ఈ నెల 30 తర్వాత ఏం చేయబోతున్నారు?

ఈ నెల 30 తర్వాత ఏం చేయబోతున్నారు?
  • నైట్ కర్ఫ్యూ పొడిగింపా.. డే టైమ్​లోనూ కర్ఫ్యూనా ?
  • పొరుగు రాష్ట్రాల తరహాలో లాక్ డౌన్ పెట్టడమా?
  • రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు  
  • సర్కారు తర్జనభర్జన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కట్టడి కోసం ఈనెల 30 తర్వాత ఎలాంటి ఆంక్షలు పెడితే బాగుంటుందని ప్రభుత్వం ఆరా తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న నైట్ కర్ఫ్యూ వల్ల వైరస్ కట్టడి ఏ మేరకు జరిగిందని లెక్కలు తీసింది. అంచనా వేసిన దాని కంటే ఎక్కువగా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతుండటంతో మరికొంత కాలం అంక్షలు విధించడమే బెటర్ అని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇందులో భాగంగా నైట్ కర్ఫ్యూను కొనసాగించటం.. లేదా కర్ఫ్యూ టైమ్​ను  పెంచడం, వీక్ ఎండ్ లో లాక్ డౌన్ విధించటం, పొరుగు రాష్ట్రం కర్నాటక తరహాలో పూర్తి స్థాయి లాక్ డౌన్ పెట్టడం.. అనే నాలుగు ఆప్షన్లపై చర్చిస్తున్నాయి.  ఈనెల 20 నుంచి అమల్లోకి వచ్చిన నైట్ కర్ఫ్యూ.. మరో మూడు రోజుల్లో ముగియనుంది. దీంతో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలి? ఎలాంటి ఆంక్షలు విధించాలనే అంశాలపై సీనియర్ ఐఏఎస్ లు తర్జనభర్జన పడుతున్నారు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ వల్ల వైరస్ కట్టడి కాలేదు. కేసులు, డెత్​ల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఈ నెల 30 తర్వాత ఆంక్షలను మరింత కఠినం చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. ఇందులో కర్ఫ్యూను రోజంతా అమలు చేయడం.. పూర్తిగా లాక్‌‌డౌన్ విధించే అంశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రోజంతా కర్ఫ్యూ అమలు చేస్తే.. ఉదయం రెండు మూడు గంటలు ప్రజలు నిత్యావసర వస్తువులు కొనేందుకు వెసులుబాటు ఇచ్చి మిగతా టైమ్ లో కర్ఫ్యూ అమలు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. లాక్ డౌన్ అమలు చేస్తే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. అందుకే ప్రభుత్వం వెనుకా ముందు ఆడుతోందని చెబుతున్నారు. ఇప్పటికే థియేటర్లు మూత పడ్డాయి. కానీ సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, బార్లు, పబ్​లు, జనం ఎక్కువ రద్దీగా ఉండే వ్యాపార వాణిజ్య కేంద్రాలతో ముప్పు వాటిల్లుతోందని వైద్యారోగ్య శాఖ హెచ్చరిస్తూనే ఉంది. దీనికితోడు మెట్రోతోపాటు ప్రజా రవాణా యథావిధిగా కొనసాగుతోంది. ఇవన్నీ కరోనాకు హాట్ స్పాట్లుగానే ఉన్నాయని.. అందుకే నైట్ కర్ప్యూతో పాటు మరిన్ని ఆంక్షలు విధించాలని, సిటీలో జనం ఎక్కువగా బయటకు వచ్చే శని, ఆదివారాల్లో లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
త్వరలో సీఎం రివ్యూ
వైరస్ కట్టడి కోసం ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై సీఎం కేసీఆర్ త్వరలో రివ్యూ చేయనున్నారు. కరోనా సోకడంతో కేసీఆర్ ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నారు. ఈ టైమ్ ఈ నెల 28న ముగుస్తుంది. ఆ తర్వాత కరోనాపై ఆఫీసర్లతో సీఎం సమావేశం నిర్వహించే చాన్స్ ఉంది. ఫ్రీ వ్యాక్సిన్​తో పాటు.. సెకండ్ వేవ్ తీవ్రతపైనే ఇందులో చర్చించే అవకాశాలున్నాయి. అయితే కేంద్రం తీసుకునే నిర్ణయం మేరకు ఆంక్షలుంటాయని.. రాష్ట్రంలో ప్రత్యేకంగా కఠిన ఆంక్షలు విధించే ఆలోచన లేదని ఐఏఎస్ ఆఫీసర్లలో చర్చ జరుగుతోంది.
పొరుగు రాష్ట్రాల విధానాలపై ఆరా
వైరస్ నియంత్రణ కోసం పొరుగు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయనే దానిపై ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. కర్నాటక ప్రభుత్వం మంగళవారం నుంచి 14 రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 6 నుంచి 10 వరకు నిత్యావసరాల విక్రయాలకు అనుమతి ఇచ్చింది. ఇక మహారాష్ట్రలో ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించారు. ఉదయం పూర్తిగా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఈ 2 రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఆంక్షలపై స్టడీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ నేడో రేపో తమ రిపోర్టును సీఎం కేసీఆర్​కు అందించనుంది.'