రైతు భరోసా 5 ఎకరాలకే పరిమితం చేస్తే ఏమవుతుంది?

రైతు భరోసా 5 ఎకరాలకే పరిమితం చేస్తే  ఏమవుతుంది?

గత వానాకాలం సీజన్‌‌లో 68.99 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల భూమికి ప్రభుత్వం రైతుబంధు ఇచ్చింది. వీరిలో ఎకరం లోపు భూమి ఉన్న రైతులు 22.55 లక్షల మంది ఉండగా, ఐదెకరాలోపు భూమి ఉన్న రైతులు 62.34 లక్షల మంది ఉన్నారు. వీరి చేతిలో కోటి ఎకరాల భూమి ఉన్నది. ఇప్పటి వరకు రైతుబంధు అందుకుంటున్న రైతుల్లో గుంట నుంచి ఐదెకరాలోపున్న రైతులే 90.36 శాతం ఉన్నారు. కాగా ఐదెకరాలకు పైగా భూములున్న రైతులు కేవలం 6.65 లక్షలే ఉన్నారు. కానీ వీరి చేతిలో ఏకంగా 52 లక్షల ఎకరాల భూమి ఉన్నది. పంట పెట్టుబడి సాయాన్ని సర్కారు ఐదెకరాలకే పరిమితం చేస్తే భారీగా వృథా తగ్గే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడున్నట్లు1.52 కోట్ల ఎకరాలకు ఎకరానికి ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తే రూ. 22,800 కోట్లు అవసరం అవుతాయి. కానీ అలా కాకుండా కేవలం 5 ఎకరాలకు పరిమితం చేస్తే రూ.15 వేల కోట్లు సరిపోయే అవకాశం ఉంది. అంటే రూ.7,800 కోట్లు ఆదా అవుతాయి. 90 శాతం మంది రైతులకు రైతుభరోసా కూడా దక్కుతుంది.