్​టైల్​ పార్కుల పరిస్థితి..

వరంగల్​జిల్లా సంగెం మండలం సమీపంలో 2016–17లో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2000 ఎకరాల భూమిని రైతుల నుంచి సమీకరించి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో అభివృద్ధి చేసింది. లబ్ధిదారులకు కేటాయించే ధర ప్రతి చదరపు గజానికి రూ.1600గా నిర్ణయించింది. ఈ ధర వద్ద వలస కార్మికులు గానీ, స్థానిక చిన్నాచితక వ్యాపారస్తులు పెట్టుబడులు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ టెక్స్​టైల్ పార్క్ ప్రాజెక్టు వేలాది మంది కార్మికులకు ఉద్యోగాలు కల్పిస్తుందని, ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని మంత్రులు, ప్రజాప్రతినిధులు విస్తృతంగా పతాక శీర్షికలతో ప్రచారం చేసుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికులకు, వలస కార్మికులకు ఇంతవరకు ఒరిగిందేమీ లేదు. రాజకీయ నాయకులు మాత్రం రియల్ ఎస్టేట్ వ్యాపారం విరివిగా చేసుకొని కోట్లాది రూపాయలు జేబులో వేసుకున్నారు. జనగామ జిల్లా లింగాలగణపురం కల్లెంలో 120 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని టెక్స్​టైల్ పార్కు కోసం గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.15 కోట్ల ఆర్థిక సాయంతో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. ఇక్కడా ప్రతి చదరపు గజానికి రూ.1600 రూపాయలు నిర్ణయించడంతో ఆర్థిక భారాన్ని భరించలేక ఎవరూ ముందుకు రావడం లేదు. పారిశ్రామికాభివృద్ధి కంటే భూమిని అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ ధరలకు లబ్ధిదారులకు అమ్మ చూపుతున్నది మన ప్రభుత్వం. మహబూబాబాద్ జిల్లాలో వలస కార్మికులు, ఇతరులు ఐదేండ్ల నుంచి టెక్స్​టైల్ పార్కులకు ప్రభుత్వ భూమిని కేటాయించాలని కోరుతున్నా ఫలితం శూన్యం. పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్లలో 70 ఎకరాలతో మినీ టెక్స్​టైల్ పార్కు ప్రారంభిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు నాలుగేండ్ల క్రితం ప్రకటించినప్పటికీ ఇప్పటికీ భూకేటాయింపు జరగలేదు. మడికొండ వద్ద 2010 నుంచి లబ్ధిదారులు తమ సొంత డబ్బులతో భూ సేకరణ చేసి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో సూరత్ టెక్స్​టైల్ కార్మికులు ఏర్పాటు చేసుకున్న మినీ పార్కు యూనిట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదని కార్మికులు, యజమానులు ఆవేదన పడుతున్నారు. పెట్టుబడి సబ్సిడీ(25%), వడ్డీ రియింబర్స్​మెంట్(8.5%), ఇంతవరకు ఒక పైసా కూడా ఇవ్వలేదు. విద్యుత్​చార్జీలో 50 శాతం రిబేటు ఇస్తానని ప్రకటించి ఇవ్వలేదు. స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గంలో 25 ఏండ్ల క్రితం నుంచి లెదర్ పార్క్ అభివృద్ధి చేస్తామని ఆనాటి మంత్రి కడియం శ్రీహరి చంద్రబాబుతో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ఆ శిలాఫలకమే అడ్రస్ లేకుండా పోయింది. రాష్ట్రం ఏర్పడితే అన్ని ప్రాంతాలు, జిల్లాలు సమంగా అభివృద్ధికి నోచుకుంటా యని ఆశించిన తెలంగాణ పేద వర్గాలకు నిరాశే మిగిలింది. ఇప్పటికైనా వివిధ జిల్లాలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వనరులతో పారిశ్రామిక రంగం అభివృద్ధికి కావాల్సిన మౌలిక వసతులను మెరుగుపరచాలి. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు రచించడానికి ప్రణాళిక మండలిని వివిధ రంగాల్లో నిష్ణాతులైన మేధావులతో పునర్వ్యవస్థీకరించి అభివృద్ధి ప్రణాళికలు రూపకల్పన చేయాలి. 

