నేను కలగన్న తెలంగాణ కనవడ్తంది

నేను కలగన్న తెలంగాణ కనవడ్తంది

కరీంనగర్, వెలుగు: ఏ తెలంగాణను తాను కలగన్నానో ఆ తెలంగాణ కనబడుతున్నదని సీఎం కేసీఆర్​ అన్నారు. కరీంనగర్​ జిల్లా పాలుగారే జిల్లా అవుతుందని, సిరిసిల్ల కొండలు పాపికొండలను తలదన్నేలా తయారవుతాయని పేర్కొన్నారు. కాంగ్రెస్​, బీజేపీ నేతలకు పనిలేదని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఆ సన్నాసులకు కూడా జూన్​ తర్వాత కాళేశ్వరంతో అద్భుతం కనిపిస్తుందంటూ ఎద్దేవా చేశారు. మానేరు మీద 29, మూలవాగు మీద 10 చెక్​డ్యాంలను జూన్​ వరకు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మిడ్​ మానేరులో ఏడాది పొడవునా నీళ్లుంటాయని, అవసరమైతే ఎస్సారెస్సీకి, సిద్దిపేటకు నీళ్లు ఇచ్చుకోవచ్చని అన్నారు.  సోమవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో సీఎం పర్యటించారు. కుటుంబసమేతంగా వేములవాడలో రాజన్నను దర్శించుకొని.. మిడ్​మానేరుకు జలహారతి ఇచ్చారు. తరువాత కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్​ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల గురించి వివరించారు. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. సీఎం ఏమన్నారంటే..

ఆ సన్నాసులకూ కనవడ్తది

లండన్ నగరంలో థేమ్స్ నది సజీవంగా ఉన్నట్లు.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే మానేరు నది సజీవంగా ఉంటదని గతంలో నేను చెప్పిన దీన్ని కొంత మంది వెకిలిగా.. వాళ్ల బతుకే వెకిలి కాబట్టి.. ఆ పార్టీలోళ్లు కరీంనగర్ లండన్ అయిందా అని అంటున్నరు. వాళ్లకు అర్థం లేదు.. తాత్పర్యం లేదు. నేను చెప్పింది వేరు.. ఒకసారి కాళేశ్వరం కంప్లీటయితే అద్భుతంగా ఉంటదని చెప్పిన. ఆ అద్భుతం జూన్​ తర్వాత కనవడ్తది. ఆ సన్నాసులకు కూడా కనవడ్తది. అద్భుతమైన టూరిజం స్పాట్ గా మారుతది. పాపికొండల కాడ గోదావరి ఎట్లా కనిపిస్తదో ఇంచుమించుగా సిరిసిల్ల కొండలు అట్లనే కనిపిస్తున్నాయి. తేమ శాతం పెరిగితే పాపికొండలను తలదన్నే కొండలయితయ్. నేనే కళ్లారా చూసిన.. గంగమ్మకు పూజ చేసిన. ఏ తెలంగాణను కలగన్ననో నేను కేసీఆర్​గా ఆ తెలంగాణ కనబడుతా ఉంది. రెండేండ్లు పోతే పచ్చదనం అద్భుతంగా పరిఢవిల్లుతది.

ఎస్సారెస్సీతో సంబంధం లేకుండానే..

కరీంనగర్​ను ఒరుసుకుంట గోదావరి పారుతది. కానీ ఎక్కడ చూసినా కరువే ఉండేది. ఇప్పుడు  కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని ఎస్సారెస్పీతో  సంబంధం లేకుండా  మిడ్ మానేరు, ఎల్ఎండీ ప్రాజెక్టులతో అద్భుతంగా రెండు పంటలు పండించుకునే ఆస్కారం ఉంటది. ఈ రెండు ప్రాజెక్టులు కలిపి 50 టీఎంసీలు.. బ్యారేజీలు కలిపి  సుమారుగా 110 టీఎంసీలు  అందుబాటులో ఉంటయ్​. డెడ్ స్టోరేజీలు మినహాయిస్తే  సుమారుగా 90 టీఎంసీలు ఉంటయ్​.  ఇక్కడ శాశ్వతంగా కరవు పీడ తొలగిపోయింది. వర్షం చుక్క పడకున్నా.. రైతులు మొగులకు ముఖం చూడకుండా నిశ్చింతగా రెండు పంటలు పండించుకోవచ్చు.  లక్ష్మి, సరస్వతి, పార్వతి బ్యారేజీలు, ఎల్లంపల్లి రిజర్వాయర్ల వల్ల ఏడాది పొడవునా.. 140 కిలోమీటర్ల దాకా గోదావరి సజీవంగా ఉంటది. వీటికి తోడు 200 కి.మీ. కాకతీయ కెనాల్​ల, 165 కి.మీ. వరదకాలువల ఏడాది పొడవునా నీళ్లుంటయ్​. కరీంనగర్​ పాలుగారే జిల్లా అయితది.

