పాత పేపర్లు చూపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నవ్​

 పాత పేపర్లు చూపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నవ్​
  • కేంద్రం బిల్లులో మోటార్లకు మీటర్లని ఎక్కడుంది..?
  • కేంద్రం పేరుచెప్పి మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తే ప్రగతిభవన్​ బద్దలు కొడ్తం
  • డిస్కంలకు బకాయిలు ఎందుకు కడ్తలేవని నిలదీత
  • నాలుగో విడత పాదయాత్ర ప్రారంభ సభలో బండి సంజయ్

హైదరాబాద్, వెలుగు: కేసీఆర్​ చెప్పేవి అబద్ధాలని నిరూపించేందుకు తాను సిద్ధమని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ ప్రతిసవాల్​ చేశారు. ‘‘2022 ఆగస్టులో కేంద్రం పెట్టిన విద్యుత్​ కొత్త బిల్లును ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రతి రైతుకు, మీడియాకు నేనే పంపిస్త. దాన్ని  ముఖ్యమంత్రి కేసీఆర్​ చదవాలి. ఆ బిల్లులో ఎక్కడైనా మోటార్లకు మీటర్లు పెట్టాలని రాసి ఉంటే నేనూ రాజీనామా చేస్త.  నువ్వు అసెంబ్లీలో సవాల్ చేసినవట కదా. నీ సవాల్​ను స్వీకరిస్త.. నువ్వు చెప్పింది తప్పు అని నేను నిరూపిస్త. నీకు సిగ్గు, నిజాయితీ ఉంటే రాజీనామా చెయ్​.. ముక్కు నేలకు రాయ్​” అని కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. 

వాస్తవాలు చెప్పాల్సిన అసెంబ్లీలో అబద్ధాలు చెప్పి కేంద్రంపై అభాండాలు వేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. ఎక్కడివో పాత పేపర్లు, పనికిరాని, అర్థంపర్థంలేని పేపర్లు అసెంబ్లీలో చూపెట్టి.. తప్పుదోవ పట్టిస్తున్నారని, తెలంగాణ సమాజానికి, రైతులకు కేసీఆర్​ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం నుంచి బండి సంజయ్ ప్రారంభించారు. అంతకు ముందు చిత్తారమ్మ దేవాలయంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ తో కలిసి పూజలు చేసిన సంజయ్.. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని రాంలీల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.

‘‘కేంద్రంపై నిందలు మోపి మోటార్లకు మీటర్లు పెట్టేందుకు, కరెంట్ చార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారం మోపేందుకు కేసీఆర్ కుట్రకు తెరలేపిండు. అట్ల చేస్తే.. ప్రగతిభవన్ గడీలు బద్దలు కొడ్తం” అని హెచ్చరించారు. డిస్కంలకు వేల కోట్ల బకాయిలు కట్టలేక డిస్కంలను మూసివేసే కుట్ర చేస్తూ ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టివేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 

ఆర్టీసీని ప్రైవేట్​పరం కానియ్యం

99 ఏండ్ల లీజు పేరుతో విలువైన ఆర్టీసీ డిపోలు, ఆర్టీసీ స్థలాలను కేసీఆర్ కుటుంబం, వాళ్ల అనుచరులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని బండి సంజయ్​ మండిపడ్డారు. ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం చేయనీయబోమన్నారు.  ఆర్టీసీని ప్రైవేటుపరం చేస్తే అడ్డుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు.

హైదరాబాద్​ను డల్లాస్​ చేస్తనంటివి కదా.. 

‘‘కుత్బుల్లాపూర్ మినీ ఇండియా. జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం... ఇక్కడ కంపెనీల్లో వాటా కావాలని సీఎం కుటుంబం ఒత్తిడి తెస్తుంటే... చాలా కంపెనీలు తట్టుకోలేక ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నయ్​.” అని కేసీఆర్ పై సంజయ్​ మండిపడ్డారు. ‘‘హైదరాబాద్ ను డల్లాస్ చేస్తనన్నవ్.. ఏమైంది? హైదరాబాద్ లో గుంత కన్పిస్తే వెయ్యి రూపాయలిస్తనంటివి.. నేను వస్తున్న దారంతా గుంతలమయమే. ఆ గుంతలకు డబ్బులియ్యాల్నంటే.. నీ బడ్జెట్ సరిపోదు” అని అన్నారు.

