టాప్‌ టెక్‌ కంపెనీలకు ఇండియన్సే సీఈవోలు

టాప్‌ టెక్‌ కంపెనీలకు ఇండియన్సే సీఈవోలు

మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబీఎం.. ఇలా ప్రపంచంలోనే దిగ్గజ టెక్ కంపెనీలన్నింటికీ సీఈవోలుగా ఇండియన్సే ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌ కంపెనీకి సత్య నాదెళ్ల సారథ్యం వహిస్తున్నారు. గూగుల్‌ను సుందర్ పిఛాయ్‌ ముందుకు నడిపిస్తున్నారు. ఐబీఎం అరవింద్ కృష్ణ ఆధ్వర్యంలో సాగుతోంది. ఇక అడోబ్‌ సీఈవోగా శంతను నారాయణ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌కు నికేష్‌ ఆరోరా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌‌గా సేవలందిస్తున్నారు. ఇలా అమెరికా కంపెనీల్లో ప్రవాస భారతీయుల ప్రాబల్యం చాలా ఎక్కువగా ఉంది. అమెరికా అభివృద్ధి, అక్కడ కంపెనీల ప్రగతిలో మనోళ్లదే కీలక పాత్ర. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ  మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌‌కు కొత్త సీఈవోగా 37 ఏళ్ల ఇండియన్ టెకీ పరాగ్ అగర్వాల్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పరాగ్‌కు కంగ్రాట్స్‌ చెబుతూ ఐర్లాండ్‌కు చెందిన ఆన్‌లైన్ పేమెంట్స్‌ కంపెనీ ‘స్ట్రైప్’ సీఈవో పాట్రిక్ కొలిసన్ ట్వీట్ చేశారు.

అంతా ఇండియాలో పుట్టి పెరిగినోళ్లే..

‘‘ఇప్పటి వరకూ గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌.. ఇప్పుడు ట్విట్టర్‌‌కు కూడా సీఈవోగా ఇండియాలో పుట్టి పెరిగిన వ్యక్తే నియమితులయ్యారు. ఇలా టెక్నాలజీ రంగంలో ఇండియన్స్ అద్భుతంగా సక్సెస్‌ కావడం చూస్తే చాలా సంతోషంగా ఉంది.  అమెరికాకు వలస వస్తున్న వారికి ఆ దేశంలో అవకాశాల విషయంలో పెద్ద పీట వేస్తున్నారన్న దానికి ఇదే నిదర్శనం’’ అని పాట్రిక్ ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశారు. కొత్తగా ట్విట్టర్‌‌కు సీఈవోగా నియమితులైన పరాగ్‌ అగర్వాల్‌కు కంగ్రాట్స్ చెప్పారాయన. దీనిపై టెస్లా కంపెనీ అధినేత ఎలన్‌ మస్క్‌ స్పందించారు. ఇండియన్‌ టాలెంట్ వల్ల అమెరికా చాలా మేలు పొందుతోందంటూ ప్రవాస భారత టెకీలను ప్రశంసిస్తూ ఆయన ట్వీట్ చేశారు.