ప్రపంచ చరిత్రను గమనిస్తే విప్లవాలు కత్తులతోనో, తుపాకులతోనో మాత్రమే రాలేదు. అక్షరం ముక్క రాని సామాన్యుడి చేతికి పుస్తకం అందినప్పుడు మాత్రమే సమాజం మలుపు తిరిగింది. అందుకే, విద్య అనేది కేవలం ఒక తరగతి గదికో లేదా సర్టిఫికెట్‌కో పరిమితమైనది కాదు. అది ఒక మానవ హక్కు, ఒక సామాజిక బాధ్యత, ఉజ్వల భవిష్యత్తుకు ఏకైక మార్గం. ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికే ప్రతి ఏటా జనవరి 24న అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం.
ప్రపంచంలో పేదరికం, ఆకలి, అశాంతి వంటి సమస్యలన్నింటికీ మూల కారణం ‘అజ్ఞానం’. ఈ అజ్ఞానాన్ని తొలగించే ఏకైక వెలుగు విద్య. నెల్సన్ మండేలా అన్నట్లుగా "ప్రపంచాన్ని మార్చడానికి మన దగ్గర ఉన్న అత్యంత శక్తిమంతమైన ఆయుధం విద్య. ఒక వ్యక్తి విద్యావంతుడైతే, అది కేవలం ఆ వ్యక్తి అభివృద్ధి మాత్రమే కాదు. ఒక కుటుంబం, ఒక గ్రామం, చివరికి ఒక దేశమే ప్రగతిపథంలో పయనిస్తుంది.
విద్య శాంతికి మూలాధారంనేటి ప్రపంచం యుద్ధాలు, అసహనంతో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో విద్య కేవలం జీవనోపాధిని ఇచ్చేదిగా మాత్రమే కాకుండా, మనుషులను కలిపే వంతెనగా మారాలి. విజ్ఞతతో కూడిన విద్య మనిషికి విచక్షణ జ్ఞానాన్ని ఇస్తుంది. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం, అహింసను పాటించడం ప్రకృతిని ప్రేమించడం నేర్పిస్తుంది. ఎక్కడైతే నాణ్యమైన విద్య అందుబాటులో ఉంటుందో, అక్కడ హింసకు తావుండదు. అందుకే ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని 'శాంతి, అభివృద్ధి' కోసం విద్యను ఒక సాధనంగా గుర్తించింది.
మన ముందున్న సవాలు
మనం 21వ శతాబ్దంలో ఉన్నామని గర్వంగా చెప్పుకుంటున్నా, నేటికీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 24.4 కోట్ల మంది పిల్లలు పాఠశాలలకు దూరంగా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే, లక్షలాది మందికి కనీస చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు అందడం లేదు. ఈ అంతరాన్ని తగ్గించి, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. నేటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పిల్లలు బడిముఖం చూడటం లేదు. ఆర్థిక ఇబ్బందులు, యుద్ధ వాతావరణం, వివక్ష వంటి కారణాల వల్ల అక్షరం వారికి అందని ద్రాక్ష అవుతోంది. ముఖ్యంగా బాలికా విద్య విషయంలో అధిగమించాల్సిన అడ్డంకులు ఎన్నో ఉన్నాయి. ఒక బాలుడికి విద్యను అందిస్తే ఒక వ్యక్తిని ఉద్ధరించినట్లు, కానీ ఒక బాలికకు విద్యను అందిస్తే ఒక తరాన్నే ఉద్ధరించినట్లు అవుతుంది. లక్షలాది మందికి కనీస చదవడం, రాయడం వంటి నైపుణ్యాలు అందడం లేదు. ఈ అంతరాన్ని తగ్గించి, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.
అందరినీ చదువు వైపుగా..
మహత్తరమైన చదువును ప్రతి ఒక్కరికి అందించేలా, జనాన్ని జాగృతం చేసి, అవిద్య పై నారి సారించి ప్రగతి సాధనకు పునరంకితం అవ్వాలి. మన చుట్టుపక్కల ఉన్న ఏ ఒక్క చిన్నారి కూడా చదువుకు దూరం కాకుండా చూడటం మన కనీస కర్తవ్యం. ఈ అంతర్జాతీయ విద్యా దినోత్సవం రోజున మనం చదువుకోవడమే కాకుండా, చదువుకు దూరంగా ఉన్న మరో చిన్నారిని అక్షరాల వైపు నడిపించేలా ప్రతిజ్ఞ చేద్దాం. చీకటిని తరిమే వెలుగు దీపం విద్య అని గుర్తుంచుకుందాం. మీ ఇంట్లో పనిచేసే వారి పిల్లలను బడికి పంపేలా ప్రోత్సహించండి. స్తోమత ఉంటే ఒక పేద విద్యార్థి చదువుకు ఆర్థికంగా సహాయం చేయండి. విద్య ప్రాముఖ్యతను నలుగురికీ వివరించండి.
- అశోక్ పోగు,
అధ్యక్షుడు,
తెలంగాణ సైకాలజిస్ట్ అసోసియేషన్
