ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో శని ప్రభావానికి లోనవుతాడు. మందగమనం కలిగినవాడైనందున ఈయనను శనైశ్వరుడు అంటారు.ఈయన నవగ్రహాల్లో అతి శక్తిమంతుడు.జాతకాలను విశ్వశించేవారు ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా భయపడరు కానీ శని విషయంలో మాత్రం టెన్షన్ పడతారు. ఏలినాటి శని, అర్టాష్టమ శని, అష్టమ శని ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. శని దోషం అంటే ఏమిటి.. ఎలాంటి ఇబ్బందులు వస్తాయి.. పరిష్కార మార్గాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
సమస్త ప్రాణకోటి పాపకర్మల ఫలాన్ని వెనువెంటనే కలిగించే దేవుడు శనీశ్వరుడు. జీవులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం కల్పించి, శిక్షించి, ధర్మాన్ని నిలిపే శని భగవానుడు యమధర్మరాజుకు అగ్రజుడు. ఇద్దరూ న్యాయాధిపతులే. జీవుల పాపపుణ్యాలను బట్టీ జీవించి ఉండగానే దోషాలను పరిహరించే బాధ్యతను నిర్వర్తిస్తున్న శనికి విశిష్ట స్థానం ఉంది.
ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు వుంటుంది. ఏలినాటిని ఏడునాడు అని కూడా అంటారు. నాడు అంటే అర్ధభాగం అని అర్థం. జాతకచక్రంలో 12 రాశులుంటాయి. గ్రహాలు ఆయా రాశుల్లో ప్రవేశించిన సమయంలో గ్రహ ప్రభావం ప్రారంభమవుతుంది. జన్మరాశిలో శని సంచారం 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ప్రవేశించినప్పుడు శని ప్రభావం మొదలవుతుంది. ఒక్కోస్థానంలో శని రెండున్నర సంవత్సరాలు వుంటాడు. దీంతో మొత్తంగా ఏడున్నర సంవత్సరాలు శని వుంటాడని అర్థం.
శని గ్రహం వలన కష్టాలు కలుగుతాయి.ఈ గ్రహం ఎవరి రాశిలో ఉంటేవారికి ప్రాణభయం, ధనం లేకపోవడం, ఒక వేళ వచ్చినా వెళ్లిపోవడం, మంచిస్థానం నుంచి అథమస్థానానికి వెళ్లిపోవడం... తదితరాలు జరుగుతాయి. ఈ సమయంలో ఒక వ్యక్తి కెరీర్ లో అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వంటి ఎన్నో సవాళ్లను, సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందని పండితులు చెబుతున్నారు.
ఇంకా వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు సంభవిస్తాయి. రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు, వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి. అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు వంటి ఫలితాలు ఉంటాయి.
శని మన రాశిలో ప్రవేశించినా కొన్ని మంచిపనులు చేసేందుకు దోహదం చేస్తాడు. వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి. అయితే వీటి వెనుక చాలా ఇబ్బందులు వుంటాయి. వివాహం జరిగితే చాలా ఖర్చవుతుంది.అలాగే ఇంటి నిర్మాణం పూర్తి చేయడమో లేక ఇంటిని కొనుగోలు చేస్తే అనంతరం ఆర్థిక వనరులకు కటకట ఏర్పడుతుంది. ఒక ఉద్యోగి ఇంటిని కొనుగోలు చేస్తే అతడి నెల జీతం నుంచి నెలవారీగా వాయిదాలు కట్టవలసివుంటుంది. దీంతో జీతం తగ్గుతుంది. అందుకనే ఇల్లుకట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు.
ఏలినాటి, అర్ధాష్టమ, అష్టమ శని ఇలా మన జాతకంలో ఏ దోష ప్రభావం ఉన్నా దాని నుంచి కొంత ఉపశమనం పొందాలంటే శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందడమే ఏకైక మార్గం.
- జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నపాటి తరుణోపాయాలను తప్పక పాటించాలి.
- ప్రతి శనివారం శనిదేవుడిని ఆరాధించడం, నవ గ్రహాల్లో ఆయన విగ్రహం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చేయాలి.
- శనివారంతోపాటు త్రయోదశి, అమావాస్య కలసివచ్చినప్పుడు శనీశ్వరుడిని తప్పక ఆరాధించాలి.
- పరమేశ్వరుడి పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. పక్షులకు ఆహారం వేయాలి.
- కాకి శని భగవానుడికి వాహనం.. అందువలన కాకులకు ఆహారం పెడితే మంచిది.
- యాచకులకూ వికలాంగులకూ పెరుగన్నంపెడితే కూడా శని తీవ్రత తగ్గుతుందని పెద్దలు చెబుతారు.
- ప్రతి సోమవారం శివాలయాన్ని సందర్శించడం మంచిది.
- ఆవులకు గ్రాసం.. నల్ల చీమలకు చక్కెరను ఆహారంగా ఇవ్వాలి.
- మంగళవారం ఉదయం స్నానం చేసిన తర్వాత 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి.
- దశరధుని శని స్తోత్రాన్ని శనివారం పఠించడం కూడా గొప్ప ప్రయోజనాలను అందిస్తుందని చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
