తొమ్మిదేండ్లలో ఏం మారింది..ఎందుకీ ఉత్సవాలు..?

తొమ్మిదేండ్లలో ఏం మారింది..ఎందుకీ ఉత్సవాలు..?

తెలంగాణ ఏర్పడి 2023 జూన్ 2 నాటికి తొమ్మిదేండ్లు పూర్తయింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏడాది ముందే దశాబ్ది ఉత్సవాల పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఇదంతా చూస్తుంటే..‘తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లుంది’ అన్నట్టుగా ఉంది. రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేసీఆర్ ఏడాది ముందే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల పేరుతో ప్రభుత్వ ధనంతో ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున పెద్ద ఎత్తున ఉత్సవాలు చేయాలని నాడు బెంగాల్ లో ఉన్న గాంధీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరారు. అప్పుడు గాంధీ ‘‘జనం తిండి లేక చస్తున్నారు’’ అని జవాబు ఇచ్చారు. “స్వరాజ్యం వస్తే ఏం చేస్తామని ప్రజలకు చెప్పామో.. వాటి గురించి ఆలోచించాలి కానీ ఉత్సవాలు ఎందుకు? ప్రజల జీవితాల్లో మార్పులు  వస్తే అదే పెద్ద ఉత్సవం’’ అని గాంధీ అక్కడ పరోక్షంగా ప్రస్తావించారు. ఇప్పుడిదే విషయం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకూ వర్తిస్తుంది. ఉద్యమ సమయంలో సబ్బండ వర్గాలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ఎంత మేరకు అమలు చేశారు? తెలంగాణకు కావలి కుక్కలా ఉంటానని చెప్పిన కేసీఆర్.. తన నైతికను నిలబెట్టుకున్నారా? వంటి కీలక అంశాలపై సమగ్ర చర్చ జరగాల్సిన చారిత్రక సందర్భం ఇది. తెలంగాణలో సామాజిక, రాజకీయ, ఆర్థిక విషయాల్లో అభివృద్ధిపైనా చర్చ జరగాల్సిన సమయమిది.

తెలంగాణ బంగారమైందా? 

తెలంగాణ వస్తే ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయో? సీమాంధ్రుల నుంచి విముక్తి పొందితే ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో కేసీఆర్ ఉద్యమ టైమ్ లో వివరించి చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఆత్మగౌరవంతో బతకొచ్చని తెలిపారు. స్వరాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, దళితుణ్ని తొలి సీఎం చేస్తామని, ఊర్ల స్వరూపాలే మారుస్తామని హామీలు ఇచ్చారు.  కుర్చీ వేసుకుని మరీ ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తామన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణను బంగారు తునుక చేస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. మరి తెలంగాణ బంగారం అయిందా? ఏం సాధించారని కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారో తెలంగాణ సమాజానికి చెప్పాలి. ఐదేండ్ల కింద కట్టిన ప్రగతి భవన్, ఇప్పుడు నిర్మించిన కొత్త సెక్రటేరియెట్ వెలుగు జిలుగులు.. ప్రజల జీవితాల్లోనూ ఉన్నాయని కేసీఆర్ భ్రమిస్తూ.. భావిస్తూ.. ఉన్నారా? చెప్పాలి.  ఉద్యమం కోసం ఉద్యోగాలనే ఫణంగా పెట్టిన ఉద్యోగులకు నెల గడిచినా  జీతం రావడం లేదు. అసలు తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగే ఉండడని అప్పట్లో కేసీఆర్ మైకులు పగిలేట్లు చెప్పారు. పెన్షనర్లకు సకాలంలో పెన్షన్ డబ్బులు రావడం లేదు. అసలే గాలిలో దీపం లాంటి ఉద్యోగాలు జర్నలిస్టులవి. వారికి హైదరాబాద్ లో ఇండ్ల స్థలాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇవేవీ కేసీఆర్ పట్టించుకోవడం లేదు.

నీళ్ల లక్ష్యం నెరవేరిందా? 

గోదావరిపై అడ్డంగా పెద్ద పెద్ద కట్టలు కట్టి నీళ్లను ఎత్తిపోస్తున్నమని తెలంగాణ సమాజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తున్నది. కాళేశ్వరం పేరుతో ఆనకట్టలు ఏమో గానీ నోట్ల కట్టలు బాగానే ఎత్తారని లోకం కోడై కూస్తున్నది. పాలమూరు ప్రాజెక్టు పేరుతో ఉమ్మడి జిల్లాలోని చేన్లు, చెల్కల్లో గుంతలు తవ్వి వదిలేశారు. ప్రాజెక్టుల డిజైన్లు, రీడిజైన్లు అంటూ కేసీఆర్ ఫ్యామిలీ తమ జీవితాలను బాగుచేసుకోవడానికి ప్రాజెక్టులను ఎట్ల ఉపయోగించుకుంటన్నదో అందరికీ తెలుసు. ఆయా ప్రాజెక్టుల నిర్దేశిత సాగు ఎంత? వాస్తవ సాగు ఎంత? గత ప్రభుత్వాలు చేసిందెంత? ఈ ప్రభుత్వం చేసిందెంత? అప్పటికి ఇప్పటికీ తీసుకొచ్చిన మార్పు ఏమిటి? పరిపాలనకు, స్వయం పాలనకు మధ్య ఉన్న మౌలికమైన తేడా ఏమిటి? వీటిపై ఏనాడైనా మదింపు చేశారా? ఏమీ లేదు. మరెందుకీ ఉత్సవాలు? గత తొమ్మిదేండ్లుగా ‘నీళ్లు.. నీళ్లు’ అంటూ ప్రజలను ఎండమావుల్లో ముంచినందుకా ఉత్సవాలు?

