తెలంగాణలో బెట్టింగ్ యాప్‎ల వేధింపులకు మరో యువకుడు బలి

 తెలంగాణలో బెట్టింగ్ యాప్‎ల వేధింపులకు మరో యువకుడు బలి

రాజన్న సిరిసిల్ల: ఆన్​లైన్​ బెట్టింగ్ ​యాప్‎ల మరణాల ఆగడం లేదు. బెట్టింగ్ యాప్‎లపై నిషేధమున్నా ఫోన్‎లో రోజుకో 4 కొత్త బెట్టింగ్​యాప్స్​పుట్టుకురావడంతో.. యువకులతో పాటు ఉద్యోగులు వాటి బారినపడుతున్నారు. అదేపనిగా బెట్టింగ్​పెడుతూ.. ఆన్​లైన్​గేమ్స్​ఆడుతూ.. ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఆస్తులు తాకట్టుపెట్టి, లోన్​యాప్‎లలో అధిక వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారు. అప్పులు, లోన్లు ఇచ్చినోళ్ల వేధింపులు భరించలేక చివరికి ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు.

 తాజాగా తెలంగాణలో మరో యువకుడు బెట్టింగ్ యాప్ భూతానికి బలయ్యాడు. అత్యాశకు బెట్టింగ్ యాపుల్లో పందెలు పెట్టి.. నష్టాలు రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడి బంధువుల వివరాల ప్రకారం.. తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లె గ్రామానికి చెందిన తుమ్మల వంశీ (25) కరీంనగర్‎లో వీల్ అలైన్మెంట్ మెకానిక్ వర్క్ చేస్తుంటాడు. ఈ క్రమంలో బెట్టింగ్ మోజులో పడిన వంశీ.. రూ.10 లక్షల వరకు అప్పులు చేసి ఆన్లైన్‎లో బెట్టింగ్ పెట్టాడు. 

ALSO READ | IPO News: డబ్బులు ఎవరికీ ఊరకే రావు.. అందుకే ఐపీవోకి వస్తున్న లలితా జ్యువెలరీ

బెట్టింగ్‎లో లాస్ రావడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆందోళనకు గురయ్యాడు. ఇక చేసేదేమి లేకపోవడంతో సోమవారం (జూన్ 9) పొలం దగ్గర చెట్టుకు ఉరివేసుకొని వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేతికి అందొచ్చిన కొడుకు బెట్టింగ్ భూతానికి బలికావడంతో మృతుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.