మహారాష్ట్రలో అసలేం జరుగుతోంది..?

మహారాష్ట్రలో అసలేం జరుగుతోంది..?

ఢిల్లీ : మహారాష్ట్రలో నెలకొన్న పరిస్థితులను కేంద్ర హోంశాఖ కార్యదర్శికి వివరించినట్లు బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య చెప్పారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శితో భేటీ అయిన ముంబైకి చెందిన బీజేపీ ప్రతినిధుల బృందం.. కిరీట్ సోమయ్యపై జరిగిన దాడి గురించి నివేదిక అందించింది. అవసరమైతే ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాన్ని మహారాష్ట్రకు పంపిస్తామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తమకు చెప్పినట్లు కిరీట్ సోమయ్య చెప్పారు. 

కిరీట్ సోమయ్య వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ స్పందన

మహారాష్ట్రలో అసలేం జరిగింది..? ఏదైనా రక్తపాతం జరిగిందా..? అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఇద్దరు, ముగ్గురితో ఒక ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్ళిందని బీజేపీ నేత కిరీట్ సోమయ్యను ఉద్దేశించి అన్నారు. ఏదైనా సమస్య ఉంటే మహారాష్ట్ర సీఎంను కలవాలి కానీ.. ఢిల్లీకి వెళ్లడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రమే శాంతి భద్రతల వ్యవహారాలు చూసుకుంటుందన్నారు. బీజేపీ నేతలు మహారాష్ట్రను అవమానిస్తున్నారని.. డ్రామాలు చేస్తున్నారంటూ సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ముంబైలో అసలేం జరిగింది..?

బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య దాడి ఎలా జరిగింది..?

బీజేపీ మాజీ ఎంపీ కిరీట్ సోమయ్య కారుపై ముంబైలో పోలీస్ స్టేషన్ ఎదుటే రాళ్ల దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటనలో ఆయన ముఖానికి గాయమై రక్తం కారడంతో పాటు కారు అద్దం కూడా ధ్వంసమైంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ అండదండలతో శివసేన కార్యకర్తలు తనను చంపడానికి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని కిరీట్ సోమయ్య ఆరోపించారు. ఈ ఘటనపై గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు సోమయ్య కారు డ్రైవర్ తమ వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతో తమ పార్టీ కార్యకర్తలు ఇద్దరు గాయపడ్డారని శివసేన నేతలు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపైనా కేసు నమోదు చేశారు. 

ఈనెల 23వ తేదీన అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ రాణా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణా దంపతులను పోలీసులు అరెస్ట్ చేసి, ఖర్ పోలీస్ స్టేషన్ కు తరలించడంతో సోమయ్య అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న శివసేన కార్యకర్తలు ఆయనకు వ్యతికేరంగా నినాదాలతో హోరెత్తించారు. స్టేషన్ నుంచి సోమయ్య తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన కారుపై చెప్పులు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో గాయపడిన కిరీట్ సోమయ్య బాంద్రా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే.. అందులో తక్కువ తీవ్రత ఉండే సెక్షన్లు పెట్టారంటూ సోమయ్య ఎఫ్ఐఆర్ కాపీపై సంతకం చేయడానికి నిరాకరించారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలు అదుపు తప్పాయని ఆరోపించారు. 

మరిన్ని వార్తల కోసం..

సమ్మర్ క్యాంప్ ను ప్రారంభించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి

ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ఘన విజయం