‘‘నాలాలు, చెరువులను టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నరు. దీనిని ప్రశ్నించడానికే పాదయాత్ర చేస్తున్న. రూపాయి బిల్ల వేస్తే కనబడేలా హుస్సేన్ సాగర్ ను తీర్చిదిద్దుతనని కేసీఆర్​ చెప్పిండు. మరి ఏమైంది? జీడిమెట్లలోనూ నీటికాలుష్యం.. పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నరు. 80 వేల  ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నిస్తే మతతత్వమా?” అని సంజయ్ నిలదీశారు. ‘‘30 గ్రామాలకిచ్చే కరెంటును నీ ఫాంహౌస్​కు వాడ్తున్నవ్​. రైతుల పేరుతో మంత్రులు పాంహౌస్​లకు కరెంట్ వాడుతున్నరు” అని ఆరోపించారు. 

హాస్టళ్లు, గురుకులాల్లో పురుగుల అన్నమా?

ప్రభుత్వ హాస్టళ్లలో, గురుకులాల్లో పురుగుల అన్నం వల్ల పిల్లలు ఆసుపత్రులపాలైతున్నారని సంజయ్​ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘లిక్కర్ స్కాంలో ప్రమేయమున్న సీఎం బిడ్డపై చర్య తీసుకోకుండా.. మంత్రులు, ఎమ్మెల్యేలంతా పోయి ఆమెను పరామర్శిస్తున్నరు” అని దుయ్యబట్టారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  ఎంపీ లక్ష్మణ్, పార్టీ నేతలు డీకే అరుణ, మురళీధర్ రావు, విజయశాంతి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, కూన శ్రీశైలంగౌడ్​ తదితరులు పాల్గొన్నారు. 

ప్రజలు విసిగిపోయారు: లక్ష్మణ్

సీఎం కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనలో ప్రజలు విసిగిపోయారని ఎంపీ లక్ష్మణ్ చెప్పారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నామన్నారు. వీఆర్ఏలు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం స్పందించట్లేదన్నారు. 

కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్ధాలే: డీకే అరుణ

అసెంబ్లీలో  సీఎం కేసీఆర్ అన్నీ అబద్ధాలే చెప్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. ఎక్కడ ఎలక్షన్ వస్తే.. అక్కడ కరెంట్ మీటర్లంటూ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

కేసీఆర్‌‌నే అసెంబ్లీకి రాకుండా చేస్త: ఈటల

‘‘నన్ను అసెంబ్లీ సమావేశాలకు రానీయకుండా కేసీఆరే నిషేధం పెట్టుకున్నాడు. కేసీఆర్‌‌నే అసెంబ్లీకి రాకుండా చేస్త అని చెప్పి వచ్చిన” అని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చెప్పారు. కేసీఆర్ తలకిందులుగా తపస్సు చేసినా మునుగోడులో టీఆర్ఎస్ గెలవదని, బీజేపీని గెలిపించాలని అక్కడి ప్రజలు డిసైడ్ అయ్యారని చెప్పారు.

హైదరాబాద్‌ను నాశనం చేసిండు: విజయశాంతి

హైదరాబాద్‌లో చెత్తమయం అయిపోయిందని, ఇది గార్బేజ్ హైదరాబాద్ అని బీజేపీ నేత విజయశాంతి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ను కేసీఆర్ సర్వనాశనం చేశాడని మండిపడ్డారు.

కేసీఆర్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేడు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం అనేది ఈ దశాబ్దంలోనే అతి పెద్ద జోక్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. దళితులను దగా చేసిన, పాలించే సత్తా లేని వ్యక్తి కేసీఆర్ అని ఫైర్ అయ్యారు. మోడీపై కల్వకుంట్ల కుటుంబం తప్పుడు ప్రచారం చేస్తున్నదని విమర్శించారు. దేశంలో కుటుంబ పాలన తేవాలని, కుటుంబ పార్టీలన్నింటినీ కలిపే ప్రయత్నం చేస్తున్నారని విరుచుకపడ్డారు. ఎన్డీయేకు కేసీఆర్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కానే కాలేడన్నారు. కేసీఆర్‌‌కు ఉన్నదే 7 సీట్లు.. ఇక ఆయన ఏం చేస్తాడో ప్రజలే ఆలోచించాలన్నారు.