అమెరికా ఫైనల్ రిజల్ట్ ఎటూ తేలకుంటే ఏమైతది?

అమెరికా ఫైనల్ రిజల్ట్ ఎటూ తేలకుంటే ఏమైతది?

అమెరికా ప్రెసిడెంట్ ఫైట్ లో ఫైనల్ ఆప్షన్స్

అమెరికా ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్ల కౌంటింగ్​ మొదలైంది. ఇటు ప్రస్తుత ప్రెసిడెంట్, రిపబ్లికన్​ పార్టీ క్యాండిడేట్​ డొనాల్డ్​ట్రంప్.. అటు డెమొక్రటిక్​ పార్టీ అభ్యర్థి జో బిడెన్​ నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. ఒక రాష్ట్రంలో ట్రంప్ లీడ్​లో ఉంటే మరో రాష్ట్రంలో బిడెన్​ జోరు కనిపిస్తోంది. ట్రంప్ గెలుస్తారా? బిడెన్​ గెలుస్తారా? అంటే స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ ఫలితాలు వస్తున్నప్పుడే కౌంటింగ్​ ఆపేయాలని, రిజల్ట్​పై సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్​ ప్రకటించడం మరింత అగ్గి రాజేసింది. వాస్తవానికి తనకు అనుకూలంగా వ్యవహరించే సుప్రీంకోర్టు చీఫ్ ని ట్రంప్ నియమించినపుడే ఫేవరబుల్ రిజల్ట్స్ పై ఆయనకు నమ్మకం లేదని అర్థమైంది. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతున్నది. మరోవైపు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి రిజల్ట్ పై డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఫలితాన్ని వివాదం చేసేందుకు ట్రంప్​ ప్రయత్నిస్తున్నారంటూ తమ వాయిస్​ వినిపిస్తూనే ఉన్నారు. సుప్రీంకు వెళితే తమ లీగల్​ టీమ్​ రెడీగా ఉందని బిడెన్​ ప్రకటించారు. మొత్తానికి అమెరికా ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్​ రిజల్ట్​ తర్వాత లీగల్​గా, పొలిటికల్​గా ఎన్ని డ్రామాలు చెలరేగుతాయనేది ఆసక్తికరంగా మారింది. కోర్టులు, స్టేట్​ పొలిటీషియన్లు, కాంగ్రెస్​తో ఇవన్నీ ముడిపడి ఉన్నాయి. రిజల్ట్స్​ తర్వాత పరిణామాలు ఎలా ఉండే చాన్స్​ ఉందో ఓసారి చూద్దాం.

అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితంపై మరోసారి కోర్టు పంచాయతీ తప్పేలా లేదు. మొయిల్​ ఇన్(ముందస్తు) ఓటింగ్​పై ట్రంప్ సుప్రీం కోర్టు వెళ్తానని ప్రకటించేశాడు. మెయిల్​ ఇన్​ ఓటింగ్​లో రిపబ్లికన్ల కన్నా డెమొక్రాట్లు చాలా ఎక్కువగా ఓట్లు వేసినట్టు ఓటింగ్​ డేటాను బట్టి తెలుస్తోంది. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్​ లాంటి రాష్ట్రాల్లో ఎలక్షన్​ డే వరకూ మెయిల్​ఇన్​ ఓట్లను లెక్కించలేదు. మెయిల్​ఇన్​ ఓట్లను నెమ్మదిగా లెక్కించడంతో మొదట్లో ఆ రాష్ట్రాలు ట్రంప్​కు అనుకూలంగా ఉన్నట్టు కనిపించింది. అందుకే ఓటింగ్​ను ఆపేయాలని ట్రంప్​ డిమాండ్​ చేస్తున్నారు. ఈ బ్యాలెట్లను పూర్తిగా ట్యాలీ చేయకుండానే ట్రంప్​ విజయం సాధించినట్టుగా ప్రకటించడంపై డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టఫ్​ ఫైట్​ ఉన్న కీలక రాష్ట్రాల్లో ఓటింగ్, బ్యాలెట్​ కౌంటింగ్​ ప్రక్రియపై లిటిగేషన్లకు అవకాశం ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన కేసులు సుప్రీంకోర్టు వరకూ వెళ్లొచ్చు. 2000 సంవత్సరంలో ఫ్లోరిడా ఎలక్షన్​ సమయంలో ఇదే జరిగింది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్​ అభ్యర్థి జార్జ్​ డబ్ల్యూ బుష్.. డెమొక్రటిక్​ క్యాండిడేట్​ అల్​ గోర్​పై ఫ్లోరిడాలో 537 ఓట్ల తేడాతో గెలిచారు. కానీ హైకోర్టు ఆదేశాలతో రీకౌంటింగ్​ను నిలిపేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సుప్రీంకోర్టు జడ్జిగా అమీ కానే బారెట్​ను ట్రంప్​ నియమించారు. దీంతో కోర్టులో ట్రంప్​కు 6–3 మెజారిటీ వచ్చింది. ఒకవేళ ఎన్నికలపై వివాదం చెలరేగి సుప్రీం వరకూ వెళితే అక్కడ ట్రంప్​కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలున్నాయి. అయితే అమెరికా ఎన్నికల చట్టాల ప్రకారం రాష్ట్రాల్లో మొత్తం ఓట్లను లెక్కించాల్సిందే. కొన్ని  రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చు.

డ్యూయల్​ ఓట్లు

1876లో, మూడు రాష్ట్రాలు డ్యూయలింగ్​ ఓటర్లను అపాయింట్​ చేశాయి. దీంతో 1887లో కాంగ్రెస్​ ఎలక్టోరల్​ కౌంట్​ యాక్ట్​ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కాంగ్రెస్​ రెండు సభలకు డ్యూయలింగ్​ ఓటర్లలో దేనికి ఆమోదం తెలపాలనే దానిపై స్వేచ్ఛ ఉంటుంది. ప్రస్తుతం సెనేట్​లో రిపబ్లికన్లకు, హౌస్​ ఆఫ్​ రిప్రజెంటేటివ్స్​లో డెమొక్రాట్లకు మెజారిటీ ఉంది. అయితే ఎలక్టోరల్​ కౌంట్​ను జనవరి 3న ఏర్పడే కొత్త కాంగ్రెస్​ చేపడుతుంది. ఒకవేళ అప్పటికీ రెండు సభల్లోనూ క్లారిటీ రాకపోతే ట్రంప్​ వైస్​ ప్రెసిడెంట్​ మైక్​ పెన్స్.. ఈ దశలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రెండు సభలు ఏకాభిప్రాయానికి రాకపోతే ఒక స్టేట్​లో వివాదాస్పదమైన ఎలక్టోరల్​ ఓటును సెనేట్​ ప్రెసిడెంట్​గా ఆయన పూర్తిగా తిరస్కరించే అవకాశం ఉంటుంది. అదే జరిగితే మెజారిటీ మార్క్​ 270 ఓట్లే ఉంటుందా.. లేక తగ్గుతుందా అనే దానిపై ఎలక్టోరల్​ కాలేజ్​ యాక్ట్​లో క్లారిటీ ఇవ్వలేదు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురుకాకపోవడంతో ఇబ్బందులు రాలేదని నిపుణులు చెబుతున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించాలని పార్టీలు సుప్రీంకోర్టును కోరవచ్చు. కానీ, ఎలక్టోరల్​ ఓట్లను కాంగ్రెస్ ఎలా లెక్కించాలో తీర్పు ఇవ్వడానికి కోర్టు సిద్ధంగా ఉండే అవకాశం లేదు.