అభివృద్ధి,ఆత్మగౌరవం కావాలి..

నాడు ఉద్యమ సందర్భంగా అందరి కష్టాన్ని కేసీఆర్ తన అకౌంట్లో వేసుకున్నారు. తానే ఏదో చేస్తున్నట్లు గాయిగాయి  గత్తరగత్తర చేశారు. ‘అప్పడానికి సత్తువ తక్కువ.. చప్పుడు ఎక్కువ’ అన్నట్లు కేసీఆర్ తీరుండే. దేశంలోని అన్ని పార్టీలను ఒప్పించి, మెప్పించి.. ఆంధ్రాలో తమకు నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడ్తాయని, ఆత్మగౌరవంతో బతుకుతారని భావించి నాడు కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. పార్లమెంట్​లో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో ముష్టిఘాతాలకు, పెప్పర్ స్ర్పేలకు బలైంది కాంగ్రెస్ ఎంపీలే. నాడు లగడపాటి  తెలంగాణ బిల్లును ఆపేందుకు పెప్పర్ స్ర్పేతో దాడిచేసిన సమయంలో మాకేం జరిగిందో అర్థం కాలేదు. ఊపిరి ఆగిపోయినంత పనైంది. పార్లమెంట్ లో జరిగిన ఈ దుశ్చర్యను చూసి యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. అప్పుడు కేసీఆర్ సభలో లేడు. ఇన్ని వేదనల నడుమ తెలంగాణ వచ్చింది. కానీ నాటి పెప్పర్ స్ప్రే బాధ కంటే.. ఇప్పుడు ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ పాతాళంలో సమాధి చేస్తున్న తీరు చూస్తుంటే మరింత బాధ కలుగుతున్నది. ఇక్కడి ప్రజలకు ఇప్పుడు కావాల్సింది ఉత్సవాలు కాదు. అసలైన అభివద్ధితో పాటు  ఆత్మగౌరవంతో స్వేచ్ఛగా జీవించే వెసులుబాటు. 

ఉపాధి లేదు.. ఉద్యోగాల్లేవ్

తొమ్మిదేండ్లలో విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఏమైనా మార్పులు తెచ్చారా? కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? ఈ తొమ్మిదేండ్లలో ఏయే రంగాల్లో  తెలంగాణ రాణించిందో ప్రజలకు వివరించారా? ఏమీ లేదు. ప్రజల్లో పలుకుబడి పెంచేలా కొన్ని గురుకులాలు ఏర్పాటు చేసి, కళ్లద్దాలు పంపిణీ చేసి..  ‘సర్వం.. సకలం.. కుశలం’ అని చెప్పుకుని ఉత్సవాలు చేసుకుంటే సరిపోతుందా? గతంలో మాదిరిగానే ఇప్పుడూ నిరుద్యోగులు బాధలో ఉన్నారు. పేపర్ లీకేజీలు కొనసాగుతూనే ఉన్నాయి. అప్పట్లో ఇంటర్ విద్యార్థుల గోడు.. ఇప్పుడు పేపర్ లీకేజీల గోస. దీంతో విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నట్లు అర్థం అవుతున్నది. అందుకే విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులేమీ రాలేదు. ఉపాధి రంగమే లేదు. సబ్బండవర్గాల సామాజికాభివృద్ధికి బదులుగా కులాల వారీగా భవనాలు నిర్మిస్తూ మనుధర్మాన్ని మరోసారి పున:ప్రతిష్ట చేస్తున్నందుకా దశాబ్ది ఉత్సవాలు చేసుకునేది? 

అడ్డగోలు అప్పులు.. 

బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను అప్పుల్లో ముంచింది. భవిష్యత్తు తరాలపై మోయలేనంత భారం మోపింది. తొమ్మిదేండ్ల కింద తెలంగాణ అప్పు రూ.60 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.6 లక్షల కోట్లు దాటిపోయింది. కేసీఆర్ ఏం వెలగబెట్టారని ఇన్ని అప్పులు చేశారు?  ఎవరి జీవితాల్లో మార్పులు తెచ్చారని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు? దీనికి కేసీఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సీమాంధ్ర పాలనలో తెలంగాణ ప్రజలు రెండో శ్రేణి  పౌరులుగా బతికారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడి ప్రజలు తమ ఆత్మగౌరవాన్నే కోల్పోయారు. తమకో ప్రభుత్వం ఉందని, పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు ప్రభుత్వానికి చెప్పుకునే వీలుందని ప్రజలు భావించడం లేదు. ఇదేనా స్వయం పాలన? ఇందుకేనా వందలాది మంది యువత ప్రాణత్యాగం చేసింది?