కేసీఆర్ రైతులకు చెప్పే తీపి కబురు అదేనా?

కేసీఆర్ రైతులకు చెప్పే తీపి కబురు అదేనా?

హైదరాబాద్, వెలుగు: రైతులకు త్వరలో సీఎం చెప్పబోయే తీపి కబురు ఏమిటి?  దేశం ఆశ్చర్యపోయే, అడ్డంపడేలా ఆ శుభవార్త ఉంటుందన్న సీఎం.. అసలు ఏం ప్రకటించబోతున్నారు?! టీఆర్​ఎస్​ లీడర్లలో, ఆఫీసర్లలోనూ దీనిపైనే జోరుగా చర్చ నడుస్తోంది. ప్రభుత్వం చెప్పే పంట వేసే రైతులకు ఫ్రీగా విత్తనాలు, ఫ్రీగా యూరియా ఇవ్వడం.. మద్దతు ధరపై బోనస్​ ఇవ్వడం.. కొత్తగా పంటల బీమా అమలు చేయడం.. వంటి అంశాలు సీఎం కేసీఆర్ మదిలోఉన్నాయని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి.

ఫ్రీగా విత్తనాలు, ఫ్రీగా యూరియా

ప్రభుత్వం చెప్పిన పంట వేస్తే ఉచితంగా విత్తనాలు, యూరియా పంపిణీ చేసే చాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలోనే దీనిపై  చర్చ జరిగింది. కానీ రైతుబంధు పథకం ప్రకటించిన తర్వాత  అది మరుగున పడింది. ఇప్పుడు కొత్త వ్యవసాయ విధానం తెరపైకి తేవడంతో ఫ్రీగా విత్తనాలు, ఫ్రీగా యూరియా సప్లై చేస్తామని సీఎం ప్రకటించే చాన్స్ ఉందని అంటున్నారు.

ఫ్రీ పంటల బీమా

చెప్పిన పంట వేసే రైతులకు నష్టం రాకుండా పంటల బీమా స్కీం తెచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. రైతులు ఒక్క పైసా చెల్లించకుండా ప్రీమియం మొత్తాన్ని సర్కారే చెల్లించేట్లు ఈ స్కీం ఉండొచ్చని ఓ అధికారి అన్నారు.

ఎంఎస్పీపై బోనస్

చెప్పిన పంట వేసే  రైతులకు మద్దతు ధరపై బోనస్ ప్రకటించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆఫీసర్లు అంటున్నారు. కేంద్రం ప్రకంటించే మద్దతు ధరపై క్వింటాల్​కు రూ. 100 నుంచి రూ. 200  వరకు బోనస్ ఇవ్వొచ్చంటున్నారు.