జీవితంలో కష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలి..?

V6 Velugu Posted on Aug 29, 2021

జీవితంలో కొన్నిసార్లు చాలా కష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియక గందరగోళంగా ఉంటుంది. బుర్రలో రకరకాల ఆలోచనలు తిరుగుతుంటాయి. ఆ పరిస్థితుల్లో ఎవరైనా పక్కన ఉండి గైడ్​ చేస్తే బాగుండనిపిస్తుంది. అలాంటప్పుడు దిక్సూచిగా మహాభారతం ఉంటుందనడం నూటికి నూరు పాళ్లు వాస్తవం. మన జీవితంలో ఎదురయ్యే చాలా సమస్యలకు, అంశాలకు పరిష్కార మార్గాలను చూపెడతాయి మహాభారతంలోని అనేక ఘట్టాలు. అందులో కొన్ని సందర్భాల్లోకి వెళ్లి చూస్తే మీకే అర్థమవుతుంది...

ఏ పని చేయడానికైనా.. ఆలోచించడానికైనా.. అడుగు ముందుకు వేయడానికైనా మొదట మనమీద మనకు విపరీతమైన నమ్మకం ఉండాలి. ఇది నిజానికి కొత్త సూక్తేమీ కాదు. ఎన్నోసార్లు ఈ విషయాన్ని చదివి, విని ఉంటాం. కానీ అందులోని అర్థాన్ని తెలుసుకోవడంలో విఫలమవుతుంటాం. మహాభారతం ఈ జీవిత సత్యం గురించి అర్థమయ్యేలా చాలా బాగా చెబుతుంది. ఒక పక్క పెద్దగా గాలి వాన కురుస్తున్నా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా... కంసుడి బారి నుంచి కృష్ణుడిని రక్షించేందుకు వసుదేవుడు కృష్ణుడ్ని ఒక బుట్టలో పెట్టుకుని తీసుకెళ్తాడు. పరిస్థితులకు ఎదురీది కృష్ణుడిని కాపాడతాడు. అలాగే పాండవులకు తమ మీద తమకు అపార నమ్మకం ఉండటం వల్ల కౌరవులపై పోరాడి విజయం సాధించారు. ద్రోణాచార్యుడు కర్ణుడికి విలువిద్య నేర్పించేందుకు అంగీకరించడు. అయినా తనపై తనకున్న నమ్మకంతో కర్ణుడు విలువిద్యలో మంచి పట్టు సాధించాడు. అంటే, ఏదేమైనా సరే, అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు. ఏదీ అసాధ్యంకాదని ఈ సంఘటలు చెప్పకనే చెబుతాయి.
ఏకాగ్రత ముఖ్యం
అలాగే, పని మొదలు పెట్టకముందే.. ఈ పని చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అని ఆలోచించి బుర్ర పాడుచేసుకోవద్దు. ఎలాంటి ఫలితం వస్తుందనే విషయం గురించి ఆలోచిస్తుంటే పని మీద ఏకాగ్రత ఉండదు. ఏకాగ్రత లేనప్పుడు పని సరిగ్గా చేయలేం. అందుకే ఫలితం గురించిన ఆలోచనను పక్కనబెట్టాలి. పనిచేయాలి. అలా చేసినప్పుడు అనుకున్న ఫలితం రాకపోతే నిరాశపడడం అనేది ఉండదు. అలాగే అనుకున్న ఫలితమే వచ్చినా గర్వం తలకెక్కదు. ముందు ముందు మరెటువంటి పనులైనా బాగా చేయొచ్చు. మత్స్యయంత్రం ఘట్టంలో అర్జునుడి ఏకాగ్రతే విజయుడ్ని చేసింది.

ఈ విశ్వంలో ఏదీ శాశ్వతం కాదు. ఈ విషయాన్నే కృష్ణుడు మహాభారతంలో స్పష్టంగా వివరించాడు. మార్పు అనేది ప్రకృతి సహజ ధర్మం. సాక్షాత్తూ శ్రీకృష్ణ పరమాత్ముడే తన జీవితంలో అనేక పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కన్నవారు ఒకరు. పెంచినవారు మరొకరు. పెరిగి, పెద్దయ్యాక గోకులంలో, బృందావనంలో ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం విడిచిపెట్టాల్సి వచ్చింది. జీవితంలో ఎదురైన అనేక మార్పులను, పరిస్థితులను ఎదుర్కొన్నాడు. అలాగే పాండవుల జీవితంలో కూడా మార్పు అనేది అనేకరకాలుగా ఎదురైంది. అరణ్య, అజ్ఞాతవాసాలు కూడా చేయాల్సి వచ్చింది. అందుకే ఎంతటివారైనా సరే మార్పును అంగీకరించి తీరాలనే జీవితసత్యాన్ని ఈ ఘట్టాలు ఎంతో సూటిగా చెప్పాయి. ద్రౌపది వస్త్రాపహరణం జరగకుండా శ్రీకృష్ణుడు ద్రౌపదిని రక్షించాడు. కృష్ణుడిపై ఆమె పెట్టుకున్న నమ్మకం వమ్ముకాలేదు. ‘‘గతజన్మలో పాపాల వల్ల ఇలాంటి ఇబ్బందులు నాకు ఎదురవుతున్నాయా?’’ అని ద్రౌపది కృష్ణుడిని అడుగుతుంది. అప్పుడు కృష్ణుడు ‘‘పాపాలు చేసే వాళ్లే గతజన్మలో కూడా పాపి అవడం వల్ల అదే ఫలితాన్ని అనుభవిస్తున్నారు” అని చెబుతాడు. అందువల్ల ఏది జరిగినా మంచికే జరుగుతుందని మహాభారతం స్పష్టం చేస్తోంది. ఏది? ఎందుకు? జరిగిందో ఆ కారణాన్ని ప్రస్తుతం మనం అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ తరువాత ఆ విషయాన్ని కాలమే మనకు విడమరిచి చెబుతుంది.

మహాభారత యుద్ధం తరువాత శ్రీకృష్ణుడు గాంధారిని ఓదార్చడానికి ఆమె వద్దకు వెళ్తాడు. అప్పుడామె ‘‘నీ వంశం కూడా నా వంశం నాశనమైనట్టే నాశనం కావాల’’ని కృష్ణుడిని శపిస్తుంది. యుద్ధాన్ని ఆపే శక్తి కృష్ణుడికి ఉన్నా ఆ ప్రయత్నం చేయలేదని అనుకుంటుంది. ఇది వాస్తవమే. అయితే ఇక్కడ మరో వాస్తవం కూడా ఉంది. అదే ధర్మాన్ని కాపాడటం. దాన్నే కృష్ణుడు తన ధర్మంగా భావించాడు. భవిష్యత్​ తరాల మంచి కోసం ఈ యుద్ధంలో గాంధారి పుత్రులు, అలాగే మరికొందరు బలవుతారన్న సంగతి కృష్ణుడికి తెలుసు. యుద్ధసమయంలో అర్జునుడికి ఇచ్చిన ఉపదేశంలో... ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం గురించి వివరంగా చెబుతాడు శ్రీకృష్ణుడు.                                                                                                                ::: వేద

Tagged life, God, , difficult situations

Latest Videos

Subscribe Now

More News