66 లక్షల భారతీయుల అకౌంట్స్ రద్దు చేసిన వాట్సాప్.. ఎందుకంటే?

66 లక్షల భారతీయుల అకౌంట్స్ రద్దు చేసిన వాట్సాప్.. ఎందుకంటే?

మెటా(Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌(WhatsApp) మరోసారి కొరడా ఝుళిపించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంది. 2023 జూన్ నెలలో ఏకంగా 66 లక్షలకు పైగా భారతీయుల ఖాతాలను నిషేధించింది. ఐటీ రూల్స్ 2021కి అనుగుణంగా మెటా ఈ చర్యలు తీసుకుంది.

2023 జూన్ 1 నుంచి 30 మధ్య మొత్తం 6,611,700 వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించగా.. ఇందులో 2,434,200 అకౌంట్లను యూజర్ల నుంచి ఫిర్యాదులు అందక ముందే వేటు వేసింది. వీటికి అదనంగా, వాట్సాప్‌కు 7,893 ఫిర్యాదుల నివేదికలు అందాయని తాజా నివేదికలో వెల్లడించింది. వీటిలో 337 అకౌంట్లపై చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది..

ఫిర్యాదు చేసే విధానం

మీరు ఏదేని వాట్సాప్ అకౌంట్‌పై ఫిర్యాదు చేయాలన్నా లేదా అభ్యంతరాలు తెలపాలన్నా వాట్సాప్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మీ సమస్యను వివరిస్తూ grievance_officer_wa@support.whatsapp.comకు మెయిల్ చేయవచ్చు.లేదా భారత వాట్సాప్‌ గ్రీవెన్స్ అధికారికి పోస్ట్ ద్వారా పంపవచ్చు. అభ్యంతరకరమైన, హానికరమైన కంటెంట్‌ను నిలిపివేసేలా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్ షేర్ చేస్తున్న వారి అకౌంట్లను నిషేధిస్తోంది.