
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రంతో లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్థిక బలం బయట పడుతుందని, రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చే రుణాలు తగ్గిపోతాయనే అపోహలు అవసరం లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బహిరంగ పర్చడంలో తప్పులేదని, బడ్జెట్‌లోనైనా ఈ లెక్కలు చూపించాల్సిందేనని పేర్కొన్నారు.
‘‘అప్పులు చేయడం తప్పు కాదు. అసలు అప్పులు ఎంత పరిమాణంతో చేశారు. హ్యూమన్ ఇండెక్స్, ఆకలి సూచికల్లో ఎక్కడ ఉన్నాం అనేది ముఖ్యం. ప్రాజెక్టుల కోసం చాలా ఖర్చు పెట్టాం అని గత ప్రభుత్వం చెబుతున్నది. కానీ పేదలకు, తిండిలేని వారికి, పౌష్టికాహారం దొరకనొళ్లకు, చాలీచాలని జీతాలతో బతికే వారికి ప్రయోజనం జరిగిందా.. లేదా.. అనేది ముఖ్యం”అని అన్నారు. పైకి అభివృద్ధి కనిపించినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్నారు.
అన్ని సంస్థలను అప్పుల్లోకి నెట్టారు..
రాష్ట్రంలో సొంత ఇళ్లు లేని వారు, చేసిన పనికి తగిన కూలీ అందుకోలేకపోతున్న వారు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీసి, వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కూనంనేని కోరారు. ప్రాజెక్టులు కట్టినా డబ్బులు ఒక్కచోటికే వెళితే ఎలా అని ప్రశ్నించారు. ఒకప్పుడు సంపన్న సంస్థగా ఉన్న సింగరేణిని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దివాలా తీయించిందని మండిపడ్డారు. ఆర్టీసీ, డిస్కంలు, సివిల్ సప్లయ్స్.. ఇలా అన్ని సంస్థలను అప్పుల్లోకి నెట్టారని విమర్శించారు. పేద జర్నలిస్టులను కూడా పట్టించుకోలేదన్నారు.