
కడప : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల ప్రచారం ముగించుకుని… గురువారం రాత్రి 11.30 గంటలకు ఆయన ఒక్కరే ఇంటికిరావడం… బెడ్ రూమ్ మెయిన్ డోర్ లాక్ చేసి ఉండటం…. గదికి మరోవైపు ఉన్న చిన్న డోర్ ఓపెన్ చేసి ఉండటం పలు అనుమానాలు రేపుతున్నాయి. వైఎస్ వివేకా ఇంట్లో ఆయన ఉపయోగించే బెడ్ రూమ్ డోర్ తెరిచిలేదు. పార్క్ వైపు ఉన్న గది డోర్ తెరిచి ఉండటంతో… పీఏ కృష్ణారెడ్డి, పనిమనిషి లచ్చమ్మ కొడుకు అందులోచి లోపలికి వెళ్లారు. అటువైపు ఉన్న బెడ్ రూమ్ డోర్ కూడా ఓపెన్ ఉందని గమనించారు.
సాక్షుల వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి వివేకా ఎన్ని గంటలకు పడుకున్నారు… ఇంట్లోకి దుండగులు పార్క్ వైపు ఉన్న డోర్ నుంచి వచ్చారా.. ఆ టైమ్ లో వాచ్ మెన్ ఉన్నాడా లేదా.. లాంటి అంశాలపై దృష్టిపెట్టారు. వాచ్ మెన్ ముసలి వ్యక్తి అనీ.. అతడు ఇంటిముందే ఉంటాడని సన్నిహితులు చెప్పారు.
ఇలా… గురువారం రాత్రి 11.30 గంటలకు వైఎస్ వివేకానందరెడ్డి తన ఇంటికి వచ్చారని.. ఉదయం 5.30 గంటలకు పీఏ కృష్ణారెడ్డి ఆయన ఇంటికి వెళ్లారని చెప్పారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. అప్పుడే వివేకా మర్డర్ సంగతి బయటకి తెలిసిందన్నారు. రాత్రి 11.30 నుంచి ఉదయం 5.30 మధ్య ఏం జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితులను చట్టప్రకారం శిక్షిస్తామనీ.. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఆందోళన చెందొద్దని చెప్పారు ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ.