ఎల్కేజీ చదువు నుంచి.. జీవితంలో ప్రతి వారికి స్నేహితులు ఉంటారు. అయితే ఎలాంటి వారితో స్నేహం చేయాలి... ఓ రైతు ఎద్దును కొనే కథ ద్వారా తెలిపిన కథను ఇప్పుడు తెలుసుకుందాం..
సీతాపురం అనే గ్రామంలో రంగయ్య స అనే రైతు ఉండేవాడు. ఆయన దగ్గర పొలం దున్నడం, బండి లాగటం కోసం ఎడ్లు ఉండేవి. తన దగ్గరున్న ఆవులను, ఎడ్లను సొంత బిడ్డల్లా చూసుకునేవాడు. అందులో ఒక ఎద్దు సోమరి. బాగా మేసి, హాయిగా నెమరు వేస్తూ కూర్చునేది. బండికి కడితే నిదానంగా లాగేది. ఆ ఎద్దును బాగా పనిచేయించడానికి ఒక చురుకైన ఎద్దును కొనాలి అనుకున్నాడు.
రంగయ్య, రెండింటినీ కలిపి బండికి కడితే.. చురుకైన ఎద్దును చూసి సోమరి ఎద్దులో మార్పు వస్తుందేమో అనుకున్నాడు. ఓ రోజు పక్క ఊరిలో పశువుల సంత జరుగుతుందని తెలిసి వెళ్లాడు. అక్కడ రంగయ్యకు పరిచయమున్న ఎడ్ల వ్యాపారి ఉన్నాడు. అయన దగ్గరకు వెళ్లి 'మంచి గిత్త కావాలి. అది పనుల్లో చురుగ్గా ఉండాలి' అని ముందే చెప్పాడు.
వ్యాపారి ఓ గిత్తను చూపిస్తూ.. "అయ్యా.. ఈ గిత్త చాలా చురుకైనది. బాగా పనిచేస్తుంది. తీసుకెళ్ళండి" అన్నాడు వ్యాపారి. అయితే.. రంగయ్య ఆ వ్యాపారితో "దీన్ని తీసుకెళ్లి, రెండు రోజులు పనిచేయించి, పనితనం బాగుంటే ఉంచుకుంటా. లేదంటే తిరిగి ఇచ్చేస్తా" అన్నాడు. అందుకు వ్యాపారి కూడా సరే అన్నాడు. రంగయ్య ఎద్దుని తీసుకొని ఇంటికి వెళ్లాడు. ఇల్లు చేరేసరికి సాయంత్రం అయ్యింది. ఎద్దుని ఇంటి పక్కనే ఉన్న పాకలో తొలి, గేటు వేసి ఇంట్లోకి వెళ్లాడు.
ఉదయాన్నే వెళ్లి ఎద్దుని చూశాడు రంగయ్య. పాకలో చాలా ఎడ్లు, ఆవులు ఉన్నా కొత్త ఎద్దు మాత్రం సోమరి ఎద్దు దగ్గరికే వెళ్లి కూర్చుంది. దాన్ని అక్కడి నుంచి దూరంగా తోలుకొచ్చి గడ్డి వేసి, ఇంట్లోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత వచ్చి చూస్తే... కొత్త ఎద్దు మళ్లీ ఆ సోమరి ఎద్దు దగ్గరకే వెళ్లి కూర్చుంది. వెంటనే ఆ ఎద్దుని తోలుకుని వెళ్లి వ్యాపారికి ఇచ్చేశాడు. "ఏమైంది రంగయ్యా రెండు రోజులు దీంతో పని చేయిస్తా అన్నావు కదా! ఒక్క రాత్రే ఉంచుకుని తోలుకొచ్చావు" అని ఆశ్చర్యపోతూ అన్నాడు వ్యాపారి.
“ఒక వ్యక్తి ఎలాంటి వాళ్లతో స్నేహం చేస్తున్నాడో చూసి, వాడు ఎలాంటి వాడో చెప్పేయొచ్చు. చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే మనకూ చెడ్డ అలవాట్లే అలవడతాయి. పాకలో చాలా ఎడ్లు ఉన్నా.. ఈ ఎద్దు మాత్రం సోమరి ఎద్దుతోనే స్నేహం చేయాలనుకుంది. అంటే.. ఇంకొన్ని రోజుల్లో ఇది కూడా సోమరిగా మారుతుంది. కాబట్టి ఈ ఎద్దు నాకొద్దు" అని చెప్పి వెళిపోయాడు.
-వీధుల రాంబాబు, భద్రాచలం–