ఎలక్టోరల్​ కాలేజ్

పాపులర్​ ఓట్​లో మెజారిటీ వచ్చిన వారే అమెరికా ప్రెసిడెంట్​గా ఎన్నిక కాలేరు. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. 538 మంది ఎలక్టర్స్​ లో మెజారిటీ ఓట్లను ఎవరు సాధిస్తే వారే అధ్యక్షుడు అవుతారు. దీనినే ఎలక్టోరల్​ కాలేజీ అంటారు. 2016లో నేషనల్​ పాపులర్​ఓటింగ్​లో డెమొక్రాట్​ హిల్లరీ క్లింటన్​ చేతిలో ట్రంప్​ ఓడిపోయారు. కానీ ఎలక్టోరల్​ కాలేజ్​ ఓటింగ్​లో ట్రంప్​ 304 ఓట్లు సాధించారు. హిల్లరీకి 227 ఓట్లే దక్కడంతో ట్రంప్​ విజయం సాధించారు. ప్రతి రాష్ట్రంలో పాపులర్​ ఓటు గెలిచిన వారే సాధారణంగా స్టేట్​  ఎలక్టర్లను సంపాదించుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్​14న ఎలక్టర్ల మీటింగ్​ ఉంటుంది. ఆ రోజు వారంతా తమ ఓటు వేస్తారు. జనవరి 6న కాంగ్రెస్​ ఉభయ సభలు భేటీ అవుతాయి. ఆ రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి.. విజేతను ప్రకటిస్తారు. సాధారణంగా గవర్నర్లు తమ రాష్ట్రాల ఫలితాలను సర్టిఫై చేసి ఆ సమాచారాన్ని కాంగ్రెస్​కు అందజేస్తారు. అయితే తీవ్ర పోటీ ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్, లెజిస్లేచర్​ రెండు వేర్వేరు ఎన్నికల ఫలితాలను సమర్పిస్తారని నిపుణులు చెబుతున్నారు. కీలకమైన పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్, నార్త్​ కరోలినాలో డెమొక్రటిక్​ గవర్నర్లు, రిపబ్లికన్​ పార్టీ లెజిస్లేచర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నర్​ సమాచారాన్ని స్వీకరిస్తుందా? లేక ఆ రాష్ట్ర ఎలక్టోరల్​ ఓట్లను కౌంట్​లోకి తీసుకోదా? అనే విషయంపై క్లారిటీ లేదని లీగల్​ ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. అయితే ఎక్కువ మంది ఎక్స్​పర్ట్స్​ ఈ విధానాన్ని ఉపయోగించకపోవచ్చని చెబుతున్నా… గతంలో జరిగిన ఘటనలు ఉన్నాయి. రిపబ్లికన్ల ఆధిపత్యం ఉన్న ఫ్లోరిడాలో లెజిస్లేచర్​  తమ సొంత ఎలక్టర్లను సుప్రీంకోర్టుకు సమర్పించడంతో 2000 సంవత్సరంలో బుష్​కు అనుకూలంగా తీర్పు వచ్చింది.

కాంటింజెంట్ ఎల‌క్షన్..

ఒక‌వేళ ప్రెసిడెన్షియల్​ ఎలక్షన్​లో ఏ పార్టీ అభ్యర్థికీ ఎల‌క్టోర‌ల్ ఓట్లలో మెజారిటీ రాకపోతే.. అప్పుడు అమెరికా రాజ్యాంగంలోని 12వ స‌వ‌ర‌ణ ప్రకారం కాంటింజెంట్ ఎలక్షన్​ పెడతారు. అప్పుడు హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్​ సభ్యులు కొత్త ప్రెసిడెంట్​ను, సెనేట్​ సభ్యులు వైస్​ ప్రెసిడెంట్​ను ఎన్నుకుంటారు. సభలోని ప్రతి స్టేట్​ డెలిగేషన్స్​కు ఒక ఓటు ఉంటుంది. ప్రస్తుతం 50 స్టేట్​ డెలిగేషన్స్​లో రిపబ్లికన్లకు 26 మంది మద్దతు ఉంది. డెమొక్రాట్లను 22 మంది సపోర్ట్ చేస్తున్నారు. ఒక‌వేళ ఇద్దరు అభ్యర్థులకు 269–269 వచ్చి టై అయినప్పుడు కూడా కాంటింజెంట్ ఎల‌క్షన్​ ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ప్రతిష్టంభన ఏర్పడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్​లో ఏ వివాదం ఉన్నా అది జనవరి 20వ తేదీ నాటికి పరిష్కరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత ప్రెసిడెంట్​ టర్మ్​ ఆ రోజుతో పూర్తవుతుంది. ఒకవేళ అప్పటికీ కాంగ్రెస్.. ప్రెసిడెంట్, వైస్​ ప్రెసిడెంట్ లను ఖరారు చేయనట్లయితే హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ (ప్రతినిధుల సభ) స్పీకర్​ ​ యాక్టింగ్​ ప్రెసిడెంట్​ అవుతారు. ప్రస్తుతం డెమొక్రాట్​ నాన్సీ పెలోసి స్పీకర్​గా ఉన్నారు.

For More News..

కరోనాపై పత్రికల పోరాటం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పత్రికా రంగం

రజనీకాంత్ బీజేపీకి అక్కరకు వస్తారా!

చట్ట సవరణ ఓకే చేయకముందే రిజిస్ట్రేషన్లు ఎట్ల చేస్తరు?