
లోక్ సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఇండియా కూటమి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. దీంతో 10 సంవత్సరాల తరువాత లోక్ సభలో తొలిసారిగా ప్రతిపక్ష నేతను చూస్తున్నాం. అయితే మొదటిసారిగా ప్రతిపక్ష నేతగా ఎన్నికైన రాహుల్ గాంధీకి ఎలాంటి అధికారాలు ఉంటాయ్.. ఆయన జీతం ఎంతో తెలుసుకుందాం.
పార్లమెంటు చట్టం 1977లో ప్రతిపక్ష నాయకుల జీతాలు, అలవెన్సుల ప్రకారం రాహుల్ గాంధీ జీతం రూ. 3.3 లక్షలు లభిస్తుంది. కేబినెట్ మంత్రికి ఉండే భద్రత కల్పిస్తారు. ఇందులో Z+ సెక్యూరిటీ కూడా ఉంటుంది. కేబినెట్ మంత్రి తరహా ప్రభుత్వ బంగ్లా ఉంటుంది. పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించే సమయంలో ముందు వరుసలో కూర్చోవాలి. కీలకమైన ప్యానెల్స్ లో రాహుల్ గాంధీ కూడా ఒక సభ్యుడిగా కొనసాగనున్నారు. ఎన్నికల కమిషనర్లు, సీబీఐ డైరెక్టర్ వంటి నియామకాలపై నిర్ణయం తీసుకునే ప్యానెల్ లో ప్రధాన మంత్రితో పాటు సభ్యుడిగా ఉండనున్నారు. ప్రభుత్వం తమ నేతలను లక్ష్యంగా చేసుకుని వారిని బెదిరించి బీజేపీలో చేర్చుకునేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలకు ఇది పెద్ద ఊపునిస్తుంది.
గాంధీ ఫ్యామిలీ నుంచి లోక్ సభలో ప్రతిపక్ష నేతగా పదవి చేపట్టనున్న మూడో నేతగా రాహుల్ నిలవనున్నారు. గతంలో రాజీవ్ గాంధీ, సోనియా ఈ పదవిలో ఉన్నారు. కాగా, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 10 శాతం (54) సీట్లు వచ్చి ఉండాలన్న రూల్ ఉంది. 2014లో కాంగ్రెస్ కు 44 సీట్లు, 2019లో 52 సీట్లు మాత్రమే గెలవడంతో ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేకపోయింది. తాజా ఎన్నికల్లో 99 సీట్లు సాధించడంతో మళ్లీ ప్రతిపక్ష హోదాను పొందింది