వాటిని చూసి బాధపడ్డ

కరీంనగర్ జిల్లా గొప్పతనం ఏమిటంటే.. ఇక్కడ  సుమారుగా  40, 50 వాగులు ఉంటయ్​. అయినా కరువు కాటకాలు. ఇక్కడి నుంచే ముంబై, గల్ఫ్, దుబాయ్  వలసలు పోతరు. సిరిసిల్ల, వేములవాడ తీవ్రమైన కరవు ప్రాంతాలు. ఏడొందలు.. ఎనిమిది వందల ఫీట్ల లోతుకు బోర్లు వేస్తేగానే నీళ్లు రాని పరిస్థితులు. కరెంట్ బాధతోని జమ్మికుంటలో భిక్షపతి అనే రైతు చనిపోయిండు. చావులు పరిష్కారం కావు.. అని అప్పటి కలెక్టర్ నినాదాలు గోడల మీద రాయించారు. వాటిని చూసి చాలా బాధ అయ్యేది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ జిల్లా ఉండేది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈ జిల్లాలో ఏడాది మొత్తం నీళ్లుంటయ్​ ఈ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు  పెరగడంతో ఎంతో మంది రైతులకు మేలు కలుగుతది. బోర్లు.. మోటార్లు అని రైతులు రూ. 40వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు. సుమారుగా రాష్ట్రంలో 24 లక్షల పంపు సెట్లు అధికారికంగానే ఉన్నయ్​. వీటి కోసం రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాష్ట్ర పురోగతికి ఉపయోగపడాలి.

మానేరు మీద 29, మూలవాగు మీద 10 చెక్​డ్యాంలు

ఉమ్మ డి కరీంనగర్ జిల్లాలో అతి పొడవైన నది మానేరు. అప్పర్ , లోయర్, మిడ్ మానేరు గోదావరి లో కలిసే వరకు చూస్తే 181 కిలోమీటర్లు ఉంటది. గతంలో దీన్ని ఎవరు పట్టించుకోలే. మంత్రి ఈటల రాజేందర్ అడిగితే కొన్ని చెక్ డ్యామ్ లు ఇచ్చినం.. అవి పూర్తయినయ్. మానేరు మీద 29, మూలవాగు మీద 10 చెక్ డ్యాములు నిర్మిస్తం. వచ్చే జూన్ లో ఈ చెక్ డ్యామ్ లు నిండాలే.  రూ. 530 కోట్లలో వెంటనే ఈ చెక్ డ్యామ్ ల కోసం టెండర్లు పిలిచి పూర్తి చేయాలె. ఏ పార్టీకి మాకున్న కమిట్ మెంట్ ఉండదు. మాది ఉద్యమ పార్టీ కాబట్టి మాకు అంకితభావం ఎక్కువ.  అనేక అంశాలను పరిశీలించినం.. ప్రత్యేకంగా ఇరిగేషన్ ను మొత్తం ఎక్స్ రే తీసినం. చాలా మంది సీనియర్ నాయకులకు.. సోకాల్డ్ నాయకులకు కూడా తెలవదు.  1230 చెక్ డ్యామ్ లకు పాలన అనుమతులు ఇస్తే ఇందులో సింహ భాగం కరీంనగర్ కే ఇచ్చినం.  రూ. 1232 కోట్లు ఈ జిల్లాకే ఇచ్చినం. రెండేండ్లలో పూర్తి చేస్తం.

మిడ్ మానేరు లో ఏడాదంతా నీళ్లే

ఇప్పటికే  మిడ్ మానేరు.. ఎల్ ఎండీలు కళకళలాడుతున్నయ్​. ఏడాది మొత్తం మిడ్ మానేరు నీటితో ఉంటది. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు కు థర్డ్ టీఎంసీ కూడా సాంక్షన్ చేసుకున్నం. ఇది ఎప్పటికి నీటి ఖజానాలాగ ఉంటది. ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా.. మిడ్ మానేరు నుంచి వాటర్ ఇస్తం. అటు ఎస్సారెస్పీకి, ఇటు సిద్దిపేటకైనా సరే తాగు, సాగు నీరు.. ఇలా ఎన్ని ఇబ్బందులున్న మిడ్​ మానేరు ఆదుకుంటది. మనకు ప్రధానంగా ఎల్లంపల్లి, మిడ్ మానేరు, మల్లన్న సాగర్.. ఇవి మూడు కలిపి ఎన్నో వాటికి వాటర్ సప్లై చేస్తుంటయ్. ఇవి కీలక పాత్ర పోషిస్తయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుతోనే రెండు పంటలకు కలిపి సుమారుగా 75 నుంచి 80 లక్షల ఎకరాలకు నీరందుతది. అదనంగా భూగర్భ జలాలు కలిపి మరో 20 లక్షల ఎకరాలు ఉంటది. కరీంనగర్​ ప్రజలు గొప్పవాళ్లు. 2001 సింహ గర్జన నుంచి ఇప్పటివరకు కూడా తెలంగాణ ఆత్మగౌరవ బావుటా ఎగురవేయడంలో కరీంనగర్​ జిల్లా  ప్రథమ పంక్తిలో ఉంది. ఉద్యమాన్ని కరీంనగర్ నుంచి ప్రారంభించినట్లుగానే.. ఇరిగేషన్ ప్రకారం కరీంనగర్ నియోజకవర్గానికే తొలి ఫలితం దక్కడం సంతోషంగా ఉంది.  అందుకే స్వయంగా చూడాలనుకొనే ఇక్కడికి వచ్చిన. హృదయం నిండుగా సంతోషంతో ఇక్కడ్నుంచి తిరిగి వెళ్తున్న. ఇక్కడ్నుంచి నీళ్లు సూర్యాపేట వరకు కూడా వెళ్తున్నయ్​. 30ఏండ్లుగా నిండని చెరువులు కూడా ఇప్పుడు నిండుతున్నాయి.