హెల్త్ మినిస్టరే ర్యాలీలు చేస్తే ఎట్ల? మంత్రి ఈటలపై డాక్టర్ల అసంతృప్తి

హెల్త్ మినిస్టరే ర్యాలీలు చేస్తే ఎట్ల? మంత్రి ఈటలపై డాక్టర్ల అసంతృప్తి

రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే ఎన్నికల ప్రచారానికి కార్యకర్తలు భారీగా తరలి రావాలంటూ మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన ప్రకటనపై డాక్టర్లు, హెల్త్ ఎక్స్ పర్ట్స్ మండిపడుతున్నారు. కరోనాతో జనాలు చస్తుంటే, స్వయంగా హెల్త్ మినిస్టరే ర్యాలీలు చేపట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. 
జనాలు చస్తుంటే.. ఇదేం పనంటూ ఫైర్ 
హైదరాబాద్, వెలుగు:
ఓవైపు కరోనా వ్యాప్తి చెందుతుంటే.. మరోవైపు ఎన్నికల ప్రచారానికి కార్యకర్తలు భారీగా తరలి రావాలంటూ మంత్రి ఈటల రాజేందర్ ఇచ్చిన ప్రకటనపై డాక్టర్లు, హెల్త్ ఎక్స్ పర్ట్స్ మండిపడుతున్నారు. కరోనాతో జనాలు చస్తుంటే, స్వయంగా హెల్త్ మినిస్టరే ర్యాలీలు చేపట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. వరంగల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం మంత్రి ఈటల వెళ్లారు. అక్కడి పలు డివిజన్లలో ఆయన ప్రచారం చేశారు. కాగా, ఈ ప్రచారానికి ‘టీఆర్‌‌‌‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై.. విజయవంతం చేయాలి’ అని ఆదివారం రాత్రి మంత్రి ఓ ప్రకటన రిలీజ్ చేశారు. దీనిపై డాక్టర్లు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 
మంత్రులకూ పరిస్థితి తెలియదా? 
‘హెల్త్ మినిస్టరే ఇలా జనాలను పోగు చేస్తుంటే, ప్రజలను కాపాడేదెవరు.. ఇక ప్రజలకు ఆ దేవుడే దిక్కు’ అని డాక్టర్ విజయేందర్ పోస్ట్ చేశారు. ‘ప్రభుత్వ దవాఖాన్లలో ఎన్ని లోపాలున్నా, జనాల చావులపై తప్పుడు లెక్కలు చెబుతున్నా.. మేం సైలెంట్‌‌గా ఉంటున్నాం. సంవత్సరం నుంచి గాంధీలో ఎంఆర్‌‌‌‌ఐ, క్యాథల్యాబ్ లేక జనాలు చస్తున్నారు. హెల్త్ మినిస్టర్ ఏదో  కష్టపడుతున్నాడనే ఉద్దేశంతో.. వీటన్నింటిపై మేం కంప్లయింట్స్ చేయకుండా సర్దుకుపోతున్నాం. కానీ, ఇప్పుడు ఆయనే ఇలా జనాలను గ్యాదర్ చేస్తుంటే చాలా బాధగా ఉంది’ అని డాక్టర్ నాగార్జున అన్నారు. ‘వాస్తవ పరిస్థితులు ఏంటో జనాలకు తెలియకపోవచ్చు. కానీ, మంత్రులు.. లీడర్లకు తెల్వదా’ అని ప్రశ్నించారు. ‘మంత్రి పిలుపుతో ప్రచారానికి వెయ్యి మంది వస్తారనుకుంటే, అందులో కనీసం ఇద్దరు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ రెండు కుటుంబాల బాధ్యత ఎవరు తీసుకుంటారు”అని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా పేషెంట్లను కాపాడేందుకు డాక్టర్లు, హెల్త్ కేర్ వర్కర్లు కష్టపడుతుంటే.. వైరస్ ను నియంత్రించాల్సిన నాయకులు ఇలా మీటింగ్ లు పెట్టడం దారుణమన్నారు. ‘‘రాజకీయ నాయకులు ర్యాలీలు, ప్రచారాలతో ఓ వైపు వైరస్ వ్యాప్తికి కారణమవుతూ, మరోవైపు మొసలి కన్నీరు కారుస్తున్నారు’ అని ఇన్‌‌ఫెక్షియస్‌‌ డిసీజ్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్‌‌ డాక్టర్ బుర్రి రంగారెడ్డి మండిపడ్డారు. ఇలాంటి మైండ్ లెస్ రాజకీయాలపై నిరసన వ్యక్తం చేయాలన్నారు.