యువతకు ప్రోత్సాహం లేక..

రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడినప్పటికీ అనేక జిల్లాల్లో ఇప్పటికీ పరిశ్రమల అభివృద్ధి కోసం ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఔత్సాహికులైన యువ పారిశ్రామికవేత్తలను గుర్తించడం లేదు. పరిశ్రమల ప్రోత్సాహం కోసం బడ్జెట్​లో కేటాయింపులు చేసినా నిధులు విడుదల చేయడం లేదు, ఖర్చు పెట్టడం లేదు. కొత్త పరిశ్రమలకు ఇవ్వాల్సిన పెట్టుబడి సబ్సిడీలు, వడ్డీ రాయితీలు, కరెంట్ చార్జీల రాయితీలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు వివిధ కార్పొరేషన్లు, ఫెడరేషన్ ల ద్వారా సబ్సిడీ రుణాలను ఇచ్చి చిన్న తరహా లఘు, కుటీర, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇచ్చే చర్యలూ చేపట్టడం లేదు. దాదాపు పది లక్షల మంది విద్యావంతులైన, సాంకేతిక పరిజ్ఞానం గల యువతీ యువకులు వేల రూపాయలు ఖర్చుపెట్టుకుని దరఖాస్తులు చేసుకొని 9 ఏండ్ల నుంచి నిరీక్షిస్తున్నారు. వార్షిక బడ్జెట్​లో ప్రభుత్వం చూపించిన కేటాయింపులు నీటి మూటలు అయ్యాయి. 

వ్యవసాయ ఆధారిత పరిశ్రమలేవి?

తెలంగాణ రాష్ట్రం పత్తి పంటకు ప్రధాన కేంద్రం. జిన్నింగ్ మిల్స్, స్పిన్నింగ్ మిల్స్, టెక్స్​టైల్ పార్కులను  ప్రోత్సహించడానికి ఎంతో అవకాశం ఉన్నా , ఆశించిన స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం పనిచేయడం లేదు. నాలుగైదు దశాబ్దాల నుంచి తెలంగాణకు చెందిన లక్షలాదిమంది  కార్మికులు సూరత్, అహ్మదాబాద్, భీవండి, సోలాపూర్, పూణె ప్రాంతాలకు  వలస వెళ్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ జిల్లాలకు తిరిగి వచ్చి మినీ టెక్స్​టైల్ పార్కులను ఏర్పాటు చేసుకోవాలని ఆశించినా, వారి కల నెరవేరలేదు. 2015 సంవత్సరంలో అప్పటి వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్, చల్ల ధర్మారెడ్డి పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ లతో కూడిన ఉన్నత స్థాయి రాష్ట్ర బృందం సూరత్, సోలాపూర్, తమిళనాడులోని ఈరోడ్ పట్టణాలను సందర్శించి అన్ని రకాల హంగులతో టెక్స్​టైల్ పార్కులను ఏర్పాటు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని అక్కడి వలస కార్మికులను ఆహ్వానించారు. నివాస యోగ్యమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో సహా టెక్స్​టైల్ పార్కులకు కావాల్సిన అన్ని ప్రోత్సాహకాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార బృందం ఇచ్చిన హామీలను నమ్ముకొని చాలామంది కార్మికులు వరంగల్, మహబూబాబాద్, జనగాం జిల్లాలో మినీ టెక్స్​టైల్ పార్కులు పెట్టడానికి గత అయిదారు సంవత్సరాల నుంచి స్థలాలు కేటాయిం చాలని నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే వేల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, వారి మొర విని ఆదుకునే దిక్కే లేదు.

- కూరపాటి వెంకట్ నారాయణ

రిటైర్డ్ ప్రొఫెసర్